Dr. Ramana V. Vasili: రమణ వ్యాసాలు: 3 సావిత్రి – అన్వేషణ – డా. రమణ వి. వాసిలి
మహాభారతంలో అశ్వపతి ఒక మహారాజు. అయితే అరవిందుని సావిత్రిలో అశ్వపతిని రాజుకన్నా ఒక మహాయోగిగా వర్ణించారు శ్రీ శార్వరి. యోగ విజ్ఞానం యావత్తూ అశ్వపతి పరంగా మానవాళికి అందిస్తారు శ్రీ అరవిందులు. ఈ ప్రపంచం ‘పూర్ణం’కావాలన్నది అశ్వపతి ఆశ, అరవిందుని యోగ సంకల్పం. సృష్టికి మూలకారణమైన జగన్మాత ‘సావిత్రి’, అశ్వపతి కలలపంట కూడా. అశ్వపతి యోగబలంతో జన్మించిన సావిత్రి, దివ్యశక్తి స్వరూపిణి. పోరాటం, విజయం రెండూ సావిత్రిలో కనిపిస్తాయి.
కారణజన్మురాలైన సావిత్రి జననం, అశ్వపతి సంరక్షణలో బాల్యం, యుక్తవయస్కురాలైన ఆమె జీవితం హృద్యమంగా శార్వరి – అరవిందులు వర్ణించడమే కాక యోగాత్మకతో మానవ జీవన రహస్యాలను విశ్లేషిస్తారు ఈ పుస్తకంలో. ప్రపంచం ఇవ్వగలిగినది అతి స్వల్పం కాని ఆత్మచైతన్యంతో పొందగలిగేది అనంతం. ప్రాపంచిక సుఖాలు పవిత్రమైన ఆధ్యాత్మిక తృష్ణను తీర్చలేవు. అన్నింటికీ అందాన్ని పంచిన పరమాత్మ సౌందర్యాన్ని మనం గుర్తించలేము, అది బాహ్యంగా మనకు కనిపించదు. ఈ సృష్టిలోని అన్ని శక్తులు చిట్టచివరికి ఈశ్వరీయతలో లీనమైపోతాయి అన్నది సత్యం.
పరలోకం కోరనప్పుడు చేరువై, కోరినప్పుడు దూరమవుతుంది. ఆత్మ చైతన్యం కొన్నిసార్లు కల్పనగా, మరికొన్ని సందర్భాల్లో మాయగా తోస్తుంది. పరాలోచన, పరచైతన్యం, పరమపదం కొన్నిసార్లు మహత్తర ఛాయగా అనిపించినా అది అందించే ఆనందం తప్ప జీవాత్మకు మరేదీ తృప్తి కలిగించదు.
సృష్టించ బడినదేది జీవించి ఉండదు. వస్తుతః మనం సంపాదించుకున్న సమస్తం ఇక్కడనే వదిలి పోవాలి. ఒక వ్యక్తి ‘మోక్షం’ పొందితే లోకం మొత్తం విముక్తమైనట్లు కాదు, మానవత ముందంజ వేసినట్లుగాదు.
ఎందరో మహయోగులు తలచినట్లే అశ్వపతికీ నిర్వాణ సుఖమయ, మోక్షమో పరమావధి కాదు. అశ్వపతి తాను కేవలం ఒక వ్యక్తి కాదు, మానవతకు ప్రతీక, ప్రతినిధి. ప్రపంచం కోసం, మానవ వికాసానికి సాధన చేసిన యోగపుంగవుడు. ఈ విచిత్ర విశ్వానికి ‘లయం’ పరమార్థం కాదు, నశించిపోవడమన్నది ఏకైక విముక్తం కాదు. తాను సాధించిన ఫలితాలు తనవి మాత్రమే కారాదని నమ్మిన రాజర్షి అశ్వపతి. తనకు సిద్ధించినవి లోకానికి ఉపకరించాలి, భవిష్యత్తులో మానవాళికి సైతం ఉపయోగపడేలన్నది ఆయన ఆకాంక్ష.
జగన్మాత ప్రతిరూపం ప్రకృతి, ప్రకృతే సావిత్రి!
జగన్మాత ప్రతిరూపమైన సావిత్రిని ఈ విధంగా దర్శిస్తారు శార్వరీరవిందులు.
ఆమె సుందర శరీరం బ్రహ్మనంద జ్యోత్స్నాసాగరం
ఆమె జన్మకు, విధికి, పరిశ్రమకు అతీతురాలు
అవి కాలచక్రంలో తిరుగుతూ ఆమె కోరినప్పుడు నిలచిపోతాయి.
కాలరక్కసిని ఆమె మాత్రమే సమూలంగా కబళించగలదు
నిశీధం తసలో దాచుకున్న రహస్యం ఆమెది
జీవాత్మ ప్రదర్శించే తాంత్రిక శక్తులన్నీ ఆమెవే
తానే సువర్ణ వారధ, తానే అఖండమైన అగ్ని
అగోచర తేజోపూర్ణ హృదయమే ఆమె
జగన్మాతే శబ్దశక్తి, ఆ జగన్మాతే మహాశక్తి
మనలో చిరుదీపాలను వెలిగించే దివ్యజ్యోతి ఆమె
అదృశ్యలోకాలనుండి ప్రసరించే ఆనందం కిరణం ఆమె
బ్రతుకు బాధల్ని ఆమె పాదస్పర్శతో తొలగించమని
మానవుని ఆత్మకు బంధించిన కవాటాలను భేదించమని
మూతపడిన హృదయాలలో జ్యోతుల్ని వెలిగించమని
సర్వప్రకృతి ముక్తకంఠంతో ఆమెనే ప్రార్థిస్తుంది.
మనిషి సామర్థ్యం పసివాని పట్టుదల వంటిది. చాచిన చేతులకు అందనంత దూరంలో, ఎత్తున వుంటుంది స్వర్గం. ఈ ప్రపంచం పూర్తిగా మారిపోవాలంటే నవ్యసృష్టి జరగాలి. దివ్యం కానిదంతా నశించిపోతుంది అందుకే జీవితాన్ని విశ్వప్రేమతో నింపివేయాలి అంటారు శ్రీ శార్వరి. సర్వప్రకృతి భగవంతుని చైతన్య స్వరూపమే అని తెలుసుకున్నప్పుడు అన్నింటిలోను అనశ్వరంగా వున్నది సచ్చిదానందం అన్నది అవగతమవుతుంది. జీవితంలో సాధించిన విజయాలతో తృప్తిపడటం ఎంత ముఖ్యమో, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు లోకానికి సాయపడటం అంతే ముఖ్యం. జగన్మాత స్వరూపమ్తెన సావిత్రి జన్మించింది ఒక మహత్కార్యానికి, యోగసిద్ధితో సంకల్పించింది లోకకళ్యాణానికి.
శార్వరి అరవిందులు మానవనైజన్ని ఈ విధంగా చెబుతారు. మనిషి చేయవలసిన పని పూర్తికాకుండానే ఫలితం ఆశిస్తాడు.
పరమాత్మ నేతృత్వంలో మనిషి వైఫల్యం అపజయం కాదు.
పరమాత్మ మార్గదర్శి అయినప్పుడు గమ్యం అగమ్యం కాదు.
నీవు ఆత్మోన్నతిని సాధించి, శ్రమించి, స్థిరపడు
కానీ నీ శ్రమ ఎంత విస్తృతమైనా, జ్ఞానానికి మాత్రం దూరం కావద్దు.
ఏ జీవికైనా పరమానందం, పరిపూర్ణానందం కలిగించేవి ఈశ్వరీయతను అనుభవంలోకి వచ్చినప్పుడు. అందుకోగలవారికి సచ్చిదానంద లోపలనే వుంది. అలా కాకుండా బయట ప్రయత్నించేవారికి అది ఎన్నటికీ లభ్యం కాదు. మానవహృదయాలు భౌతికసౌందర్యాన్నే వాంఛిస్తాయి. ఎంతటి మహాత్ముడైన ఒంటరి వాడే. జీవించవలసింది ఒంటరిగానే. పూర్ణంగా తన ఏకాంతంలోనే సంచరిస్తాడు. యోగి అయిన వాడు, తనవారి లేదా ఇతరుల ప్రావుకోసం ఆరాటపడడు. అతనికి సరైన జోడి అతనిలోని పరమాత్మ ఒక్కడే.
జీవిలో పరమాత్మ అదృశ్యంగా, అనారాధనీయంగా ఉంటుంది. అది తెలియని మనిషి నిగూఢ శక్తుల్ని వదిలి అల్పప్రయోజనాలు ఆశిస్తాడు. మహామాయలో వున్న జీవికి ఆత్మసంకేతాలు నిష్ప్రయోజనాలవుతాయి. మహర్షుల అనంత బోధనలన్నీ నిరుపయోగలే. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మన రూపాలకు జన్మనిచ్చిన పరమాత్మకు అన్నీ తెలుసు. ఆ పరమాత్మ చైతన్యాన్ని అందిపుచ్చుకోగలిగినవాడు ధన్యుడు, పుణ్యజీవి.
అశ్వపతి యోగఫలంగా సావిత్రి జన్మించింది. సావిత్రి బాల్యమూ ఒక అద్భుతం. ఆమె ప్రపంచంలోనే వున్నా ఎవరితోను కలవదు. ఆమె మానవి అయినా, ఆమెలో వున్నది దివ్యత్వం. యవ్వనంలోకి అడుగు పెట్టిన సావిత్రిలో మానసిక, ఆధ్యాత్మిక పరిణితి ప్రస్ఫుటంగా కన్పించేది. సావిత్రి రాజకుమారి, తండ్రి అశ్వపతి మద్ర దేశానికి అధిపతి. సావిత్రి అందచందాల గురించి పురుష ప్రపంచం చెప్పుకోసాగింది కాని ఎవరికీ ఆమెను ప్రేమించే ధైర్యం లేదు. పెండ్లాడే సాహసం చేయలేదు. తనకు అనుకూలమైన పతికోసం తానే అన్వేషణకు పూనుకుంది, రాచనగరు వదిలి వెళ్ళిపోయింది. ఇది ‘సత్యాన్వేషణ’, సత్యవంతుడి కోసం సావిత్రి చేసిన అన్వేషణ.
పరమాత్మని,
ఒకేఒక్క గుణం కోరుకో
అది నీ మంచిని పెంచేది.
ఒకేఒక్క వరం కోరుకో
అది నీ ఆత్మ ఔన్నత్యాన్ని పెంచేది.
Dr. Ramana V. Vasili
Spiritual Foundation
7062 Beringer Dr. S.
Cordova, Tennessee 38018, USA
Cell: 901-387-9646
ramanavvasili@hotmail.com






