TDP: రాజ్యసభ ఆశలతో చంద్రబాబు వద్దకు టీడీపీ నేతలు.. అంతర్గత రాజకీయాల్లో కొత్త చర్చ..
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కార్యాలయంలో జరిగిన ఒక అంతర్గత భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయానికి వచ్చిన సమయంలో, పలువురు సీనియర్ నేతలు ఆయనను వ్యక్తిగతంగా కలిశారు. ఈ సమావేశాలు బయటకు సాధారణంగానే కనిపించినా, లోపల మాత్రం తీవ్రమైన ఆవేదన వ్యక్తమైందని సమాచారం.
“సర్… ఉద్యోగం వదిలేసి పార్టీ కోసం వచ్చాను. 25 ఏళ్లుగా సేవ చేస్తున్నా. నన్ను ఒక్కసారి గమనించండి” అంటూ ఒక నేత భావోద్వేగానికి లోనయ్యారు. మరో నేత “గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేశాను. ఇప్పుడు కూడా పట్టించుకోకపోతే నియోజకవర్గంలో తలెత్తుకోలేను” అని విన్నవించారు. ఇలా ఒక్కొక్కరు తమ సమస్యలను, త్యాగాలను చంద్రబాబు ముందు ఉంచారు. బయటికి చెప్పకపోయినా, లోపల వారి ఆకాంక్ష ఒక్కటే అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆ ఆకాంక్ష..త్వరలో ఖాళీ కాబోతున్న రాజ్యసభ (Rajya Sabha) సీట్లు. మొత్తం నాలుగు సీట్లు ఖాళీ అవుతున్న నేపథ్యంలో, అందులో కనీసం రెండు సీట్లు టీడీపీకి దక్కే అవకాశం ఉందని అంచనా. ఈ రెండు సీట్ల కోసం పార్టీలో పోటీ తీవ్రంగా ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు ఈ రేసులో ఉన్నారని ప్రచారం జరుగుతోంది.
ఇదే సమయంలో ఒక ఎస్సీ నాయకుడు కూడా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. గతంలో పోలీస్ ఉద్యోగాన్ని వదిలేసి టీడీపీలో చేరిన ఈ నేత, పార్టీ కోసం నిరంతరం పనిచేశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. గత రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనుభవం ఉన్నప్పటికీ, ఈసారి అయినా తనకు న్యాయం చేయాలనే ఆకాంక్షతో చంద్రబాబును కలిసినట్లు తెలుస్తోంది.
మరోవైపు, ఒక మాజీ మంత్రి తన డిమాండ్‌ను బలంగా వినిపించినప్పటికీ, బహిరంగంగా మాత్రం ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని పార్టీలో చర్చ నడుస్తోంది. ఎవరు నేరుగా “నాకు రాజ్యసభ సీటు కావాలి” అని చెప్పకపోయినా, తమ సేవలు, త్యాగాలు, సామాజిక సమీకరణలు అన్నీ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని సమాచారం.
ఈ భేటీలు జరిగిన రెండు రోజుల తర్వాతే ఈ వ్యవహారం బయటకు రావడం విశేషం. అప్పటివరకు ఎవరి భేటీ వారిదే అన్నట్టు నిశ్శబ్దంగా సాగింది. అయితే ఇప్పుడు ఈ రాజ్యసభ సీట్ల అంశం టీడీపీలో కొత్త చర్చకు తెరలేపింది. చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సామాజిక సమతుల్యతకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు, పార్టీకి విధేయత చూపిన వారిని ఎలా ఆదరిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో ఈ అంశం పార్టీ అంతర్గత రాజకీయాలను మరింత వేడెక్కించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.






