Telangana: శ్రుతి మించుతున్న తెలంగాణ పాలిటిక్స్
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సెన్సేషనల్ న్యూస్ ఛానల్ కథనం, దాని పర్యవసానాలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఒక మంత్రికి, ఐఏఎస్ అధికారికి మధ్య సంబంధం ఉందంటూ వచ్చిన కథనం కేవలం వ్యక్తిగత ఆరోపణల దగ్గరే ఆగకుండా.. అధికారం, వ్యాపార ప్రయోజనాలు, మీడియా యుద్ధంగా రూపాంతరం చెందింది.
ఒక ప్రముఖ వార్తా ఛానల్ ప్రసారం చేసిన కథనం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఒక మహిళా ఐఏఎస్ అధికారి గౌరవానికి భంగం కలిగించేలా, ఒక మంత్రితో ముడిపెడుతూ సాగిన ఈ ప్రసారం చివరకు ముగ్గురు జర్నలిస్టుల అరెస్టుకు దారితీసింది. అయితే ఈ వ్యవహారం వెనుక కేవలం గాసిప్ మాత్రమే లేదని, వందల కోట్ల రూపాయల వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయనే వాదనలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
తొలుత ఇది ఒక సాధారణ యల్లో జర్నలిజం కథనంగా కనిపించినప్పటికీ, ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తన కొత్త పలుకులో వెల్లడించిన అంశాలు ఈ కేసును మరో మలుపు తిప్పాయి. ఒడిశాలోని బొగ్గు గనుల టెండర్లే ఈ కథనానికి మూలమని తెలుస్తోంది. ఆ ఛానల్ అధిపతి అల్లుడికి చెందిన సంస్థకు ఆ మైన్స్ దక్కేలా చేయడంలో భాగంగానే సదరు మంత్రిని టార్గెట్ చేశారనేది ప్రధాన ఆరోపణ. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోదరుడి కంపెనీకి ఈ టెండర్లు దక్కకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ బ్లాక్ మెయిలింగ్ పర్వం సాగిందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే ఛానల్, ఒక మంత్రిని ఎందుకు టార్గెట్ చేసింది? అనే ప్రశ్నకు సమాధానంగా మంత్రుల మధ్య ఆధిపత్య పోరు అనే కోణం కనిపిస్తోంది. సదరు మీడియా అధిపతితో సన్నిహితంగా ఉండే మరో మంత్రి, ఈ కథనం వెనుక ఉండి నడిపించారా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలంగా ఉన్నాయి. తన సహచర మంత్రిని ఇబ్బంది పెట్టడం ద్వారా కేబినెట్ లో తన పట్టు నిలుపుకోవాలని సదరు అదృశ్య హస్తం ప్రయత్నించిందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్.
ఈ వ్యవహారంలో తన పేరు ప్రస్తావనకు రావడంతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. తన నిజాయితీని నిరూపించుకోవడానికి వివాదాస్పదంగా మారిన ఆ టెండర్లను రద్దు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇది ఒక రకంగా రాజకీయంగా సాహసోపేతమైన నిర్ణయం. తాను పదవిలో ఉన్నంతవరకూ అలాంటి గద్దలను, వ్యవస్థీకృత నేరస్థులను తెలంగాణ ఆస్తులపై వాలనివ్వబోనని భట్టి స్పష్టంచేశారు. తాను గాలివాటంగా రాజకీయాల్లోకి రాలేదన్నారు.
మీడియా నైతికతపై ఈ ఎపిసోడ్ తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. జర్నలిజం ముసుగులో ఆధారాలు లేకుండా ఒక మహిళా అధికారిని, మంత్రిని వ్యక్తిగతంగా కించపరచడం మీడియా స్వేచ్ఛ కిందకు రాదు. ఇది కేవలం వ్యాపార డీల్స్ కోసం జర్నలిజంను ఒక ఆయుధంగా వాడుకోవడమే. ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు, జర్నలిస్టుల అరెస్టు.. వ్యవస్థలను కించపరిస్తే సహించేది లేదనే బలమైన సందేశాన్ని పంపింది. సొంత పార్టీ మంత్రుల మధ్యే సమన్వయం లేదని, ఒకరిపై ఒకరు మీడియాను ప్రయోగిస్తున్నారనే సంకేతాలు వెళ్లడం ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించే అంశం.
వేమూరి రాధాకృష్ణ కథనం వెనుక ఉన్న సూత్రధారులను బయటపెడతానని భట్టి విక్రమార్క చేసిన సవాల్‌తో ఈ ఇష్యూ మరింత ముదిరేలా ఉంది. ఇది కేవలం ఒక ఛానల్ వేసిన కథనంతో ముగిసిపోయేలా లేదు.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు, అంతర్గత కుమ్ములాటలకు ఇది ఆరంభం మాత్రమే కావచ్చు.






