DAVOS: మాపై అధిక పన్నులు విధించండి.. సూపర్ రిచ్ బృందం ఆసక్తికర ప్రతిపాదన..!
దావోస్ వేదికగా ఓ వినూత్న ప్రతిపాదన వచ్చింది. ఎప్పుడు తమ వ్యాపారాలు బాగా జరగాలని.. తాము మరింత సంపన్నులు కావాలని.. ప్రయత్నిస్తుంటారు. వీలైనన్ని మిలియన్లు, బిలియన్ల డబ్బు పోగేసుకుంటారు కూడా .అయితే వారు చట్టబద్దంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యాపారం చేస్తుంటారు కాబట్టి.. వారి సేవలు సమాజానికి ఉపయోగంగాఉంటాయి. అయితే అలాంటి సూపర్ రిచ్ వ్యాపారస్తులు, కంపెనీల యజమానులు.. ఓ ఆసక్తికర ప్రతిపాదన చేశారు. తమపై అధిక పన్నులు వేయాలని వారు కోరారు.
24 దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సూపర్ రిచ్ బృందం ‘టైమ్ టు విన్’ పేరిట సంతకాలు చేసిన బహిరంగ లేఖను విడుదల చేసింది. మార్కు రుఫలో, బ్రియాన్ ఎనో, అబిగైల్ డిస్నీ వంటి సూపర్ రిచ్ ఈ మేరకు డిమాండ్ చేస్తూ బహిరంగ లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అసమానత్వాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సంపన్నులకు, సామాన్యులకు మధ్య అంతరం నానాటికి పెరుగుతోందని తెలిపారు.
Wealthy call for higher taxes on the super rich:
ఆర్థిక అసమానతలను రూపుమాపడానికి సూపర్ రిచ్పై అధిక పన్ను విధించాలని వారు పేర్కొన్నారు. సంపన్నులు ప్రజా జీవితాన్ని, రాజకీయ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచడమే కాకుండా, ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోందని అన్నారు. అత్యంత సంపన్నులు కొందరు ప్రజాస్వామ్యాలను కొనుగోలు చేశారని, ప్రభుత్వాలను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.
ప్రపంచంలో అసలైన ప్రజాస్వామ్య వ్యవస్థలను తాము కోరుకుంటున్నామని వారు పేర్కొన్నారు. అధిక పన్నులు విధించడం వల్ల సంపన్నుల జీవన ప్రమాణాలు పడిపోవని గుర్తుంచుకోవాలని అన్నారు. పైగా ఆ నిధులు సామాన్యుల ఆరోగ్యం, విద్య వంటి వాటికి వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.
వారు విడుదల చేసిన లేఖ ప్రకారం, ప్రపంచంలోని 1 శాతం సంపన్నుల వద్ద 95 శాతం కంటే ఎక్కువ సంపద ఉంది. జీ20 దేశాలలో నిర్వహించిన ఒక సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సంపన్నులు రాజకీయాలను ప్రభావితం చేస్తున్నారని 77 శాతం మంది భావించగా, కొందరి వద్దే అత్యధిక సంపద ఉండటం ప్రజాస్వామ్యానికి ముప్పుగా 62 శాతం మంది భావిస్తున్నారని సర్వేలో తేలింది.






