Phone Tapping: విచారణకు టీడీపీ నేతలు..?
తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించి, ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు గులాబీ పార్టీలో ఆందోళన కలిగిస్తున్నాయి. భారత రాష్ట్ర సమితి(BRS) అధికారంలో ఉన్న సమయంలో.. ప్రతిపక్షాల ఫోన్లతో పాటుగా కొందరు ప్రముఖుల ఫోన్లను కూడా టాపింగ్ చేసి విన్నారు అనేది ప్రధానంగా వచ్చినటువంటి ఆరోపణ. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు, దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీవ్ర స్థాయిలో అప్పట్లో ఆరోపణలు చేసిన పరిస్థితి. సినిమా ప్రముఖుల ఫోన్లతో పాటుగా వ్యాపార ప్రముఖుల ఫోన్లను, అదే విధంగా కొందరు జర్నలిస్టుల ఫోన్లను కూడా పదేపదే విన్నారంటూ ఆరోపణలు వచ్చాయి.
ఇక దీనికి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత, విచారణ కొంత నిదానంగా జరుగుతున్నప్పటికీ కొన్ని కీలక పరిణామాలు మాత్రం ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ను ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు పిలిచిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మాజీ మంత్రి కేటీఆర్(KTR) ను విచారణకు పిలిచింది సిట్. ఇక ఈ విచారణ తర్వాత మరి కొంత మంది కీలక వ్యక్తులను విచారించే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన కొంతమంది ప్రముఖులను విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి.
అదే విధంగా సినిమా ప్రముఖులను కూడా విచారణ పిలవచ్చని భావిస్తున్నారు. ఏపీలో కొంతమంది టిడిపి ఎమ్మెల్యేలను విచారణకు పిలిచే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. వారి ఫోన్లను కూడా అప్పట్లో టాపింగ్ చేశారనేది ఆరోపణ. దీంతో వారిని కూడా విచారణకు పిలిచి, వారి వద్ద నుంచి వివరణ తీసుకునే అవకాశం కనబడుతోంది. అలాగే సినిమా ప్రముఖులకు సంబంధించి కూడా కొంత విచారణ జరిగే అవకాశం ఉండవచ్చు. ఇప్పటికే ఎవరిని విచారణకు పిలవాలి అనేదానికి సంబంధించి.. క్లారిటీకి వచ్చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి గులాబీ పార్టీ నేతల్లో కూడా కొంతమందిని విచారించే అవకాశాలు ఉన్నాయి.






