KTR: అరెస్ట్ కోసమే కేటిఆర్, హరీష్ ప్రయత్నమా..?
రాజకీయాల్లో ఈ మధ్యకాలంలో అరెస్టు కావడం అనేది ప్యాషన్ గా మారిపోయింది. ఏదో ఒక విమర్శలు చేసి కేసులు నమోదు చేయించుకుని.. అరెస్టు కావడానికి నాయకులు ఆసక్తి చూపిస్తున్నారు. అరెస్టు అయిన వాళ్లకు సానుభూతి వస్తుందనే భావన ఎక్కువగా ఉంది. తప్పులు చేసినా సరే తమను అరెస్టు చేస్తే రాజకీయ కక్ష సాధింపుగా చూపించుకునే ప్రయత్నం, చాలా వరకు కూడా చేస్తున్నట్లుగానే అర్థమవుతూ వస్తోంది. ఇక కొన్ని కేసులకు సంబంధించి చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు కూడా ఈ మధ్యకాలంలో కొత్త చర్చలకు దారి తీస్తున్నాయి.
తెలంగాణలో ఫోన్ టాపింగ్(Phone Tapping) వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ గానీ, మరో మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) గాని అనుసరిస్తున్న వైఖరి కొంత ఆసక్తిని రేపుతోంది. వీళ్లిద్దరు కూడా అరెస్టు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు అనే సంకేతాలే వస్తున్నాయి. రాజకీయంగా ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనమైంది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో, అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి మనం చూశాం.
ఇక ఇప్పుడు ఈ అంశంలో కొంత రాష్ట్ర ప్రభుత్వం తో కూడా దూకుడు ప్రదర్శిస్తూ వస్తోంది. అయితే ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విషయంలో మాత్రం, హరీష్ రావు గాని కేటీఆర్ గాని వెనుక తగ్గటం లేదు. ముఖ్యంగా కేటీఆర్ వ్యక్తిగత విమర్శల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని విమర్శలు చేస్తున్నారు. అయితే ఆయన లక్ష్యం కచ్చితంగా అరెస్టు కావడమే అనేది చాలామంది లో వ్యక్తం అవుతున్నటువంటి అభిప్రాయం. ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి ప్రజల్లో నిలబడాలి అంటే సానుభూతి అవసరం అనే భావనలో ఆ పార్టీ ఉన్నట్లుగా తెలుస్తోంది.






