Chandrababu: గోదావరి పుష్కరాలు, చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్..!
గోదావరి పుష్కరాల(Godavari Pushkaralu) కు రంగం సిద్దమవుతోంది. మూడవ సారి ముఖ్యమంత్రి హోదాలో పుష్కరాలను నిర్వహించేందుకు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు సిద్దమవుతున్నారు. గోదావరి పరివాహక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ సర్కార్ దూకుడుగా కార్యక్రమాలు చేస్తోంది. అటు కేంద్ర ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుంది. రైల్వే శాఖ.. ఇటీవల రాజమండ్రి రైల్వే స్టేషన్ కు నిధులను కేటాయించింది. అలాగే ఘాట్ లు సహా పలు కార్యక్రమాల విషయంలో సిఎం చంద్రబాబు నాయుడు అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్నారు.
గతంలో జరిగిన తప్పులను మరోసారి జరగకుండా ఉండేందుకు జాగ్రత్తగా పడుతోంది సర్కార్. తాజాగా గోదావరి పుష్కర పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అత్యున్నత సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో సమీక్షకు సీఎస్ విజయానంద్ రెడ్డి, మంత్రులు రామనారాయణరెడ్డి, అనిత, నారాయణ, నిమ్మల రామానాయుడు, వాసంశెట్టి సుభాష్, కందుల దుర్గేష్, బీసీ జనార్థన్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరు అయ్యారు. గోదావరి పుష్కరాలపై సమీక్షకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేద పండితుల ఆశీర్వచనం అందించారు.
గోదావరి నది ప్రవహించే పోలవరం, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ ఆరు జిల్లాల్లో 2027 జూన్ 26 నుంచి 2027 జూలై 7 వరకు 12 రోజుల పాటు గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. తన హయాంలో 3వ సారి గోదావరి పుష్కరాలు నిర్వహించడం తన అదృష్టమని సిఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు(Polavaram project) పనులు పూర్తయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇక కృష్ణా నదీ పుష్కరాలను కూడా సిఎం మూడవ సారి నిర్వహిస్తారు.






