Dude Movie Review : ప్రేమకి సరికొత్త నిర్వచనం ‘డ్యూడ్’

తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ : మైత్రి మూవీ మేకర్స్
నటీ నటులు : ప్రదీప్ రంగనాథన్, మమిత బైజు, శరత్ కుమార్, హ్రిందు హరూన్, రోహిణి మొల్లేటి తది తరులు
సంగీతం : సాయి అభ్యంక్కర్, సినిమాటోగ్రఫీ : నికేత్ బొమ్మి,
ఎడిటర్ : భరత్ విక్రం,
నిర్మాతలు : నవీన్ యెర్నేని , వై . రవి శంకర్,
దర్శకత్వం : కీర్తిశ్వరన్,
విడుదల తేది : 17.10.2025
నిడివి : 2 ఘంటల 19 నిముషాలు
Pradeep Ranganadhan Dude Telugu Movie Review: ప్రదీప్ రంగనాథన్ సినిమాలంటే ఇప్పుడు తెలుగు లో కూడా క్రేజ్ ఉంది. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలు తెలుగులో కూడా హిట్టవ్వడంతో, అతను హీరోగా దీపావళి కానుకగా వస్తున్న డ్యూడ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ రోజు (అక్టోబర్ 17) న థియేటర్లలో పలకరించిన ఈ సినిమా అంచనాలను అందుకుందా? ప్రదీప్ కు మరో హిట్టిచ్చిందా ఈ రివ్యూ లో తెలుసుకుందాం…
కథ :
Dude Story: పశుసంవర్ధక శాఖామంత్రి ఆదిశేషు (శరత్ కుమార్) Sharath Kumar, రోహిణి (రోహిణి మొల్లేటి) Rohini Molleti సొంత అన్నాచెల్లెల్లు. ఆది శేషు కూతురు కుందన (మమిత బైజు) Mamitha Baiju, రోహిణి కొడుకు గగన్ (ప్రదీప్ రంగనాథన్) బావా మరదళ్లు. చిన్నప్పటి కలిసే పెరగడంతో గగన్‌పై ఇష్టాన్ని పెంచుకుంటుంది కుందన. గగన్ మాత్రం వేరే అమ్మాయి ప్రేమిస్తాడు.. ఆమెకి వేరే వ్యక్తితో పెళ్లైపోతుంది. అయితే తన ఇష్టాన్ని చంపుకోలేక.. కుందన తన బావ గగన్‌కి ప్రపోజ్ చేస్తుంది. అయితే గగన్.. నీపై నాకు అలాంటి ఫీలింగ్ లేదని దూరం పెట్టేస్తాడు. ఆ తరువాత కుందన ఫారిన్ వెళ్లి.. అక్కడ పార్థు (హ్రిందు హరూన్)Hrindu Harun ప్రేమలో పడుతుంది. అతనితో నెల తప్పుతుంది. ఆస్తి లేకున్నా.. అనాథ గాడైనా తన కూతురికి భర్తగా ఒప్పుకుంటాను కానీ.. కులం కానివాడితో పెళ్లి చేయనని కూతుర్నే చంపుకోవడానికి సిద్ధపడతాడు ఆది శేషు. బలవంతంగా కూతుర్ని మేనల్లుడు గగన్‌కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇష్టం లేకపోయినా కూడా కుందన మెడలో తాళి కడతాడు గగన్. ఆ తరువాత కుందన, పార్థులకు ఒక్కటి చేయడానికి గగన్ ఎలాంటి సాహసం చేశాడు? వాళ్లిద్దర్నీ ఒక్కటి చేయడానికి పడిన తిప్పలేంటి? తన ప్రేమను తిరిగి సాధించాడా? లేదా? తన ప్రేమ కథకి ఎలాంటి ముగింపు ఇచ్చాడు అన్నదే డ్యూడ్ మిగిలిన కథ.
నటీ నటుల హవబవాలు :
Performance of Actor, Actress : ప్రదీప్.. తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో మరోసారి ఆల్ రౌండర్ అనిపించాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టయిల్‌ని కంటిన్యూ చేస్తూ.. డ్యూడ్‌లో హై ఎనర్జీ చూపించాడు. ‘దూరం అయిపోయిందనుకున్న ప్రేయసి తన ముందుకు వచ్చి.. ఎందుకురా నన్ను దూరం పెట్టావ్ అని అడిగినప్పుడు.. నేను నిన్ను ప్రేమిస్తున్నా అనే మాట చెప్పలేక.. బాత్ రూంలోకి వెళ్లి ఏడుపు వినిపించకుండా.. కన్నీళ్లు కనిపించకుండా దుఃఖాన్ని దిగమింగుకుని రియలైజ్ అయ్యే సీన్‌లో ప్రదీప్ కళ్లు చెమ్మగిల్లేట్టు చేశాడు. ఈ సినిమాలో సర్ ప్రైజింగ్ రోల్ అంటే శరత్ కుమార్‌ది. పశుసంవర్థక శాఖామంత్రి ఆది శేషుగా డిఫరెంట్ మ్యానరిజమ్‌తో మల్టీ లేయర్స్ ఉన్న పాత్రలో అలరించారు. పాత సినిమాల్లో నూతన్ ప్రసాద్, గొల్లపూడి, కోటా తరహాలో విలక్షణ నటనని చూపించారు. ఓ పక్కన సీరియస్‌గా చేస్తూనే.. సర్ ప్రైజ్, ఫ్రాంక్ అంటూ ఆయన కామెడీ సీన్లు నవ్వించడంతో పాటు భయపెడతాయి. ఇక హీరోయిన్ మమితా బైజు కూడా తన పాత్రకు న్యాయం చేసింది. చాలా సహజంగా నటించింది. సరదాగా సాగుతూ ఉండే ఒక కీలకమైన పాత్రలో శరత్ కుమార్ నటించాడు. ఈయన చేసిన పాత్రలో కొన్ని షేడ్స్ ఉంటాయి. హృదూ హరూన్ చేసిన పాత్ర బాగుంది. ఇక నేహా శెట్టి పాత్రకు స్పేస్ తక్కువే. హీరో తల్లిగా రోహిణి కూడా తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేసింది.
సాంకేతిక వర్గం పనితీరు :
Technical Team Effort: ప్రేమ కథ చిత్రాలకు సంగీతమే ప్రాణం. సగం సినిమాను నిలబడేది ఇక్కడే. ఆ విషయంలో సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ న్యాయం చేసాడు. హృదయానికి హత్తుకునే పాటలతో పాటు బీజీఎమ్ కూడా బాగా ఇచ్చాడు. డ్యూడ్ సినిమాలో చెప్పుకోవడానికి పెద్దగా కొత్తదనమున్న కథేమీ లేదు . రొటీన్ లవ్ స్టోరీ కాకపోతే హీరో యాక్టింగ్ తో పాటు స్క్రీన్ ప్లే బాగుండటంతో సినిమా మాత్రం కొత్తగా అనిపిస్తుంది. చిన్నప్పటినుండి చూసిన వ్యక్తి పై ప్రేమ అనే కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసేసాం. తిప్పితిప్పి కొట్టిన అదే పాత కథ. నెక్స్ట్ ఏమి జరిగిపోతుందో మొత్తం గెస్ చేసేలానే సినిమా సాగిపోతూ ఉంటుంది. ప్రేమ కథా చిత్రాల్లో ఏముంటుంది. అబ్బాయి అమ్మాయి ఇష్టపడటం, నో చెప్పటం ఇంచుమించు ఇలానే సాగిపోతాయి. అయినా మన సినిమాల్లో ఎక్కువ ప్రేమకథలు వస్తాయి. జనమూ చూస్తారు. కథను నచ్చేలా చూపించడం ఇక్కడ కీలకం. అన్ని క్రాఫ్ట్‌లను చాలా సాఫ్ట్‌గా డీల్ చేశారు. మాటలతో పెన్ పవర్ చూపించారు. ‘నా బైబిల్‌లో జాలీగా చేస్తేనే అది పని.. లేదంటే భారం’.. అనే డైలాగ్‌లు ఆలోచనలో పడేస్తే.. ‘సూది సందు ఇవ్వకపోతే దారం దూరుద్దా?’ అనే డైలాగ్‌లు ఫన్ జనరేట్ చేశాయి. కొన్ని ఎమోషనల్ సీన్లు కూడా హార్ట్ టచ్చింగా అనిపిస్తాయి. ఫ్రెండ్‌ని లవ్ చేయడం తప్పు కదా ఫ్రెండ్ అంటే.. ‘ప్రేమ అంటే షేప్ కాదు.. సైజ్ కాదురా పిచ్చోడా’ ఫ్రెండ్ షిపేరా లవ్ అంటే అంటూ మాటలు బాగున్నాయ్! కీర్తిశ్వరన్ కొత్త డైరెక్టరే అయినా..ప్రేమకి సరికొత్త నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అందులో మాత్రం దర్శకుడు సక్సెస్ అయ్యాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం లో వచ్చిన ఈ సినిమాలో ప్రొడక్షన్ పరంగా చూస్తే ఉన్నత స్థాయిలో ఉన్నాయి.
విశ్లేషణ:
Analysis : ప్రేమ, పెళ్లి నేపథ్యంలో రెండు మనసులు పడ్డ సంఘర్షణను ఇంటెన్స్ డ్రామాగా మలిచారు. ఫ్రెండ్షిప్, లవ్, బ్రేకప్, డ్రీమ్స్ అన్నీ కలిసిన పవర్ ప్యాకేజ్డ్ మూవీ ‘డ్యూడ్’. ప్రేమించిన అమ్మాయి కోసం తన ప్రేమని త్యాగం చేయడం… అతనికిచ్చి పెళ్లి చేయడం అనేది పాత కథే. కానీ ప్రేమించిన అమ్మాయి ప్రేమను నిలబెట్టడం కోసం.. తిరిగి ఆమెనే పెళ్లి చేసుకుని.. ఆమెకి వేరే వాడితో పుట్టిన బిడ్డకి ముడ్డి కడిగి మూతి తుడిచే భర్త క్యారెక్టర్‌ని ఊహించుకోవడమే కష్టం అనుకుంటే.. దాన్ని జీర్ణించుకోవడం ఇంకా కష్టం. కానీ.. ఇలాంటి క్రిటికల్ కండిషన్ ఉన్న భర్త పాత్రకి ప్రదీప్ రంగనాథన్ మాత్రమే పర్ఫెక్ట్ ‘డ్యూడ్’ అనేట్టు చేశాడు. ప్రేమ కోసం నిలబడటం అంటే ప్రేయసిని దక్కించుకోవడం కాదు.. ఆ ప్రేయసి ప్రేమ కోసం నిలబడటం అనే పాయింట్‌తో వినోదంతో పాటు సంఘర్షణను చూపించారు. రెగ్యులర్ ప్రేమ కథ చిత్రమే కానీ థియేటర్లలో సరదాగా థియేటర్లలో చూసే చిత్రమే. ఫస్ట్ హాఫ్ అదిరింది. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా కొంచెం లాగ్, కొంచెం బోరు కొట్టించే సన్నివేశాలు, ఒక సందేశం ఉన్నప్పటికీ పైసా వసూల్ సినిమా ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షో ‘డ్యూడ్’. డ్రాగన్ తో అదరగొట్టిన ప్రదీప్ నటన కోసం ఈ సినిమా చూసేయ్యొచ్చు.