USAvsNED: అమెరికా వీర విహారం.. నెదర్లాండ్స్‌పై 93 పరుగుల భారీ విజయం!
టీ20 ప్రపంచకప్ సమరంలో అగ్రరాజ్యం అమెరికా తన సత్తా చాటింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను (USAvsNED) చిత్తుగా ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన అమెరికా.. ఆరెంజ్ ఆర్మీని 93 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అమెరికాకు ఓపెనర్లు కెప్టెన్ మోనాంక్ పటేల్ (36), షాయన్ జహంగీర్ (20) శుభారంభం అందించారు. అయితే మ్యాచ్ స్వరూపాన్ని మార్చింది మాత్రం తెలుగు తేజం సాయితేజ ముక్కమల్ల. 79 పరుగులతో విద్వంసకర ఇన్నింగ్స్ ఆడి జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు. చివర్లో శుభమ్ రాంజానే (48 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 196 పరుగుల భారీ స్కోరును సాధించింది. డచ్ బౌలర్లలో బాస్ డి లీడ్ మూడు వికెట్లతో మెరిశాడు.
ఇవి కూడా చదవండి
అనంతరం 197 పరుగుల కఠిన లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ (USAvsNED).. అమెరికా బౌలింగ్ ధాటికి కకావికలమైంది. ఏ దశలోనూ ఆ జట్టు లక్ష్యం దిశగా సాగినట్లు కనిపించలేదు. బాస్ డి లీడ్ (23), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (20) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. ముఖ్యంగా అమెరికా స్పిన్నర్ హర్మీత్ సింగ్ తన మణికట్టు మాయాజాలంతో డచ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. నాలుగు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిని కోలుకోనివ్వలేదు. షాడ్లీ వాన్ షాక్విక్ మూడు, మహమ్మద్ మొహ్సిన్ రెండు వికెట్లతో అతనికి సహకరించారు. దీంతో నెదర్లాండ్స్ (USAvsNED) కేవలం 15.5 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ భారీ విజయంతో అమెరికా రన్ రేట్ గణనీయంగా మెరుగుపడింది. అద్భుత బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మీత్ సింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.
ఇవి కూడా చదవండి













