Donald Trump: అమెరికా భద్రతలో ఒక్క ఐస్ ముక్కే కీలకం ట్రంప్..!
గ్రీన్ లాండ్ కావాల్సిందే.. అది మాదేశ భద్రతకు చాలా కీలకం. దాని రక్షణను డెన్మార్క్, ఈయూ దేశాలు చేయలేవు.మాకన్నా ఎవరూ గ్రీన్ లాండ్ ను పూర్తిగా కాపాడలేరు. అందుకే మేం మా భద్రత కోసం గ్రీన్ లాండ్ ను యాజమాన్య హక్కుతో సహా తీసుకోవాలనుకుంటున్నాం. అయితే..దానికి బలప్రయోగం మాత్రం చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంచేశారు. ఇదే సమయంలో దావోస్ వేదికపై నుంచి యూరోపియన్ యూనియన్, డెన్మార్క్ పై తీవ్ర విమర్శలు చేశారు ట్రంప్.
డెన్మార్క్ నుంచి దీనిని తాము తీసుకునేందుకు నాటో(NATO) అనుమతించాలని, విస్తరణవాదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయరాదని తేల్చిచెప్పారు ట్రంప్. రెండోవిడత అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా శ్వేతసౌధంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ తర్వాత దావోస్‌కు పయనమై ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ను ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు. అది 70 నిమిషాలసేపు కొనసాగింది. రెండుచోట్లా గ్రీన్లాండ్ అంశం ప్రస్తావనకు వచ్చింది. నాటోను ఆనందింపజేసేలా, తాము కూడా ఎంతో సంతోషపడేలా ఈ వ్యవహారాన్ని కొలిక్కి తీసుకువద్దామని ఆయన అన్నారు.
సరేనంటే సంతోషిస్తాం
‘‘ప్రపంచాన్ని రక్షించేందుకు మేం ‘ఒక ఐస్ ముక్క’ను అడుగుతున్నాం. నాటో దేశాలు దానిని వదిలిపెట్టవట. వాళ్లు సరేనంటే మేం ఎంతో సంతోషిస్తాం. ఒకవేళ వాళ్లు నో చెబితే మేం దానిని గుర్తుపెట్టుకుంటాం. బలాన్ని ప్రయోగించనిదే మాకు ఏదీ దొరక్కపోవచ్చు. అలాచేస్తే మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కానీ నేను అది చేయను. సరేనా.? గ్రీన్లాండ్ అంటే భూమి కాదు. అదొక భారీ మంచుముక్క. అమెరికా, చైనా, రష్యా మధ్య ఉండటం వల్ల వ్యూహాత్మకంగా మాకు అదెంతో కీలకం. అంతేగానీ ఆ మంచుకింద భారీగా ఉన్న అరుదైన ఖనిజాల కోసం కాదు. దశాబ్దాలుగా మేం ఇచ్చినదానితో పోలిస్తే ఇప్పుడు అడుగుతున్నది చాలాచిన్నది’’ అని దావోస్‌లో చెప్పారు.
డెన్మార్క్(DENMARK) నుంచి గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు వెంటనే సంప్రదింపులు మొదలుపెట్టాలన్నారు. రెండో ప్రపంచయుద్ధ సమయంలో డెన్మార్క్‌ను అమెరికా కాపాడినా ఆ దేశంలో తమపట్ల కృతజ్ఞత లేదని విమర్శించారు. యూరప్ బాగుండాలనే తాను కోరుకుంటానని, అయితే అది సరైన దిశలో వెళ్లడం లేదని చెప్పారు.
భద్రత కోసమే నియంత్రణ
గ్రీన్లాండ్ నిజానికి ఉత్తర అమెరికా భూభాగమేనని ట్రంప్ చెప్పారు. ఆర్కిటిక్ భూభాగంలో తవ్వకాలు చేయడం కష్టమని, కొన్ని వందల అడుగులకొద్దీ మంచును తవ్వాల్సి ఉంటుందని తెలిపారు. తాను ప్రతి దేశంతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నానని, ఏ దేశాన్నీ నాశనం చేయాలనుకోవడం లేదని స్పష్టంచేశారు. ట్రంప్ ప్రసంగాన్ని వినేందుకు ప్రతినిధులు పెద్దఎత్తున ఉత్సాహం చూపించారు. రెండు గంటల ముందే వారంతా బారులు తీరారు. కొన్ని వందలమంది బయటే ఉండిపోయి తెరలపై వీక్షించాల్సి వచ్చింది. మరోపక్క ఆయన్ని వ్యతిరేకిస్తూ పలువురు ప్రదర్శనలు చేశారు.






