Ind Vs NZ: అతను ఈ సీరీస్ లో అయినా రాణిస్తాడా..?
భారత జట్టులో కొంతమంది ఆటగాళ్లు భారంగా మారారు అనేది ఎప్పటినుంచో వినపడుతున్న కామెంట్. చాలా రోజుల నుంచి కొంతమంది కీలక ఆటగాళ్లు.. ఆడకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టి20 జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్(Surya Kumar Yadav) ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు అభిమానులు. రెండేళ్ల నుంచి సూర్య కుమార్ యాదవ్ పెద్దగా ఆడలేదు. 2024 టి20 వరల్డ్ కప్ లో కూడా అతను రాణించలేదు. 2023 వన్డే వరల్డ్ కప్ లో అతను రాణించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది.
ఇక ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న టి20 సిరీస్ లు గాని, ఇటీవల ఆస్ట్రేలియాలో జరిగిన టి20 సిరీస్ లో గాని అతను ఆడక పోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. జట్టు యాజమాన్యం అతనిని వెనకేసుకొస్తున్న నేపథ్యంలో, బోర్డు కూడా కొంత అసహనం వ్యక్తం చేస్తుంది. జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లు కెప్టెన్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో, సూర్య కుమార్ యాదవ్ కు ఎన్ని అవకాశాలు ఇచ్చిన ఆడటం లేదనేది బోర్డు ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. అతనికి టి20 వరల్డ్ కప్ చివరి అవకాశం గా చెబుతున్నారు.
ఆ వరల్డ్ కప్ లో కనుక అతను రాణించకపోతే మాత్రం, కచ్చితంగా జట్టు నుంచి తప్పించడం ఖాయంగా కనబడుతోంది. ఇక హెడ్ కోచ్ గౌతం గంభీర్.. విరాట్ కోహ్లీ(Virat Kohli) గాని రోహిత్ శర్మ(Rohith Sharma) విషయంలో గానీ, చేసిన హడావుడి సూర్య కుమార్ యాదవ్ విషయంలో చేయడం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. న్యూజిలాండ్ తో జరిగే టి20 సిరీస్ లో అతను రాణించాల్సిన అవసరం ఉంది. లేదంటే మాత్రం టీ20 వరల్డ్ కప్ పై అతని విషయంలో ఒత్తిడి పెరిగే అవకాశాలు సైతం కనపడుతున్నాయి. ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ ఫిట్నెస్ పరంగా పరవాలేదు అనిపించినా.. ఆట తీరు మాత్రం దారుణంగా ఉండటంతో.. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి అనే డిమాండ్ కూడా వినపడుతోంది. స్వదేశంలో జరిగే న్యూజిలాండ్ తో సిరీస్ లో ఆడితే, వచ్చేనెల నుంచి ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో రాణించడానికి అవకాశం దొరుకుతుంది.






