PM Modi: ఢిల్లీలో కర్తవ్య పథ్‌లో ‘సేవా తీర్థ్’ ప్రారంభించిన ప్రధాని
భారత పరిపాలనా కేంద్రమైన ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో సరికొత్త శకం మొదలైంది. దేశ రాజధానిగా ఢిల్లీని అధికారికంగా ప్రకటించిన 1931 నాటి చారిత్రక దినోత్సవాన్ని పురస్కరించుకుని, నూతనంగా నిర్మించిన ‘సేవా తీర్థ్’ సముదాయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శుక్రవారం నాడు జాతికి అంకితం చేశారు. ఈ భవనంపై దేవనాగరి లిపిలో ‘సేవా తీర్థ్’ అని శాసనాన్ని ఆవిష్కరించిన ప్రధాని, దానికింద “నాగరిక దేవో భవ” (పౌరులే దేవుళ్లు) అనే స్పూర్తిదాయక నినాదాన్ని ప్రతిష్ఠించారు. దశాబ్దాల పాటు రైసినా హిల్‌లోని సౌత్ బ్లాక్ నుంచి సేవలందించిన ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఇకపై ఈ అత్యాధునిక సేవా తీర్థ్ నుంచే పనిచేయనుంది. పీఎంవోతో పాటు దేశ భద్రత, పరిపాలనలో అత్యంత కీలకమైన కేబినెట్ సెక్రటేరియట్, జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్ కార్యాలయాలు కూడా ఈ సముదాయంలోకే మారనున్నాయి. వీటితో పాటే వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు నిలయంగా మారనున్న ‘కర్తవ్య భవన్ 1, 2’ భవనాలను సైతం ప్రధాని (PM Modi) ప్రారంభించారు.
కొత్త పీఎంవో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ప్రధాని మోదీ బడుగు, బలహీన వర్గాలు, మహిళలు, యువత, రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పలు కీలక దస్త్రాలపై సంతకాలు చేశారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడేందుకు ఉద్దేశించిన ‘పీఎం రాహత్’ పథకానికి ఆయన (PM Modi) ఆమోదముద్ర వేశారు. దీని ద్వారా బాధితులకు రూ. 1.5 లక్షల వరకు నగదు రహిత (క్యాష్‌లెస్) చికిత్స అందుతుంది. అలాగే గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారత కోసం ఉద్దేశించిన ‘లఖ్ పతి దీదీ’ పథకం పరిధిని మరింత విస్తరిస్తూ.. 2029 మార్చి నాటికి ఏకంగా 6 కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అన్నదాతలకు దన్నుగా నిలిచేందుకు వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని రూ. లక్ష కోట్ల నుంచి రూ. 2 లక్షల కోట్లకు రెట్టింపు చేశారు. దేశంలో యువతను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు, ముఖ్యంగా డీప్ టెక్, వినూత్న తయారీ రంగాలకు ఊతమిచ్చేలా ‘స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0’ కోసం రూ. 10,000 కోట్ల నిధిని మంజూరు చేస్తూ ప్రధాని మోడీ (PM Modi) చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.













