YCP: వైసీపీలో పెరుగుతున్న నిశ్శబ్దం.. అనిశ్చితలో పార్టీ భవిష్యత్తు..
వైసీపీ (YSR Congress Party)లో ఇటీవలి కాలంలో కనిపిస్తున్న నిశ్శబ్దం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీస్తోంది. పార్టీ ఓటమి తర్వాత సాధారణంగా ఎదురుదాడి ఎక్కువగా ఉండాల్సిన సమయంలో, చాలా మంది కీలక నేతలు పూర్తిగా మౌనంగా ఉండటం ప్రశ్నలు లేవనెత్తుతోంది. కొందరు మాత్రమే మీడియా ముందుకు వచ్చి పార్టీ తరఫున మాట్లాడుతుండగా, మిగతావారు ఎందుకు వెనుకంజ వేస్తున్నారు అన్నదే ఇప్పుడు ప్రధాన అంశంగా మారింది.
పార్టీ పరిస్థితి కష్టంగా ఉన్నప్పుడు, బలమైన నాయకత్వం బయటకు వచ్చి కార్యకర్తలకు ధైర్యం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం అలాంటి దృశ్యం పెద్దగా కనిపించడం లేదు. అవకాశాలు లేవంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అవకాశం ఉన్నా కూడా చాలామంది నేతలు మీడియా ముఖం చూడకపోవడం పార్టీ శ్రేణుల్లో అసంతృప్తిని పెంచుతోంది. పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దన్న అప్రత్యక్ష ఆంక్షలున్నాయా? లేక స్వచ్ఛందంగా మౌనం పాటిస్తున్నారా? అన్న సందేహాలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు రాయలసీమ (Rayalaseema) వైసీపీకి బలమైన అడ్డాగా ఉండేది. అక్కడి నుంచి గట్టిగా పార్టీ వాయిస్ వినిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారినట్టుగా కనిపిస్తోంది. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి (Ketireddy Venkata Ramireddy) మాత్రమే తరచుగా మీడియా ముందుకు వచ్చి స్పందిస్తున్నారు. మిగిలిన నేతలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. ఇది సీమ కార్యకర్తల్లో అయోమయాన్ని కలిగిస్తోంది.
నెల్లూరు (Nellore) జిల్లా పరిస్థితి కూడా అంతే. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తన నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారన్న ప్రచారం తప్ప, జిల్లా స్థాయిలో పార్టీ తరఫున బలమైన ప్రకటనలు వినిపించడం లేదు. ఇతర నియోజకవర్గాల నేతలు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. ఉమ్మడి ప్రకాశం (Prakasam) జిల్లాలో అయితే వైసీపీ కార్యకలాపాలే కనిపించని స్థాయిలో నిశ్శబ్దం నెలకొంది.
విజయవాడ (Vijayawada), ఉమ్మడి కృష్ణాజిల్లా (Krishna district) పరిధిలో పేర్ని నాని (Perni Nani), దేవినేని అవినాష్ (Devineni Avinash) మాత్రమే అప్పుడప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీ వాయిస్ దాదాపు వినిపించడం లేదు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu) అవసరమైనప్పుడు మాత్రమే స్పందిస్తున్నారన్న అభిప్రాయం ఉంది.
ఉత్తరాంధ్ర (North Andhra) ప్రాంతంలో కూడా కొద్దిమందే కనిపిస్తున్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath), ధర్మాన సోదరులు (Dharmana brothers) అప్పుడప్పుడే మీడియా ముందుకు వస్తున్నారు. మొత్తం మీద చూస్తే, పార్టీ అంతర్గతంగా ఏదో అప్రకటిత నియంత్రణ నడుస్తోందా? లేక నాయకులే పరిస్థితిని గమనిస్తూ మౌనం పాటిస్తున్నారా? అన్న ప్రశ్నలు వైసీపీలో మరింత బలంగా వినిపిస్తున్నాయి. పార్టీ భవిష్యత్ దిశ ఏంటన్నది స్పష్టత రావాల్సిన సమయమిదే.






