Vijay Sai Reddy: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తా
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణం(liquor scam) ఏమో గాని జరుగుతోన్న పరిణామాలు మాత్రం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న వైసీపీ మాజీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డిని ఈడీ అధికారులు విచారించారు. విచారణ అనంతరం విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కాసేపటి క్రితం ఈడీ (ED) విచారణ ముగియగా.. మొత్తం 7 గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను విచారించారు. లిక్కర్ పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసారు.
ఈ సందర్భంగా విజయసాయి స్టేట్మెంట్ కూడా అధికారులు రికార్డ్ చేసారు. లిక్కర్ పాలసీ రూపకల్పనపై 3 సార్లు తన సమక్షంలోనే సమావేశాలు జరిగినట్లు ఈడీకి విజయసాయి తెలిపారు. ఆర్థిక లావాదేవీలపై ఈడీకి కొన్ని పత్రాలను కూడా ఆయన సమర్పించారు. ఈ సందర్భంగా రాజకీయాలపై విజయసాయి కామెంట్ చేసారు. రాజకీయాల నుంచి తప్పుకోను.. నా భవిష్యత్ ప్రణాళికలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. ఈ నెల 25తో నాకు రాజకీయాలకు దూరమై ఏడాది ముగుస్తుందని తెలిపారు.
తిరిగి రాజకీయాల్లోకి వస్తాను.. కోటరీ వ్యవస్థ ఇలాగే కొనసాగితే జగన్ మళ్లీ అధికారంలోకి రారు అంటూ కామెంట్ చేసారు. కూటమి(NDA)ని విడగొడితేనే జగన్ (Ys Jagan)కు మళ్లీ అధికారం అని స్పష్టం చేసారు. నేను జగన్ను విమర్శించలేదు, ఆయనే నన్ను విమర్శించారన్నారు విజయసాయి. నేను ప్రలోభాలకు లొంగిపోయానని జగన్ అన్నారు.. ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. పార్టీ లో నంబర్ 2 స్థానం అనేది లేదని స్వయంగా వైఎస్ జగన్ చెప్పారని ఈడీకి తెలిపానని, ప్రాంతీయ పార్టీల్లో నంబర్ 2 అనేది ఉండదని చెప్పాను అంటూ కామెంట్ చేసారు. కేసులు చుట్టుముట్టిన తర్వాతే నన్ను ‘నంబర్2’గా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేసారు. ఈడీ విచారణలో అడిగిన ప్రశ్నల్లో కొన్ని మాత్రమే రికార్డు చేశారన్నారు సాయి రెడ్డి. మరికొన్ని ప్రశ్నలను రికార్డు చేయలేదు అని చెప్పుకొచ్చారు. ఈ లిక్కర్ స్కాం గురించి నాకు తెలియదని, లిక్కర్ స్కాంలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వారినే అడగాలని చెప్పానని పేర్కొన్నారు.






