CBN: కాకినాడలో ఏఎమ్ గ్రీన్ అమోనియా ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కాకినాడ, జనవరి 17 :- గ్రీన్ హైడ్రోజన్-గ్రీన్ అమోనియా ఉత్పత్తికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కీలకమైన రాష్ట్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టును కాకినాడలో ఏర్పాటు చేయటం సంతోషకరమని అన్నారు. ఈ ప్రాజెక్టుతో కాకినాడవైపు ప్రపంచం మొత్తం చూస్తుందని వ్యాఖ్యానించారు. 2029-30 నాటికి ఏఎమ్ గ్రీన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారాలని ఆకాంక్షించారు. శనివారం కాకినాడలో గ్రీన్ కో అనుబంధ సంస్థ ఏమ్ గ్రీన్ ఏర్పాటు చేస్తోన్న గ్రీన్ అమోనియా ప్లాంటుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్లాంట్ నమూనాను పరిశీలించారు. 495 ఎకరాల్లో, 2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తోన్న ఈ ప్లాంట్ పూర్తైతే ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల అమోనియా ఉత్పత్తి కానుందని సంస్థ ప్రతినిధులు వివరించారు.
2027 జూన్‌కు 1.5MMT గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం
ఈ ఏడాది సంక్రాంతి పండుగను ప్రజలు అద్భుతంగా జరుపుకున్నారని, ఇదే సమయంలో ప్రపంచం మొత్తం చూసే ఈ ప్లాంట్ శంకుస్థాపన జరగడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…‘30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌లోని తమ స్వస్థలాలకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చారు. హైదరాబాద్ నుంచి 3 లక్షల వాహనాల్లో పండగ కోసం ఏపీకి వచ్చారు. సంక్రాంతి వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యద్భుతంగా నిర్వహించారు. ఇదే సమయంలో ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రమోటర్లకు అభినందనలు. గత ఏడాది గ్రీన్ అమోనియా ప్రాజెక్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చాం. సరిగ్గా ఏడాదిలో కార్యరూపం దాల్చింది. 2027 జూన్ కల్లా గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. చరిత్ర తిరగ రాయటం తెలుగువాళ్ల వల్లే సాధ్యం అవుతుంది. కాకినాడ నుంచి జర్మనీకి గ్రీన్ అమోనియా సరఫరా అవుతుంది. గతంలో గ్రే అమోనియా తయారీని నాగార్జునా ఫెర్టిలైజర్స్ చేపట్టింది. ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రీన్ అమోనియా తయారు చేసి పర్యావరణహిత ఉత్పత్తులు తయారవుతాయి. పర్యావరణ సమతుల్యత సాధించటమే ప్రస్తుతం ఉన్న లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు జరుగుతున్నాయి’ అని సీఎం అన్నారు.
ప్రధాని మోదీ లక్ష్యాలకు అనుగుణంగా…
‘ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఆయన నిర్ధేశించిన లక్ష్యాన్ని అందిపుచ్చుకుని ఏపీలో 160 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. సోలార్ ప్యానెళ్లు ఇళ్లపై ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వినియోగదారులు ప్రోజ్యూమర్లుగా మారారు. ఏపీ తీర ప్రాంతంలో 20 పోర్టులు రాబోతున్నాయి. సౌర, పవన, జల విద్యుత్, పంప్డ్ స్టోరేజీ లాంటి విద్యుత్ ఉత్పత్తికి, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తికి ఏపీ అనుకూలమైన రాష్ట్రం. కాకినాడలో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఇథనాల్, గ్రీన్ మాలిక్యూల్స్ లాంటి ఉత్పత్తులు వస్తాయి. ఇకపై ప్రపంచంలో ఎక్కడైనా సరే గ్రీన్ ఎనర్జీ గురించి చర్చ వస్తే కాకినాడ పేరే వినిపిస్తుంది. గ్రీన్ హైడ్రోజన్, అమోనియా ద్వారా ప్రపంచ పటంలో కాకినాడ నిలుస్తుంది’ అని ముఖ్యమంత్రి అన్నారు.
ఏపీ క్లీన్-గ్రీన్ ఎనర్జీ పాలసీ దేశంలోనే భేష్
‘కాకినాడలోనే 2 గిగావాట్ల సామర్ధ్యం ఉన్న ఎలక్ట్రోలైజర్స్ తయారీకి ఏఎమ్ గ్రీన్ నిర్ణయించటం అభినందనీయం. ఏపీ క్లీన్, గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ-2024 దేశంలోనే అత్యుత్తమంగా ఉంది. పారిశ్రామిక రంగానికి అనుకూలమైన విధానాల ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావటమే మా ప్రభుత్వ లక్ష్యం. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. గ్రీన్ అమోనియా ద్వారా ప్రకృతి సేద్యానికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. తద్వారా పర్యావరణానికి మేలు, ప్రజల ఆరోగ్యానికి రక్షణ. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అభివృద్ధి జరిగి సంపద రావాలి. తద్వారా సంక్షేమం జరగాలి’ అని సీఎం అన్నారు.
ట్రాన్స్ మిషన్ నష్టాలు తగ్గించే ప్రయత్నం
‘దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే వచ్చాయి…దీనికి కారణం ఆంధ్రప్రదేశ్‌పై ఉన్న నమ్మకం. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు భారాన్ని రూ.1.19 మేర తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే యూనిట్‌కు 29 పైసల మేర కొనుగోలు భారాన్ని తగ్గించాం. ట్రాన్స్ మిషన్ నష్టాలు కూడా తగ్గిస్తాం. విశాఖకు 1 గిగావాట్ సామర్ధ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ ముందుకు వచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, క్వాంటం వంటి రంగాలపై దృష్టి సారించి భవిష్యత్‌కు నాంది పలికాం. ఈ ఏడాదిలోనే అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రంలో స్పేస్ టెక్నాలజీ లాంటి సాంకేతికతపై కూడా పెద్ద ఎత్తున పురోగతి సాధిస్తాం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా మారుతుంది. గ్లోబల్ సంస్థలు ఏపీ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని పిలుపునిస్తున్నాను. రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది’ అని పెట్టుబడిదారులకు ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.






