Parliament: పార్లమెంట్లో కొత్త హాజరు రూల్స్… అసెంబ్లీలకూ వర్తిస్తాయా?
దేశంలో అత్యున్నత చట్ట సభగా పార్లమెంట్ (Parliament) గుర్తింపు పొందింది. ఇక్కడ జరిగే చర్చలు, తీసుకునే నిర్ణయాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతాయి. రాష్ట్రాల శాసనసభలు కూడా చాలా సందర్భాల్లో పార్లమెంట్ విధానాలను పరిశీలించి అమలు చేసే ప్రయత్నం చేస్తుంటాయి. అయితే ఇటీవలి కాలంలో పార్లమెంట్ సమావేశాల్లో సభ్యుల హాజరు అంశం పెద్ద చర్చకు దారితీస్తోంది. సంవత్సరానికి మూడు సార్లు జరిగే సమావేశాలకు చాలా మంది ఎంపీలు పూర్తి స్థాయిలో హాజరు కావడం లేదన్న విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో కోరం పూర్తికాక సభను వాయిదా వేయాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల్లో అసంతృప్తిని పెంచుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అవసరమని రాజకీయ, న్యాయ వర్గాలు చాలాకాలంగా కోరుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న సమావేశాల సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla) సభ్యుల హాజరు విషయంలో కొత్త నియమాలను ప్రకటించారు. ఇకపై సభలో సభ్యులు తమ సీట్లలో కూర్చున్న తరువాతే హాజరు నమోదు అవుతుందని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకత, జవాబుదారీతనం పెంచడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశ్యమని ఆయన మీడియాకు తెలిపారు.
ఇప్పటివరకు సభ బయట రిజిస్టర్లో సంతకం చేసి హాజరు నమోదు చేసుకునే పద్ధతి ఉండేది. ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఇకపై లోక్ సభలో ప్రతి సభ్యుడి సీటు వద్ద ప్రత్యేక కన్సోల్ పరికరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఎంపీలు తమ సీట్లలో కూర్చున్నాక ఆ కన్సోల్ ద్వారా ఆటోమేటిక్గా హాజరు నమోదు అవుతుంది. సభ ముగిసిన తరువాత లేదా మధ్యలో వాయిదా పడినప్పుడు హాజరు వేయడానికి అవకాశం ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు.
ఈ కొత్త విధానం వల్ల సభ్యులు కేవలం సంతకం కోసం కాకుండా నిజంగా సభలో పాల్గొనే పరిస్థితి ఏర్పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. చర్చల్లో పాల్గొనడం, ప్రజల సమస్యలను లేవనెత్తడం మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు. ప్రజాప్రతినిధుల బాధ్యతను గుర్తు చేసే దిశగా ఇది ఒక కీలక అడుగుగా అభిప్రాయపడుతున్నారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (Andhra Pradesh Assembly)లో జరుగుతున్న పరిణామాలపై కూడా చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదని, బయట రిజిస్టర్లో సంతకం చేసి వెళ్లిపోతున్నారని కూటమి ప్రభుత్వ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై ఎథిక్స్ కమిటీ (Ethics Committee) పరిశీలన జరుపుతోందన్న సమాచారం కూడా ఉంది.
లోక్ సభలో అమలవుతున్న ఈ కొత్త హాజరు విధానాన్ని రాష్ట్ర శాసనసభలు కూడా అనుసరిస్తాయా అన్న ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అదే విధానం ఏపీ అసెంబ్లీలో అమలైతే, సభ్యులు తప్పనిసరిగా సభలోకి వచ్చి తమ సీట్లలో కూర్చున్న తరువాతే హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే వారు గైర్హాజరైనట్లుగానే లెక్కపడతారు. అరవై పని దినాల లోపు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు పడే అవకాశముందన్న చర్చ కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ శాసనసభ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.






