Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అభిమాని కథ
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థ : మైత్రీ మూవీ మేకర్స్
నటీనటులు : రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ తది తరులు నటించారు.
సంగీతం: వివేక్ & మెర్విన్, సినిమాటోగ్రఫీ : సిద్ధార్థ నుని
ఎడిషనల్ సినిమాటోగ్రఫీ : జార్జ్ సి విలియమ్స్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: అమలాపురం శ్రీను, ఫైట్ మాస్టర్: పృథ్వీ
సహ నిర్మాత: శివ చనన, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
CEO: చెర్రీ, సమర్పణ: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, T-సిరీస్ ఫిల్మ్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహేష్ బాబు పి
విడుదల తేది : 27.11.2025
నిడివి : 2 ఘంటల 47 నిముషాలు
టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers)బ్యానర్‌పై నవీన్ యెర్నెనీ, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన చిత్రం ఆంధ్రా కింగ్ తాలూకా. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని,(Ram Pothineni) ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. దాంతో ఈసారి ఖచ్చితంగా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆంధ్రా కింగ్ తాలూకా మూవీపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నాడు. టీజర్, ట్రైలర్లుతో పాటు ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే హీరో హీరోయిన్లుగా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర(Upendra) కీలకపాత్ర పోషించారు. ఈ క్రమం లో రామ్ ఈ సరైనా హిట్ దక్కించుకున్నాడా లేదా సమీక్షలో చూద్దాం.
కథ :
హీరోగా ఒక వెలుగు వెలిగి.. కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు, రికార్డులు, అవార్డులు చూసిన హీరో, ఆంధ్రా కింగ్.. సూర్య (ఉపేంద్ర). అయితే వరుసగా 9 ఫ్లాపులు పడటంతో సూర్య 100వ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుంది. బయ్యర్లు రాక నిర్మాత భయపడి సినిమాపై ఇక ఖర్చు చేయలేక చేతులెత్తేస్తాడు. మరోవైపు నీ వల్లే నష్టపోయాం అంటూ డిస్ట్రిబ్యూటర్లు సూర్య ఇంటి ముందు నిరసనలు చేస్తుంటారు. హీరోగా ఎంతోమందికి సాయం చేసిన సూర్య వైపు తొంగి చూసే వారు కూడా ఉండరు. 100వ సినిమా పూర్తి కావాలంటే రూ.3 కోట్లు అవసరం అవుతాయి. ఇక చేసేదేెం లేక తాను ఉంటున్న ఇల్లు, కార్లు అన్నీ అమ్మేసేందుకు సిద్ధపడతాడు. అలాంటి సమయంలో సూర్య అకౌంట్లోకి రూ.3 కోట్లు వచ్చిపడతాయి. అడిగినా సాయం చేయని తనకి అడక్కుండానే ఇంత చేసింది ఎవరా అని హీరో సూర్య కనుక్కుంటాడు.అదలా వుండగా రాజమండ్రి ప్రాంతంలోని ఓ లంక గ్రామానికి చెందిన సాగర్ (రామ్ పోతినేని)కి తన చిన్నతనం నుంచే ‘ఆంధ్ర కింగ్’ సూర్య అంటే ప్రాణం. అప్పుడు అంత సాయం చేసింది తాను ఎన్నడూ చూడని తన అభిమాని సాగర్అని తెలుస్తుంది.అభిమానం ఎలా ఉంటుందో తెలుసు కానీ.. తన హీరోకే సాయం చేసేంత పిచ్చి ఉంటుందా అని సూర్య షాకవుతాడు. ఎలాగైనా సాగర్ని కలవాలని ఉన్న పళాన బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో తన ఫ్యాన్ సాగర్ గురించి సూర్య ఏం తెలుసుకుంటాడు? అసలు సూర్యకి రూ.3 కోట్లు ఇచ్చే అంత డబ్బు సాగర్‌కి ఎక్కడిది? అసలు జీవితంలో నేరుగా ఎప్పుడూ కలవని తన హీరోకి సాగర్ అంత సాయం ఎందుకు చేశాడు..? అనేది మిగిలిన కథ.
నటీనటుల హవబవాలు :
ఈ సినిమా లో హైలెట్ గా నిలిచింది హీరో రామ్ యాక్టింగ్ అనే చెప్పాలి. ఇప్పటివరకూ రామ్ చాలానే రోల్స్ చేశాడు. లవర్ బాయ్‌గా, యాక్షన్ హీరోగా, మాస్ హీరోగా ఇలా చాలానే చేశాడు. కానీ ఇందులో ఒక అభిమానిగా రామ్ జీవించాడు. తన హీరో సినిమా కోసం కటౌట్లు పెట్టడం నుంచి ఫ్యాన్ వార్స్ అంటూ కొట్టుకోవడం వరకూ.. థియేటర్లో పేపర్లు చింపడం నుంచి పేపర్లో తన హీరో ఫొటో చూసి మురిసిపోవడం వరకూ.. అభిమానంతో మొదలై హీరో మీద పెంచుకున్న పిచ్చి వరకూ.. ప్రతి సీనులోనూ రామ్ యాక్టింగ్ చాలా బావుంది. రామ్ లుక్ కూడా ఫ్యాన్స్‌కి కొత్తగా అనిపిస్తుంది. ఇక మహాలక్ష్మి పాత్రలో భాగ్యశ్రీ బోర్సే క్యూట్‌గా కనిపించింది. ముఖ్యంగా రామ్-భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ చాలా బావుంది. అలానే హీరో సూర్య పాత్రలో ఉపేంద్ర కరెక్ట్‌గా సరిపోయారు. క్లైమాక్స్‌లో ఉపేంద్ర యాక్టింగ్ చూశాక ఈ క్యారెక్టర్‌కి ఆయన్నే ఎందుకు తీసుకున్నారో ఆడియన్స్‌కి అర్థమవుతుంది. ఇక రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, రాజీవ్ కనకాల, తులసి ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు:
ఇది ఒక ఫ్యాన్ బయోపిక్ అని ముందే డైరెక్టర్ మహేష్ బాబు పి (Mahesh Babu P) ఒక క్లారిటీ ఇచ్చేశాడు. అందుకే ఇందులో కనిపించే ప్రతి సీన్‌కి నువ్వు కనెక్ట్ అవ్వాలంటే నీలో ఉన్న ఆ ఫ్యాన్ బయటికి రావాలి. ప్రతి ఒక్కరూ తమ లైఫ్‌లో ఏదో ఒక హీరోకి ఫ్యాన్ అయ్యే ఉంటారు. కొంతమంది చొక్కాలు చించేసుకునేంత అభిమానం చూపించొచ్చు.. కొంతమంది అదే చొక్కా వెనుక ఉన్న హృదయంలో అభిమానాన్ని దాచేయొచ్చు. కానీ ఈ సినిమా చూసినప్పుడు మాత్రం ఆ ఫ్యాన్ ఒక్కసారైనా సరే మీకు మళ్లీ కళ్ల ముందు కనిపిస్తాడు. నువ్వు పెంచుకున్న ఆ పిచ్చి అభిమానాన్ని మరోసారి గుర్తుచేస్తాడు. కొన్ని సన్నివేశాలను యాక్షన్ పరంగా అలాగే ఎమోషనల్ గా బాగా తెరకెక్కించినప్పటికీ.. తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఆయన స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సంగీత దర్శకులు అందించిన పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఇక ఎడిటింగ్ విషయానికి వస్తే.. అక్కడక్కడ ఉన్న కొన్ని సాగతీత సీన్స్ ను ఎడిటర్ తగ్గించాల్సింది. నిర్మాతలు నవీన్ యెర్నేని,(Naveen Yernneni) యలమంచిలి రవి(Yalamanchili Ravi Shankar) శంకర్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
విశ్లేషణ :
సినిమాలో హీరోపై ఒక ఫ్యాన్ పెచ్చుకున్న అభిమానం ఎలా ఉంటుందో చూపించారు.. ప్రేమించిన అమ్మాయి కంటే తన హీరోనే తనకి ఎక్కువ అనే పిచ్చిని చూపించారు.. ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారో మరోసారి గుర్తుచేశారు. . నిజానికి ఈ సినిమా అభిమానులు కాదు.. హీరోలు కూడా చూడాలి. ఆంధ్రా కింగ్ తాలూకా’ అంటూ వచ్చిన ఈ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాలో.. రామ్ నటన, మెయిన్ థీమ్ అండ్ ఎమోషనల్ సీన్స్ మరియు అభిమాన హీరో పై ఉండే అభిమానం, అలాగే రామ్ పాత్ర తాలూకు ఎమోషన్స్ కూడా బాగున్నాయి. క్లైమాక్స్ కూడా బాగా ఆకట్టుకుంది. ఐతే, కొన్ని సీన్స్ మాత్రం స్లోగా మరియు రెగ్యులర్ గా సాగాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో రామ్ నటనతో పాటు సాంకేతిక విభాగం అందించిన మంచి పనితనం, కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.






