Davos: దావోస్‌లో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో ముఖ్యమంత్రి భేటీ
ఫిబ్రవరిలో ఆర్సెల్లార్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన
ప్లాంట్ అనుమతులపై కేంద్రంతో సంప్రందించండి
అనకాపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
దావోస్, జనవరి 21: వచ్చేనెల 15వ తేదీ తర్వాత అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు మూడో రోజైన బుధవారం వివిధ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు నిర్వహించారు. దీంట్లో భాగంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రాంగణంలోని ఏపీ లాంజ్‌లో ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో అనకాపల్లిలో ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై చర్చించారు. తొలిదశలో దాదాపు రూ.60 వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంటుకు సంబంధించి రావాల్సిన అనుమతులపై సీఎం చంద్రబాబు మిట్టల్ సమక్షంలోనే అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…”ఫిబ్రవరి నెలలో 15వ తేదీ తర్వాత ఆర్సెల్లార్ మిట్టల్ స్టీల్ శంకుస్థాపన చేయబోతున్నాం. ఈలోగానే అనుమతులు, భూసేకరణ అంశాలు పూర్తి చేయాలి. సాధ్యమైనంత త్వరగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేసుకుని ఉత్పత్తి ప్రారంభించాలి. ప్రభుత్వం నుంచి అనుమతులు, సహకారంలో ఎక్కడా జాప్యం ఉండకూడదు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అన్ని అనుమతుల సాధించాలి. ఈ బాధ్యతలను మంత్రులు లోకేష్, టీజీ భరత్ తీసుకోవాలి” అని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్లాంట్ ఏర్పాటు విషయంలో మంత్రి నారా లోకేష్ నుంచి చక్కటి సహకారం అందుతోందని ఈ సందర్భంగా ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్ ప్రస్తావించారు. అనుమతులు సహా… ప్లాంట్ ఏర్పాటుపై మంత్రి లోకేష్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని సీఎం చంద్రబాబుతో ఆదిత్య మిట్టల్ అన్నారు. ఇదే సందర్భంలో రాష్ట్రంలో వివిధ రంగాల్లో పెట్టుబడులు, పరిశ్రమల ఏర్పాటుపై లక్ష్మీ మిట్టల్‌కు సీఎం చంద్రబాబు వివరించారు. ఈ భేటీలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






