Rafale Jets: భారత అమ్ములపొదిలోకి 114 కొత్త రాఫెల్స్!
భారత రక్షణ రంగ చరిత్రలో ఇదొక కీలక ఘట్టం. పొరుగు దేశాలైన చైనా, పాకిస్తాన్ నుంచి పొంచి ఉన్న ముప్పును దీటుగా ఎదుర్కోవడానికి, తగ్గుతున్న యుద్ధ విమానాల సంఖ్యను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (DAC) భారత వైమానిక దళం (IAF) కోసం ఫ్రాన్స్ నుంచి ఏకంగా 114 రాఫెల్ (Rafale Jets) యుద్ధ విమానాల కొనుగోలుకు పచ్చజెండా ఊపింది. దీంతోపాటు నేవీ కోసం పీ-8ఐ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూడా కొనుగోలు చేయనున్నారు. ఈ మొత్తం ఒప్పందం విలువ దాదాపు రూ. 3.60 లక్షల కోట్లుగా ఉండటం విశేషం.
గత కొన్నేళ్లుగా మిగ్-21 వంటి పాత తరం విమానాలు రిటైర్ అవ్వడంతో, మన వైమానిక దళంలో ఉండాల్సిన 42 స్క్వాడ్రన్ల సంఖ్య 29కి పడిపోయింది. ఈ ఆందోళనకర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం వేగంగా స్పందించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా సుమారు 18 (Rafale Jets) విమానాలను నేరుగా దిగుమతి చేసుకుని, మిగిలిన వాటిని సాంకేతిక బదిలీతో భారత్‌లోనే తయారు చేసేలా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు సమాచారం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ నెల 18న భారత్ రానున్న తరుణంలో ఈ ప్రక్రియ వేగవంతమైంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇప్పటికే మన వద్ద ఉన్న 36 రాఫెల్ (Rafale Jets) జెట్లు, నావికా దళం కోసం గతంలో ఒప్పందం కుదుర్చుకున్న 26 విమానాలు, ఇప్పుడు కొత్తగా రాబోయే 114 విమానాలతో కలిపి భారత్ వద్ద మొత్తం రాఫెల్ యుద్ధ విమానాల సంఖ్య 176కు చేరనుంది. ప్రధానమంత్రి నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) తుది ఆమోదం లభిస్తే, ఈ మెగా డీల్ పట్టాలెక్కుతుంది. ఈ నిర్ణయం భారత గగనతల భద్రతను శత్రుభేద్యంగా మార్చనుందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.













