MSVPG Review: ఫ్యామిలీ ప్యాకెడ్ ఎంటర్టైనర్ ‘మన శంకరవరప్రసాద్ గారు’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3.5/5
నిర్మాణ సంస్థలు: షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు : మెగా స్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయన తార, కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్,
శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం, రఘుబాబు తదితరులు నటించారు
సంగీతం: భీమ్స్ సిసిరోలియో, ఛాయాగ్రహణం : సమీర్ రెడ్డి, ఎడిటర్ : తమ్మిరాజు
ప్రొడక్షన్ డిజైనర్ :ఏ.ఎస్. ప్రకాష్, సహ రచయితలు: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
ఎగ్జిక్యూటివ్ నిర్మాత:ఎస్ కృష్ణ,
నిర్మాతలు : సాహు గారపాటి, సుస్మిత కొణిదెల
రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : అనిల్ రావిపూడి
విడుదల తేది : 12.01.2026
నిడివి : 2 ఘంటల 44 నిముషాలు
‘భోళా శంకర్’ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత మెగా బాస్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి (Anil Ravipudi)కలిసి చేసిన సినిమా ‘మన శంకరవరప్రసాద్ గారు’.(Mana Shankara Vara Prasad garu) ‘ఏంది బాసూ సంగతీ అద్దిరిపోద్ది సంక్రాంతి.. ఏంది వెంకీ సంగతీ ఇరగ్గదీద్దాం సంక్రాంతీ’ అంటూ ఈ రోజు థియేటర్స్ లలో సంక్రాంతి విందు భోజనం వడ్డించడానికి ఈ రోజు వచ్చేశారు శంకరవరప్రసాద్ చిరంజీవి, వెంకీ గౌడ వెంకటేష్ లు.(Chiranjeevi-Venkatesh) శ్రీమతి అర్చన సమర్పణలో షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి,(Sahu Garapati) సుస్మిత కొణిదెల(Susmitha Konidela) యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిర్మించిన ఈ పండగ బొమ్మ ప్రేక్షకులను ఏ మేరకు వినోదాన్ని పొందారో రివ్యూలో చూద్దాం.
కథ :
ఏ సినిమాకైనా ‘కథ, కథనం’ రెండూ చాలా ముఖ్యమైనవి. ఓ రకంగా ప్రాణం లాంటివి. కాని అనిల్ రావిపూడి సినిమాల్లో కథ, కథలో లాజిక్స్ కంటే స్క్రీన్‌ప్లే, అంతకుమించిన ఓ మ్యాజిక్ ఉంటుంది. ఇది ఆయన ఒప్పుకున్నాఒప్పుకోకపోయినా నిజం. ఎందుకంటే ఇప్పటివరకూ ఆయన తీసిన ఏ సినిమా చూసినా కథా పరంగా కొత్తగా ఏమి వుండదు పైగా పెద్దగా ఫ్రిక్షన్, మలుపులు అలాంటివేం ఉండవ్. కానీ ఆడియన్స్‌ని థియేటర్లకి రంపించే మ్యాజిక్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ‘మన శంకరవరప్రసాద్ గారు’తో అదే రిపీట్ చేశారు అనిల్ అనిల్. మరి ఈ సినిమా కథేంటి అంటే సింగల్ లైన్ లో చెప్పేయొచ్చు.
నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్ అయిన శంకరవరప్రసాద్ (చిరంజీవి).. మోస్ట్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ అయిన శశిరేఖ (నయనతార)ని తొలిచూపులోనే ఇష్టపడతాడు.. ఇక అదే ఇష్టం ఆమెకి కూడా కలగడంతో వెనువెంటనే మూడు ముళ్లూ పడిపోవడం, ఒక డ్యూయెట్ పడేలోపు ఒక పాపా, బాబు ఇద్దరు పిల్లలు పుట్టేస్తారు. అయితే తన ఆస్తి, ఐశ్వర్యం అన్నీ వదిలేసి ప్రసాద్‌తో తన కూతురు వెళ్లిపోయిందనే కోపంతో శశిరేఖ తండ్రి జీవీకే (సచిన్ ఖేడేకర్) అల్లుడు-కూతుర్ని తన ఇంటికి ఇల్లరికం గా తెసుకువచ్చి, తన కుట్రలతో విడదీసి డైవర్స్ ఇప్పించేస్తాడు. అలా పిల్లలకి ఆరేళ్లపాటు దూరమైన మన ప్రసాద్.. వాళ్లకి ఎలా దగ్గరయ్యాడు.. తిరిగి తన శశిరేఖని ఎలా కలుసుకున్నాడు. ఇక ఈ కథలో వెంకీ గౌడ (వెంకటేష్) పాత్ర ఏంటి..? జీవీకే పై ఎటాక్ ఎందుకు జరుగుతుంది? శశిరేఖని, ఆమె పిల్లల్ని ఎవరు చంపాలనుకున్నారు? అనేది తెరపై చూడాల్సిందే. ఈ ఫ్యామిలీ కథ ఎలా సుఖాంతమైంది అనేదే మిగిలిన కథ.
నటీ నటుల హవబవాలు :
స్క్రీన్ మీద మెగా స్టార్ ను చూసి ఫ్యాన్స్ తనివితీరా విజిల్స్ వేసి చాలా కాలమే అయింది. ఆ కోరికని బాస్ ఇస్ బ్యాక్ అన్నట్లు మన శంకరవరప్రసాద్ గారు ఖచ్చితంగా తీర్చారని చెప్పొచ్చు. ముఖ్యంగా సినిమా మొదలైన ఫస్ట్ సీన్ నుంచి శుభం కార్డు పడే వరకూ చిరంజీవి స్టైల్, స్వాగ్, ఎప్పీరియన్స్, లుక్స్ చూసి ఫ్యాన్స్ ఖచ్చితంగా బాస్ ఈజ్ బ్యాక్ అనుకొని ఉంటారు. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ప్రతి ఫ్రేమ్‌లోనూ చిరంజీవే కనిపించేట్టుగా రావిపూడి రచించిన మెగా స్వేగ్ బుక్ అంటే ‘మనం శంకరవరప్రసాద్ గారూ’ ఓవైపు కామెడీని మరోవైపు హీరోయిజాన్ని అవలీలగా మోస్తూ ఒకప్పడు మనం చూసిన అదే మెగాస్టార్‌లా.. వింటేజ్ చిరంజీవిలా బాస్ కనిపించారు. ముఖ్యంగా ఆయన ఇందులో పండించిన కామెడీ గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, జై చిరంజీవ, అందరివాడు లాంటి సినిమాల్ని మరోసారి గుర్తుచేస్తాయి. ఇక డ్యాన్స్ అంటే బాస్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హుక్ స్టెప్ పాటలో చిరు వేసిన స్టెప్పులకి ఫ్యాన్స్ విజిల్స్ వేయడం పక్కా. అలానే ఎమోషనల్ సీన్లలో కూడా చిరు చాలా రోజుల తర్వాత తన మార్క్ చూపించారు. ఊటీ లో పిల్లల్ని కలుసుకోవాడానికి వెళ్లినప్పుడు.. ‘మా నాన్న అంటే మీలా ఉండాలి’ అని కన్నకూతురు అన్నప్పుడు చిరు కళ్లలో నుంచి కారే కన్నీటిబొట్లు కనిపించకుండా పలికించిన భావోద్వేగాలు ఆయన నటనకు మరోసారి అద్దంపట్టాయి. ఫాదర్ సెంటిమెంట్ సీన్లు మిడిల్ క్లాసు ఫ్యామిలీ ఆడియన్స్ ఓన్ చేసుకుంటారు.
ఇక చిరుకి జోడీగా శశిరేఖ పాత్రలో నయనతార చూడటానికి చాలా అందంగా కనిపించారు. ఆమె ఈ సినిమాలో కనిపించినంత స్టైలిష్‌గా ఈ మధ్య కాలంలో అయితే ఏ మూవీలోనూ కనిపించలేదు. చీర కట్టినా, సూట్ వేసినా, మోడ్రన్ లుక్‌లో మెరిసినా ప్రతి చోటా నయన్ కూడా ఒకప్పటి గ్లామర్ క్వీన్‌లా మెరిశారు. తన పాత్రని అలా అలా ఈజ్‌తో ఈజీగా చేసుకుపోయారు. చిరంజీవి నయనతారల మధ్య కెమిస్ట్రీ కూడా చాలా బాగా కుదిరింది. ఇక సెకండాఫ్‌లో వెంకీ రాకతో థియేటర్లు దద్దరిల్లాయి. వెంకీ గౌడ పాత్రలో వెంకీ కనిపించిన తీరు, పండించిన కామెడీ.. ముఖ్యంగా మెగాస్టార్-వెంకటేష్ కాంబోలో పడిన ప్రతి సీన్ థియేటర్లో గట్టిగానే పేలింది. అందులోనూ ఒకరి హిట్ సాంగ్స్ కి మరొకరు పోటాపోటీగా స్టెప్పులు వేసిన సన్నివేశాలు అయితే ఇరువురి ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. ఏదో అతిధి పాత్ర అనుకున్నాం కాని, వెంకటేష్ అనుకున్న దానికంటే ఎక్కువసేపే కనిపించారు. అలానే క్లైమాక్స్‌లో కూడా జైలర్ టెంప్లెట్‌ని అనిల్ రావిపూడి ఫాలో అయినట్లు అనిపించింది. ఇక మిగతా పాత్రలలో కేథరిన్ థ్రెసా, సచిన్ ఖేడేకర్, శరత్ సక్సేనా, హర్షవర్ధన్, అభినవ్ గోమఠం రఘుబాబు ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకి న్యాయం చేశారు. చిరు తల్లిగా చేసిన జరీనా వహాబ్ కూడా సెకండాఫ్‌లో ఒక సీనులో తన నటనతో మెప్పించారు. చిరంజీవి-నయన్ పిల్లలుగా కనిపించిన ఇద్దరూ క్యూట్‌గా ఉన్నారు అలానే యాక్టింగ్ కూడా బాగా చేశారు. ముఖ్యంగా బుల్లిరాజు (మాస్టర్ రేవంత్) ఎపిసోడ్స్ అయితే మరో సారి బెస్ట్ లెవెల్లో వర్కౌట్ అయ్యాయి.
సాంకేతిక వర్గం పనితీరు :
ఇక సినిమాలో మరో సర్ప్రైజింగ్ విషయం భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, భీమ్స్ ఇచ్చిన సాంగ్స్ వినడానికే కాదు చూడటానికి కూడా స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించాయి.. వినిపించాయి. ఇక బీజీఎమ్ కూడా ఎక్కడ ఎంత కావాలో అక్కడ అంత చాలా పద్ధతిగా ఇచ్చాడు. సమీర్ రెడ్డి విజువల్స్ అన్నీ చాలా రిచ్‌గా ఉన్నాయి. చిరంజీవిని చాలా అందంగా చూపించారు. సినిమాటోగ్రఫీ సహా మిగిలిన అన్నీ క్రాఫ్ట్స్‌తో అనిల్ రావిపూడి వర్క్ చేయించిన తీరు స్క్రీన్ మీద బాగా తెలిసింది. అనీల్ రావిపూడి సినిమాలను ఇష్టపడేవాళ్లు లాజిక్‌లు వెతకుండా వినోదాన్ని ఆస్వాదిస్తారు. నచ్చని వాళ్ళు అలా జరుగుతుందా? ఇలా ఉంటుందా? అని మేధావుల్లా ఆలోచిస్తారు. ఇలాంటి వాటిని ఆయన పట్టించుకోరు. ప్రేక్షకుడికి నచ్చిందే చేస్తా..అని పక్కా ఎంటర్ టైన్మెంట్ మాత్రమే ఇస్తా అని ఈ పండక్కి మాత్రం చిరు, వెంకీతో కలిసి సంక్రాంతి విందు భోజనం అందించారు. ఆరగించినోళ్లకి ఆరగించినంత.. మెగా అభిమానులకు మాత్రం నిజమైన పండగే. సినిమా అంటే ఆడియన్స్‌కి కావాల్సిన వినోదం అందాలి.. థియేటర్స్ హౌస్ ఫుల్ కావాలి.. నిర్మాతలకు డబ్బులు రావాలి.. రికార్డులు బద్దలు కొట్టాలి! ఇది అనీల్ రావిపూడి సక్సెస్ ఫార్ముల కాబట్టి.. ‘మనం శంకరవరప్రసాద్ గారు’తో రిపీట్ మరో సారి రిపీట్ చేసాడు అనీల్ రావిపూడి. దర్శకుడు అనీల్ రావిపూడి మీద ఒక మీమ్ లాంటిది ఉంటుంది. ‘నేను మీకు దొరకనురా’ అని అది నూటికి నూరుపాళ్లు నిజమే అని ఈ సినిమా చూసిన ఆడియెన్స్ కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
విశ్లేషణ :
ఇద్దరు సీనియర్ సూపర్ స్టార్స్ ని తన చేతికిచ్చి ఒక సాలిడ్ ఎంటర్టైనర్ తీయమని ఫ్రీడమ్ ఇస్తే ఎలా ఉంటుందో అందుకు కావాల్సిన సామాగ్రి అంతా కూడబెట్టి ఈ సంక్రాంతికి ఇళ్లలో చేసుకునే కలగూర తరహాలో ఫ్యామిలీ ప్యాకెడ్ ఎంటర్టైనర్ గా, సినిమా ఆద్యంతం ఎక్కడా బోర్ లేకుండా మంచి ఎంటర్టైనింగ్ గా వెళ్లిపోతూనే ఉంటుంది. ఇక మెగాస్టార్ నుంచి చాలా కాలంగా మిస్ అవుతున్న వింటేజ్ కామెడీ అండ్ మాస్ వైబ్స్ ని ఇందులో దర్శకుడు పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశారు. మెగాస్టార్ స్వాగ్ గాని ఎమోషన్స్ గాని ముఖ్యంగా కామెడీ టైమింగ్ ఇందులో అదిరిపోయాయి. మెగాస్టార్ నుంచి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పుష్కలంగా ఉన్నాయి. అదే విధంగా వెంకీ మామ ఎపిసోడ్స్ అయితే ఆడియెన్స్ కి బోనస్. ఇక ఇద్దరి కాంబినేషన్ లో సీన్స్ అయితే ట్రీట్ గా నిలుస్తాయి. అంతే కాకుండా అనీల్ రావిపూడి మార్క్ ఆసనాలు, ప్రతిజ్ఞలు లాంటివి కూడా థియేటర్స్ లో భలే పేలుతాయి. ఫస్టాఫ్ లో అయితే సాలిడ్ హిలేరియస్ సీక్వెన్స్ లు ఒకదాని తర్వాత ఒకటి పడుతూనే ఉంటాయి. మీరు నవ్వుకోండి అన్నట్టు అనీల్ డిజైన్ చేసి ఆడియెన్స్ మీదకి వదిలేసారు. ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే పండగకి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ . తమ కోసం థియేటర్స్ కి వచ్చిన ఆడియెన్స్ ని ఏమాత్రం డిజప్పాయింట్ చేయకుండా పంపుతారు. హిలేరియస్ గా సాగే సాలిడ్ కామెడీ ఎపిసోడ్స్ అన్ని వర్గాల ఆడియెన్స్ ని థియేటర్స్ లో అలరిస్తాయి. వీటిని మించి అనీల్ రావిపూడి వర్క్ బ్యాలన్స్డ్ గా ఉంది. ఇవే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషన్స్ తో కూడిన ఈ చిత్రంని ఈ పండుగకి థియేటర్స్ లో చూసి ఎంటర్టైన్ అవ్వొచ్చు.






