AP Liquor Scam: డిఫాల్ట్ పాయే..! లిక్కర్ స్కాం నిందితులకు సుప్రీంకోర్టులో షాక్..!
ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో నిందితులకు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమకు లభించిన డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిందితులు దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు నిర్ణయం సరైనదేనని స్పష్టం చేస్తూ, నిందితులు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలకు గట్టి షాక్ తగిలినట్లయింది.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా, డిస్ట్రిబ్యూషన్, టెండర్ల ప్రక్రియలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ మద్యం షాపుల నిర్వహణలో ప్రైవేటు వ్యక్తుల జోక్యం, డిజిటల్ పేమెంట్లు తీసుకోకుండా కేవలం నగదు రూపంలోనే లావాదేవీలు నిర్వహించడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని దర్యాప్తు సంస్థలు అభియోగాలు మోపాయి. ఈ క్రమంలోనే కీలక పాత్రధారులుగా భావిస్తున్న కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్పలను పోలీసులు అరెస్ట్ చేశారు.
సాధారణంగా ఏదైనా కేసులో దర్యాప్తు సంస్థలు నిర్ణీత గడువులోగా చార్జిషీట్ దాఖలు చేయలేకపోతే, నిందితులకు డిఫాల్ట్ బెయిల్ లభిస్తుంది. ఈ సాంకేతిక వెసులుబాటును ఉపయోగించుకుని నిందితులు ట్రయల్ కోర్టు నుంచి బెయిల్ పొందారు. అయితే, కేసు తీవ్రత దృష్ట్యా, దర్యాప్తులో ఉన్న సంక్లిష్టతను పరిగణనలోకి తీసుకోకుండా బెయిల్ ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు ఈ వాదనతో ఏకీభవిస్తూ, ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసింది. కీలక ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున నిందితులు మళ్లీ రిమాండ్‌కు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది.
హైకోర్టు తీర్పును నిందితులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. “తమ క్లయింట్లు ఇప్పటికే తగినంత కాలం జైలులో గడిపారని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వారి స్వేచ్ఛను హరించడం సరికాదని” నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. అయితే, సీజేఐ ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. హైకోర్టు ఈ విషయంలో చట్టబద్ధంగానే వ్యవహరించిందని, కేసు తీవ్రత దృష్ట్యా డిఫాల్ట్ బెయిల్ సరైనది కాదని భావించడంలో తప్పులేదని కోర్టు స్పష్టం చేసింది. అయితే.. నిందితులు వెంటనే జైలుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, వారికి 4 వారాల పాటు మధ్యంతర రక్షణ కల్పించింది. ఈ లోపు వారు రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించింది. ఒకవేళ ట్రయల్ కోర్టులో ఊరట లభించకపోతే, తిరిగి హైకోర్టును ఆశ్రయించే హక్కును కూడా సుప్రీంకోర్టు కల్పించింది.
అరెస్ట్ అయినప్పటి నుండి నిందితులు దాదాపు 5 నెలలు జైలులోనే గడిపారు. దర్యాప్తు సంస్థలు వీరిని సుదీర్ఘంగా విచారించాయి. మద్యం సిండికేట్ల వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఎవరు? ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన నగదు ఎక్కడికి మళ్లింది? వంటి అంశాలపై విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో నిందితులపై ఒత్తిడి పెరిగింది. ఇప్పుడు వారు డిఫాల్ట్ కాకుండా, మెరిట్స్ ఆధారంగా బెయిల్ పొందాల్సి ఉంటుంది.
ఏపీ మద్యం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు దర్యాప్తు సంస్థలకు బలాన్నిచ్చింది. 4 వారాల గడువు ముగిసిన తర్వాత నిందితుల భవిష్యత్తు ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మద్యం అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్న వేళ, ఈ న్యాయ పోరాటం రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సంచలనాలకు దారితీస్తుందో వేచి చూడాలి.






