Amaravathi: కౌంట్‌డౌన్ స్టార్ట్! ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత దిశగా అడుగులు..
ఇకపై ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) అని గర్వంగా చెప్పుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న భావన రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అధికారికంగా రాజధానికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ తుదిదశకు చేరుతోందని సమాచారం. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో అమరావతి రాజధాని అంశంపై కౌంట్‌డౌన్ మొదలైనట్టే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత రావాలంటే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం (Andhra Pradesh Reorganisation Act)లో సవరణలు చేయాల్సి ఉంటుంది. 2014 జూన్ 2 నుంచి పదేళ్ల పాటు హైదరాబాద్ (Hyderabad)ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా పేర్కొన్నారు. ఆ గడువు 2024 జూన్ 2తో ముగిసినా, ఇప్పటివరకు ఏపీకి రాజధానిని అధికారికంగా ప్రకటించలేదు. దీంతో ఇప్పుడు కేంద్రం ముందుకు స్పష్టమైన ప్రతిపాదన వెళ్లింది.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమరావతిని రాజధానిగా గుర్తించాలంటూ కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. రాజధాని ఎంపికకు అనుసరించిన విధాన ప్రక్రియతో పాటు, అక్కడ జరుగుతున్న నిర్మాణాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలను కూడా ఒక సమగ్ర నివేదిక రూపంలో వివరించింది. అమరావతిని అధికారిక రాజధానిగా ఖరారు చేయాలని కేంద్రాన్ని స్పష్టంగా కోరింది. దీనిపై కేంద్ర హోంశాఖ (Union Home Ministry) పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించిందని తెలుస్తోంది.
ఈ అంశంపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ (Ministry of Urban Development), న్యాయ శాఖ, వ్యవసాయ శాఖతో పాటు నీతి ఆయోగ్ (NITI Aayog) అభిప్రాయాలను కూడా హోంశాఖ సేకరిస్తోందని సమాచారం. అన్ని శాఖల అభిప్రాయాలు వచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ తన తుది ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్ ముందు ఉంచనుంది. అక్కడ ఆమోదం లభిస్తే పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టే ప్రక్రియ మొదలవుతుంది.
ముందుగా లోక్ సభ (Lok Sabha)లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ (Rajya Sabha)కు పంపిస్తారు. రెండు సభల్లో ఆమోదం లభించిన అనంతరం రాష్ట్రపతి (President of India) సంతకం చేస్తే చట్టబద్ధత పూర్తవుతుంది. ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ క్షణం నుంచే అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు శాశ్వత రాజధానిగా అధికారిక హోదా పొందుతుంది.
రాజధాని ఎప్పటి నుంచి వర్తింపచేయాలి అన్న అంశంపైనా గతంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 2024 జూన్ 2 నుంచే అమరావతిని ఏపీ రాజధానిగా పరిగణించాలని స్పష్టంగా సూచించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ బడ్జెట్ సమావేశాల్లోనే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తుండటంతో, అమరావతి దశ తిరిగినట్టే అన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. ఇప్పుడు అధికారిక ముద్ర పడితే, అమరావతి పేరు దేశవ్యాప్తంగా మరోసారి బలంగా వినిపించనుంది.






