Rolugunta Suri Review: రియలిస్టిక్ టచ్‌తో ‘రోలుగుంట సూరి’
తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.75/5
నిర్మాణ సంస్థ : తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్
నటీనటులు: నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్, బ్రహ్మనందరెడ్డి, సత్యనారాయణ, ఆయుషా,
జ్యోతి, మహర్షి రమణ, ముకుందం శ్రీను తదితరులు
సంగీతం: సుభాష్ ఆనంద్
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్: సందీప్ చక్రవర్తి
ఎడిటింగ్ , ఆడిషనల్ స్క్రీన్ ప్లే : ఆవుల వెంకటేష్
ఫైట్స్: వాసు, ఆర్ట్ డైరెక్టర్: రమేష్, కథ, డైలాగ్స్: మహ్మద్ సాయి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: ఊరికూటి తాతారావు, పల్లా సత్యనారాయణ
నిర్మాత: సౌమ్య చాందిని పల్లా
దర్శకుడు: అనిల్ కుమార్ పల్లా
విడుదల తేది : 14.11.2025
తెలుగు తెరపై చాలా అరుదుగా కనిపించే రియలిస్టిక్ విలేజ్ ఎమోషనల్ డ్రామాగా రూపుదిద్దుకున్న చిత్రం ‘రోలుగుంట సూరి’ (Rolugunta Suri) ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనిల్ కుమార్ పల్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగార్జున పల్లా, ఆధ్యారెడ్డి, భావన నీలప్ హీరో–హీరోయిన్లుగా నటించగా, తపస్వీ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై సౌమ్య చాందిని పల్లా నిర్మించారు. రియల్ స్టోరీ గా చెబుతున్న ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో తెలుసుకుందాం.
కథ:
రోలుగుంట గ్రామంలో జరిగిన కథ. జైలు నుండి తిరిగి వచ్చిన తక్కువ కులానికి చెందిన యువకుడు సూరి, గ్రామంలో తన కష్టంతో, నిజాయితీతో గౌరవం సంపాదించుకుంటాడు. కమల అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కబడ్డీ మ్యాచ్ నుంచి గొడవలు మొదలవుతాయి. పైవర్గానికి చెందిన ప్రెసిడెంట్ మరియు కాషి, అతడి గ్యాంగ్‌కి నచ్చదు. కులం, క్లాస్, విలేజ్ ప్రైడ్ అన్నీ కలిసిపోతూ చిన్న గొడవలు పెద్ద గొడవలుగా మారతాయి. సూరిపై అవమానాలు, దాడులు పెరుగుతాయి. గ్రామ ప్రెసిడెంట్ అయితే “అంటరాని కులం” అంటూ సూరి కుటుంబాన్ని తొక్కేస్తాడు. చివరికి ప్రెసిడెంట్ మనుషులు సూరి తల్లిదండ్రులను ఇంటితో సహా అగ్గి పెట్టి కాల్చేయడం చూసి ప్రేక్షకులు షాక్ అవుతారు. ఈ సంఘటనల వెనుకున్న నిజం ఏమిటి? సూరి తన పగను తీర్చుకున్నాడా? అనేక ట్విస్టులతో సాగే ఈ రియల్ స్టిక్ కథనం తెలుసుకోవాలంటే థియేటర్ లో సినిమా చూడాల్సిందే.
నటీనటుల హవబవాలు :
నాగార్జున పల్లా – సూరి: సూరి పాత్రలో నటించిన నాగార్జున పల్లా అద్భుతంగా ఒదిగిపోయాడు. గ్రామీణ యువకుడి భాష, మైనర్, బాడీ లాంగ్వేజ్ అన్నీ చాలా నేచురల్‌గా చేశారు.ఆధ్యారెడ్డి – కమల: సాఫ్ట్‌గా, మర్యాదగా ఉండే గ్రామీణ అమ్మాయి పాత్రలో బాగా చేసింది. భావోద్వేగ సీన్లలో ఆమె నటన ప్రత్యేకంగా నిలుస్తుంది. భావన నీలప్: స్క్రీన్ మీద కనిపించిన ప్రతి సీన్లో మంచి ప్రెజెన్స్ ఉంది. పాత్రకు సరైన న్యాయం చేసింది. బ్రహ్మనందరెడ్డి: విలన్ షేడ్ పాత్రలో పవర్‌ఫుల్‌గా నటించాడు. అతడి బాడీ లాంగ్వేజ్, డైలోగ్ డెలివరీ సన్నివేశాలను మరింత హైలైట్ చేశాయి. సత్యనారాయణ, అయూషా, జ్యోతి, మహర్షి రమణ.. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు మంచి డెప్త్ ఇచ్చారు. కథలో కీలకమైన చోట్ల వీరి నటన సినిమాను బలపరిచింది.
సాంకేతికవర్గం పనితీరు :
దర్శకుడు – అనిల్ కుమార్ పల్లా: గ్రామీణ నేపథ్యంలో రియలిస్టిక్ సినిమా తీయడం సులభం కాదు. అయితే ఆయన చాలా నమ్మకంగా తెరకెక్కించారు. కథనం ఎక్కడా వదలకుండా ప్రేక్షకుడిని పట్టుకున్నారు. డైరెక్టర్ స్వయంగా చేసిన కెమెరా వర్క్ కూడా అద్భుతంగా ఉంది. డీఓపీ సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలబెట్టారు. సంగీతం – సుభాష్ ఆనంద్: సినిమాకు కావాల్సిన రస్టిక్, నేటివ్ ఫ్లేవర్ ఇవ్వడంలో పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రెండు కలిసి సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ‘నిన్న.. మొన్న..’ పాట – రామారావు మాతుమూరు రాసిన ఈ ప్రణయ విరహ గీతం సినిమాకు ఆత్మగా నిలిచింది. అనూప్ రూబెన్స్ విడుదల చేసి, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ ప్రత్యేకంగా ప్రశంసించినట్టు ఈ పాట సినిమా విలువను మరింత పెంచింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – సందీప్ చక్రవర్తి: సన్నివేశాల టెన్షన్, ఎమోషన్, ఇంటెన్సిటీని అద్భుతంగా పెంచారు. ఎడిటింగ్ & స్క్రీన్‌ప్లే – ఆవుల వెంకటేష్: పేసింగ్ బాగుంది. ఫ్లాష్‌బ్యాక్‌లు, హై వోల్టేజ్ సీన్లు బాగా సెట్ చేశారు. అక్కడక్కడ కొంచం ట్రిమ్ చేయాల్సింది. ఇక డీఐ కూడా సినిమాను అందంగా ముస్తాబు చేసిందని చెప్పొచ్చు. కథ, డైలాగ్స్ – మహ్మద్ సాయి: గ్రామీణ మాటల బలాన్ని చక్కగా అందించారు. డైలాగ్స్ చాలా నేటివ్‌గా ఉన్నాయి. ఫైట్స్ – వాసు: నిజాయితీగా, అసలైన విలేజ్ ఫైట్స్ ఎలా ఉంటాయో అలా తీశారు. ఆర్ట్ డైరెక్షన్ – ఎస్. రమేష్: గ్రామీణ వాతావరణాన్ని కచ్చితంగా సెట్ చేసి సినిమాకు అసలైన సోల్ నింపారు.
విశ్లేషణ:
గ్రామీణ వాస్తవాలను, కుల వ్యవస్థను డైరెక్టర్ అనిల్ కుమార్ పల్లా ఎంత నిజాయితీగా చూపించారో చూడగానే అర్థమౌతుంది. సూరి తల్లిదండ్రుల మీద దాడి సీన్ హృదయాన్ని కదిలించేలా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు నిజంగా గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఫైట్స్ చాలా ఎఫెక్టివ్‌గా, బలమైన రియలిస్టిక్ టచ్‌తో చేశారు. రొమాన్స్ భాగం యూత్‌ను బాగా ఆకట్టుకునేలా చూపించారు. తెలుగు సినిమాల్లో అరుదుగా కనిపించేంత బోల్డ్‌గా, నేచురల్‌గా శృంగారం సీన్లు తెరకెక్కించారు. గ్రామీణ వాతావరణం, కలర్ టోన్, లోకేషన్స్—all together సినిమా పూర్తిగా రియల్ విలేజ్ ఫీల్ ఇస్తుంది. ‘రోలుగుంట సూరి’ ఒక రియలిస్టిక్ విలేజ్ ఎమోషనల్ డ్రామా, కులం, ప్రేమ, ప్రతీకారం, గ్రామీణ సత్యాలు అన్నీ మిళితమైన సినిమా. ప్రతి విభాగం తమ వంతు న్యాయం చేశాయి. టాలీవుడ్ లో అరుదైన, అద్భుతమైన విలేజ్ సినిమాగా నిలుస్తుంది. రియలిజం, ఎమోషన్, ఇంటెన్సిటీకి ప్రాధాన్యత ఇస్తూ ప్రేక్షకులకు ఇది తప్పకుండా నచ్చే సినిమా.






