World Cup: మా క్రికెట్ క్లోజ్, బంగ్లా క్రికెటర్ల ఆవేదన..!
భారత్(India) – బంగ్లాదేశ్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం క్రికెట్ పై భారీగానే పడుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్ క్రికెట్ తీవ్రంగా నష్టపోయే సంకేతాలు కనపడుతున్నాయి. టి20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాలని బంగ్లాదేశ్ క్రికెట్ నిర్ణయం తీసుకుంది. భారత్ లో తమ ఆటగాళ్లకు రక్షణ లేదని.. బంగ్లా బోర్డు భావిస్తూ ఐసీసీ ని బెదిరించే ప్రయత్నాలు చేసింది. అయినా సరే ఐసీసీ మాత్రం లెక్క చేయలేదు. ఆ స్థానంలో స్కాట్ లాండ్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం కారణంగా బంగ్లా క్రికెట్ బోర్డు(BCB).. దాదాపుగా 250 కోట్ల రూపాయలు నష్టపోయే అవకాశం ఉంది. అయితే దీనిపై బంగ్లా క్రికెటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సీనియర్ ఆటగాళ్ళ నుంచి జూనియర్ల వరకు ఈ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ నిర్ణయానికి తమకు ఏ సంబంధం లేదని కొందరు ఆటగాళ్ళు అంతర్జాతీయ మీడియాకు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. మా సమ్మతి కోసం కాదని.. కేవలం సమావేశానికి మాత్రమే పిలిచారని ఓ క్రికెటర్ వ్యాఖ్యానించాడు.
కొనసాగుతున్న సంక్షోభంలో తమ అభిప్రాయాలు వినడానికి మాత్రమే పిలిచినట్లు తెలిపారు. సమావేశానికి రాకముందే ఏమి చేయాలో నిర్ణయించుకున్నారని, తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఏ నిర్ణయం తీసుకోలేదని ఓ క్రికెటర్ వ్యాఖ్యానించారు. టి20 వరల్డ్ కప్ గురించి అసలు తమను ఏం అడగలేదని, తాము కూర్చునేలోపే నిర్ణయం వెలువడింది అని, ఆ తర్వాత అభిప్రాయాలు అడిగినట్లు ఓ ప్రముఖ క్రికెటర్ వ్యాఖ్యానించాడు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలనే అమలు చేసారని ఆవేదన వ్యక్తం చేసాడు.
ఇది బంగ్లాదేశ్ క్రికెట్ పతనమే అనే విషయం తమకు స్పష్టత ఉన్నట్టు మరో క్రికెటర్ పేర్కొన్నాడు. మనం వెళ్ళకపోతే మనకే నష్టం, మనది పెద్ద జట్టు కాదని, ఎవరూ పట్టించుకునే పరిస్థితిలో లేరని మరో క్రికెటర్ కామెంట్ చేసాడట. బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ భరోసా ఇవ్వడానికి ప్రయత్నించాడు, కానీ అది ఆటగాళ్లపై పెద్దగా ప్రభావం చూపలేదని, అంతకు మించి అతను చేసేది ఏం ఉందని మరో క్రికెటర్ పేర్కొన్నాడు. వాళ్ళు భారత్ లో క్రికెట్ ఆడకూడదు అని ముందే నిర్ణయం తీసుకున్నారనే విషయం తమకు తెలుసనీ వ్యాఖ్యానించాడు.






