The Raja Saab Review: అయోమయం లో ‘ది రాజా సాబ్’
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.25/5
నిర్మాణ సంస్థ : పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు : ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్, బొమన్ ఇరానీ, తదితరులు
సంగీతం : తమన్, ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వరరావు
సినిమాటోగ్రఫీ : కార్తీక్ పళని, ఫైట్ మాస్టర్ : రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : ఎస్ కేఎన్
నిర్మాతలు : టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్
రచన, దర్శకత్వం : మారుతి
విడుదల తేది : 09.01.2025
నిడివి : 3 ఘంటల 9 నిముషాలు
2024లో ‘కల్కి 2898ఏడీ’తో తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సినిమా 2025లో ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ కు సంబంధించిన ఎలాంటి సినిమా వస్తుందన్నా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా పండగే. దీంతో ఆయన్ని సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈ సంక్రాంతి కానుకగా ‘ది రాజాసాబ్’గా థియేటర్లలో అడుగుపెట్టారు రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని ఆయన ఎలా డీల్ చేస్తాడోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణం లో ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం లో ఫస్ట్ టైమ్ హార్రర్ ఫాంటసీ కామెడీ జోనర్‌ని ట్రై చేశారు. పైగా ముగ్గురు హీరోయిన్లు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బ్యానర్ లో ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం 8వ తేదీనే ప్రీమియర్స్ ద్వారా థియేటర్లలో అడుగుపెట్టింది. ప్రభాస్-మారుతి (Prabhas-Maruthi) కాంబినేషన్ ప్రేక్షకుల్ని మెప్పించిందా?.. తొలిసారి హారర్ జోనర్లోకి అడుగుపెట్టిన ప్రభాస్ ఈ సంక్రాంతికి హిట్టు కొట్టాడా? అన్నది రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
ఓ రాజకుమారిపై మనసు పడిన ఓ స్వార్థపరుడి కథ ఇది. ఈ లోకంలో అన్నింటికీ డబ్బు ప్రధానం అనుకునే కనకరాజు (సంజయ్ దత్) దేవనగర సామ్రాజ్య జమిందారిణి అయిన గంగా దేవి(జరీనా వాహెబ్)పై కన్నేస్తాడు. అయితే రాజు(ప్రభాస్)కి అమ్మనాన్న లేరు. తన నానమ్మ గంగవ్వ నే ప్రాణంగా బతుకుతుంటాడు. నానమ్మకు తను, తనకు నానమ్మనే అన్నీ. వీరికి అనిత(రిద్ధి కుమార్) సపోర్ట్ చేస్తుంటుంది. అయితే నాన్నమ్మకి కొన్ని ఏళ్లుగా తన భర్త కనకరాజు కోసం వెతుకుతుంటుంది. ఆయన కొన్నేళ్ల క్రితం తన సంపదని దోచుకొని వెళ్లిన గంగరాజు(సముద్రఖని)ని పట్టుకునేందుకు వెళ్తాడు. మళ్లీ తిరిగిరాడు. దీంతో తన భర్త కోసం ఆమె ఎంతో తపిస్తుంది. ఎప్పుడూ ఆయన గురించే ఆలోచిస్తూ మతిమరుపు కూడా తెచ్చుకుంటుంది. తాతని వెతికి తీసుకురమ్మని మనవడు రాజుని కోరుతుంది. హైదరాబాద్‌లో కనకరాజు ఉన్నాడని తెలిసి రాజు వెతకడానికి వెళ్లి పోలీసులను ఆశ్రయిస్తాడు.
అక్కడ క్రిస్టియన్ అమ్మాయి బ్రెస్సీ(నిధి అగర్వాల్)ని చూసి ఫిదా అవుతాడు. చర్చ్‌లో ఓ పాప హార్ట్ ఆపరేషన్ కోసం మూడు లక్షలు కూడా ఇస్తాడు. కానీ ఆ డబ్బుని కనకరాజు కాజేశాడని బ్రెస్సీ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అ సమయంలోనే గంగరాజు మనవరాలు భైరవి(మాళవిక మోహనన్) సూట్ కేసులో భారీగా డబ్బుతో ఎంట్రీ ఇస్తుంది. వీరంతా కలిసి గురించి వెతకగా ఆయన నరసాపూర్ ఫారెస్ట్ లో ఒక కోటలో ఉంటున్నాడని గంగరాజు ద్వారా తెలుస్తుంది. తన పోలీస్ బాబాయ్ (వీటీవీ గణేష్), స్నేహితుడు ప్రభాస్ శ్రీను (ప్రభాస్ శీను), భైరవిని తీసుకుని ఆ కోటలోకి వెళ్తారు. మరి అక్కడ రాజు తన తాతని కలిశాడా? తన నానమ్మ కోరిక తీర్చాడా? ఆ కోటలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అందులో ఉన్న దెయ్యం ఎవరు? కనకరాజుకి డబ్బు అంటే ఎందుకంత పిచ్చి? ఇంతకి అతని వెనుకున్న కథేంటి? దేవనగరి సామ్రాజ్యం జమిందారిణి గంగాదేవి కథేంటి? ఆమె గంగవ్వగా ఎలా మారింది? దేవనగరి సామ్రాజ్యంలోని సంపదనంతా దొంగిలించింది ఎవరు? దీనికి గంగరాజుకి ఉన్న సంబంధమేంటి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానమే ‘వి’ చిత్రం కథ.
నటీనటుల హావభావాలు:
చాల కాలం తరువాత ఈ సినిమాలో ప్రేక్షకులు వింటేజ్ ప్రభాస్‌ని చూస్తారు. ఏ విషయాన్నైనా సరదాగా తీసుకోవడం, బాగా వెటకారం కలగలిపిన ఆ క్యారెక్టర్లో వింటేజ్ ప్రభాస్ కనిపిస్తాడు. నాయనమ్మ కోసం ఎంతకైనా తెగించే మనవడిగా, ముగ్గురు భామల మధ్యలో ఇరుక్కున్న ప్రియుడిగా, తాత నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత అతడిని ఎలాగైనా అంతమొందించాలన్న పట్టుదలతో ప్రాణాలను సైతం లెక్కపెట్టక పోరాడటం వంటి సీన్స్‌లో ప్రభాస్ అలరించారు. ముఖ్యంగా ప్రభాస్ లుక్, మేనరిజం, డైలాగ్ డెలివరీ చాలా కొత్తగా ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభాస్ నుంచి వరుసగా వస్తోన్న యాక్షన్ సినిమాలు చూసి బోర్ కొట్టేసిందనుకుంటోన్న ప్రేక్షకులకి ఈ సినిమా కాస్త ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. దీనికితోడు చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ఇందులో కామెడీ చేయడం విశేషం. ఇక కనకరాజుగా సంజయ్‌దత్ విశ్వరూపం చూపించారు.
డైలాగులు తక్కువైనా, తన నటనతో మెప్పించారు. ప్రభాస్ నాయనమ్మగా నటించిన జరీనా వాహెబ్ సెంటిమెంటుతో పిండేసింది. సినిమా అంతా సాధారణ మహిళగా కనిపించినప్పటికీ, క్లైమాక్స్‌లో రాణిగా ఆమె ఎంట్రీ అదిరిపోతుంది. ఇక హీరోయిన్లు నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్‌లకు అందాల ఆరబోత తప్ప కథలో పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. ముగ్గురిలో మాళవికా మోహనన్‌కి కాస్త ఎక్కువ స్పేస్ దక్కింది. ముగ్గురు గ్లామర్‌తో మెప్పించారు అంతే !. సముద్రఖనిని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. వీటీవీ గణేష్, ప్రభాస్ శ్రీను, సప్తగిరి, సత్య పెద్దగా నవ్వించలేకపోయారు. బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ సైక్రియాటిస్ట్ పద్మభూషణ్‌గా కీలక పాత్రలో కనిపించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
తమన్ మ్యూజిక్ కూడా పెద్దగా ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా తమన్ నేపథ్య సంగీతంతో సినిమాను నిలబెట్టేస్తాడనే పేరుంది. కానీ ‘ ది రాజాసాబ్’లో అవసరమైన దానికంటే అనవసరమైన దరువులే ఎక్కువ వినిపిస్తాయి. పాటలు ఏ మాత్రం మెప్పించలేదు. వాటికి లాంగ్ రన్ లేదు. క్లైమాక్స్ లో బీజీఎం వాహ్ అనేలా ఉంది అంతే! మిగతా అంతా సినిమాకు అవసరం అయిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నార్మల్ గా వుంది . కార్తీక్ ఫలనీ కెమెరా వర్క్ బాగుంది. వీఎఫ్ఎక్స్ స్పెషల్ ఎట్రాక్షన్. ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి.ఈ సినిమాకు కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ తేలిపోయింది. ఇంకా ట్రిమ్ చేయాల్సిన అవసరం వుంది. నిజం చెప్పాలంటే ఈ సినిమాకు ఆర్ట్ స్పెషల్ హైలైట్. కలనైపున్యంతో విజువల్ గ్రాండియర్‌ని అందించాడు. కొన్ని సీన్లలో గ్రాఫిక్స్ వర్క్ నాసిరకంగా ఉంది. ఈ విషయంలో మేకర్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సిందేమో అనిపిస్తుంది. దర్శకుడు మారుతి ఎంచుకున్న కథ అనుసారంగా దాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో కొంత వరకే సక్సెస్ అయ్యాడు. స్టార్ హీరోలను డీల్ చేయలేకపోయడనిపించింది.
కథ పరంగా చూస్తే అంత కొత్తదనమేదీ కనిపించదు. కథ పాతదైనా ప్రేక్షకుల్ని ఎలా మెప్పించామన్నది దర్శకుడి ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో మారుతి కాస్త తడబడినట్లే అనిపిస్తోంది. ప్రభాస్‌ని లుక్‌లో చాలా ఛేంజస్ కనిపిస్తుంటాయి. ఒక్కో చోట ఒక్కోలా కనిపిస్తుంటాడు. ఒకసారి భలే బావున్నాడే అనిపిస్తుంది.. కొన్ని షాట్స్‌లో మాత్రం ఇదేంటి ఇలా ఉన్నాడు అనిపిస్తుంటుంది. ఈ కన్ఫుజన్ ఎక్కడా వచ్చిందో? సినిమా ప్రారంభంలోనే సత్య ఎపిసోడ్‌తో కాస్త ఉత్కంఠ కలిగించినా ఆ తర్వాత ప్రభాస్ ఎంట్రీ చూపించి సుమారు గంట పాటు స్టోరీని అక్కడక్కడే తిప్పుతూ చూపించాడు. స్క్రీన్ పరంగా మరింత కేర్ తీసుకోవాల్సింది. స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్‌గా రాసుకోవాల్సింది. ఇంకా కామెడీపై బాగా వర్క్ చేయాల్సింది. ప్రభాస్ పాత్రని బాగా మలిచాడు కానీ ఫస్టాఫ్‌లో ఆ లోటు కనిపిస్తుంది. క్లైమాక్స్ ని మరింత అర్థవంతంగా, మరింత గ్రిప్పింగ్‌గా, గూస్ బంమ్స్ తెప్పించేలా చేస్తే సినిమా అదిరిపోయేది.
విశ్లేషణ:
హర్రర్ కామెడీ చిత్రాలు చాలా కాలంగా వస్తూనే ఉన్నాయి. వాటిలో చాలా వరకు ఆకట్టుకుంటున్నాయి. అయితే ప్రభాస్ మొదటిసారి ఈ జోనర్ మూవీ చేయడం, ఫాంటసీ ఎలిమెంట్లు, రొమాన్స్ మేళవించడం, పూర్తి ఎంటర్టైన్మెంట్గా దీన్ని రూపొందించడం ఈ మూవీ స్పెషాలిటీ. దీనికితోడు చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ఇందులో కామెడీ చేయడంతో సినిమాపై అంచనాలను పెంచాయి. మరి ఆ అంచనాలను ఈ మూవీ అందుకుందా? అంటే ఆ విషయంలో సరైన నిర్ణయం కాదనిపించింది. చాలా వరకు డిజప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. అయితే టెక్నీకల్‌గా అయినా బాగుందా అంటే… అక్కడకూడా నిరాశే ఎదురైంది. ఎంచుకున్న కథ కొత్తగా బాగుంది. ఇలాంటి కథతో సినిమాలు రాలేదని చెప్పొచ్చు. అంతేకాదు ఇందులో మెయిన్ ప్లాట్‌ని చూపించిన తీరు కూడా కొత్తగా ఉంటుంది. ఎంగేజింగ్‌గా ఉంటుంది. సినిమా ఫాంటసీ హర్రర్ కామెడీ అన్నారు, కానీ ఎక్కువగా సైకలాజికల్ థ్రిల్లర్ ఎలిమెంట్లు కూడా ఉన్నాయి.
ఫస్టాఫ్‌లో కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు. కానీ సెకండాఫ్‌లో కాస్త నవ్వించింది. మెప్పించింది. సైకలాజికల్ అంశాలు చూపించిన తీరు బాగున్నాయి. మొత్తానికి క్లైమాక్స్ తో బాగానే హడావుడి చేశారు. పార్ట్ 2కి కూడా లీడ్ ఇవ్వడం విశేషం. ఓవరాల్‌గా మూవీలో ఫస్టాఫ్‌లో స్లోగా అనిపిస్తుంది. సెకండాఫ్ కొంత కవర్ చేశారు. అయితే చాలా చోట్ల కామెడీ సీన్లు తేలిపోయాయి. ఫస్టాఫ్‌లో ఏమాత్రం వర్కౌట్ కాలేదు. ఇరికించినట్టుగానే ఉన్నాయి. చాలా లాజిక్ లెస్‌గా అనిపిస్తాయి. ఎంత సేపు అక్కడక్కడే తిరుగుతుంటుంది. ముందుకు కదలదు. అదే సమయంలో లవ్ ఎపిసోడ్లు కూడా కనెక్ట్ అయ్యేలా లేవు. అవే సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. ఇలా భారీ అంచనాలతో థియేటర్‌కి వెళ్లే అభిమానుల్ని మాత్రం ‘ది రాజాసాబ్’ కాస్త నిరాశపరచొచ్చు.






