World Cup: బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కానుందా..?
భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ దేశాల మధ్య ఈ మధ్యకాలంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్నటువంటి దాడుల పరిణామాలను, భారత ప్రభుత్వం కొంత సీరియస్ గానే పరిగణిస్తుంది. భారత్ లో ఉన్న ముస్లింలకు భద్రత కల్పించినప్పుడు, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులకు ఎందుకు ఇటువంటి పరిస్థితి అనే ప్రశ్నలు కూడా మధ్యకాలంలో వినపడుతూ వస్తున్నాయి. ఇక తాజాగా క్రికెట్ పరిణామాలు కూడా రెండు దేశాల మధ్య మరింత దిగజారి అవకాశాలే కనపడుతున్నాయి.
భారత్(India) లో టి20 వరల్డ్ కప్ మ్యాచ్లను తాము ఆడేది లేదని, బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇటీవల కాలంలో పదే పదే చెబుతూ వస్తుంది. ఇక దీనికి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కూడా వెనక్కి తగ్గడం లేదు. బంగ్లాదేశ్ ఆడకపోతే మరో జట్టును తీసుకువచ్చి ఆడిస్తామంటూ కూడా ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో కీలక పరిణామం కూడా చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకునేందుకు ఆసక్తి చూపించింది. తమ ఆటగాళ్లకు భారతదేశంలో రక్షణ లేదని చెప్తూ, బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCB) నిర్ణయం తీసుకుంది.
అయితే భవిష్యత్తులో ఈ రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు మరింత దెబ్బ తినే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు.. భారత్ విషయంలో కఠినంగా ముందుకు వెళితే మాత్రం తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉండొచ్చు. ఇప్పటికే బంగ్లాదేశ్ తో ద్వైపాక్షిక సిరీస్ లు, ఆడేందుకు భారత్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ రెండు దేశాల మధ్య టెస్ట్ క్రికెట్ జరగాలి అనేది.. బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు అభిమతంగా కనబడుతున్నప్పటికీ.. పరిణామాలు మాత్రం ఆ విధంగా లేవనే చెప్పాలి.
అటు పాకిస్తాన్(Pakistan) తో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో బంగ్లాదేశ్ విషయంలో కూడా దాదాపు అదే పరిస్థితి రావచ్చని తెలుస్తోంది. 2008 ముంబై దాడుల తర్వాత.. భారత్, పాకిస్తాన్ తో ద్వైపాక్షిక మ్యాచ్ లు ఆడలేదు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ తో ద్వైపాక్షిక సిరీస్ లు, ఆడేందుకు భారత్ ఆసక్తి చూపించకపోవచ్చు అని అంటున్నాయి క్రికెట్ వర్గాలు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముందు భారత్ ను దోషిగా చూపించే ప్రయత్నం బంగ్లాదేశ్ చేయడంతో.. దీనిని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు సీరియస్ గా తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి.






