Daggupati Prasad: వివాదాల సుడిగుండంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆశించిన అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఇప్పుడు పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ వరుస వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా ఆయనపై వస్తున్న ఆరోపణలు కేవలం వ్యక్తిగత విమర్శలకే పరిమితం కాకుండా, శాంతిభద్రతల సమస్యగా, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలుగా మారుతున్నాయి.
వివాదాల పరంపర మే 2025లో జిల్లా పరిషత్ సమావేశం వేదికగా ప్రారంభమైంది. జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ పట్ల ఎమ్మెల్యే ప్రసాద్, మరికొందరు అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆమె పర్సనల్ చాంబర్లోకి బలవంతంగా చొరబడి, మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోటో ఉండటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసభ్య పదజాలంతో దూషించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళా నాయకురాలి పట్ల ఎమ్మెల్యే తీరుపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఇక ఆగస్టు 2025లో వెలుగులోకి వచ్చిన ఒక ఆడియో క్లిప్ ఎమ్మెల్యే రాజకీయ జీవితంలో పెను తుపాను సృష్టించింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఆయన అసభ్య వ్యాఖ్యలు చేశారని, అనంతపురంలో ఆయన సినిమా ‘వార్ 2’ ప్రదర్శించకుండా అడ్డుకుంటామని బెదిరించారని ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమన్నారు. ఈ వ్యవహారం ముదిరి ఎమ్మెల్యే కార్యాలయంపై దాడులు, నిరసనలకు దారితీసింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుని మందలించడంతో, ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పి సర్దుబాటు చేసుకున్నప్పటికీ, అభిమానుల్లో ఆయనపై ఉన్న ఆగ్రహం చల్లారలేదు.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎమ్మెల్యేపై వస్తున్న ఆరోపణలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. జనవరి 13న అనంతపురంలోని ఒక ఎగ్జిబిషన్ వద్ద ఎమ్మెల్యే గన్‌మన్ షేక్ షా చేసిన హల్చల్ సంచలనం సృష్టించింది. నిర్వాహకుల నుంచి రూ.10 లక్షల మామూలు డిమాండ్ చేశారని, నిరాకరించినందుకు స్టాఫ్‌పై దాడి చేసి భయానక వాతావరణం సృష్టించారని బాధితులు వాపోతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గన్‌మన్‌ను సస్పెండ్ చేసినప్పటికీ, ఈ వ్యవహారం వెనుక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా, ఇటీవల ఎమ్మెల్యే అనుచరులపై మరిన్ని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అడిగినంత డబ్బు ఇవ్వలేదని ఒక వైన్ షాపును తగలబెట్టించారనే ఆరోపణలున్నాయి. విలువైన భూములను ఆక్రమించుకోవడం లేదా సెటిల్మెంట్ల పేరుతో బెదిరింపులకు దిగడం అలవాటుగా మారిందని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఆస్రా కళ్ల అద్దాల దుకాణానికి సంబంధించి ఒక భూ వివాదంలో ఎమ్మెల్యే తలదూర్చారు. అసభ్యకరమైన పదజాలంతో దుకాణం మహిళా యజమానిపై వ్యాఖ్యలు చేశారు. ఆ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ ఆరోపణలన్నింటినీ ఎమ్మెల్యే వర్గం ‘రాజకీయ కుట్ర’గా కొట్టిపారేస్తోంది. అయితే, జిల్లాలో ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, కేవలం దగ్గుపాటి ప్రసాద్ పైనే ఇన్ని రకాల ఆరోపణలు ఎందుకు వస్తున్నాయన్నది ప్రజల ప్రశ్న. నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా, ఆయన అనుచరుల అరాచకాలు శ్రుతి మించుతున్నాయని సామాన్య ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి, వసూల్ రాజా అవతారం ఎత్తడంపై ప్రజల్లో అసహనం పెరుగుతోంది.
తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకుంటున్న తరుణంలో, ఎమ్మెల్యే ప్రసాద్ వ్యవహారం పార్టీ అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది. బాధితులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం, పార్టీ నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. నిజానిజాలు విచారణలో తేలాల్సి ఉన్నప్పటికీ, ఒక ప్రజాప్రతినిధిగా ఆయన తన నైతికతను కోల్పోయారనే వాదన బలంగా వినిపిస్తోంది.






