YS Jagan: మళ్లీ జనంలోకి జగన్… ‘మహా పాదయాత్ర’కు రంగం సిద్ధం!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన అమ్ములపొదిలోని ప్రధాన అస్త్రాన్ని బయటకు తీయబోతున్నారు. 2024 ఎన్నికల ఓటమి అనంతరం కేడర్లో నెలకొన్న నైరాశ్యాన్ని పోగొట్టి, పార్టీకి పునర్వైభవం తీసుకురావడమే లక్ష్యంగా ఆయన మళ్లీ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ స్పష్టం చేయడంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ఇవాళ తాడేపల్లిలోని తన నివాసంలో ఏలూరు నియోజకవర్గ ముఖ్య నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతపై చర్చించారు. ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేయాలంటే మీరు నేరుగా జనంలోకి రావాలని, గతంలో మాదిరిగా పాదయాత్ర చేపట్టాలని నేతలు జగన్ను కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన జగన్, వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర ప్రారంభిస్తానని క్లారిటీ ఇచ్చారు.
వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానంలో పాదయాత్రకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 2014 ఓటమి తర్వాత ఆయన చేపట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ 2019లో ఆయనను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. దాదాపు 3,648 కిలోమీటర్ల మేర సాగిన ఆ యాత్ర అప్పట్లో జనంతో జగన్ను మమేకం చేసింది. 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత, పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందడానికి మళ్లీ అదే మార్గాన్ని ఎంచుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఎన్నికల ఫలితాల తర్వాత తాను నిత్యం ప్రజల్లోనే ఉంటానని, ప్రతి నెలా జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ ప్రకటించినప్పటికీ, గత ఏడాది కాలంగా ఆయన ఎక్కువగా తాడేపల్లి నివాసానికే పరిమితమయ్యారు. వారం వారం బెంగళూరు వెళ్లి వస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమైన సందర్భాలు తక్కువ. దీంతో ప్రత్యర్థుల నుంచి విమర్శలు రావడమే కాకుండా, పార్టీ కార్యకర్తలు కూడా కొంత డీలా పడ్డారు. ఇప్పుడు జగన్ స్వయంగా పాదయాత్ర ప్రకటన చేయడంతో, గ్రామస్థాయి నేతల్లో మళ్లీ కదలిక వస్తుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభించబోతున్న జగన్ ముందు కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి హామీల అమలులో వైఫల్యాలను ఎండగట్టాల్సి ఉంటుంది. ఓటమితో నిరుత్సాహపడి ఇతర పార్టీల వైపు చూస్తున్న నేతలను ఆపి, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని బలోపేతం చేయాలి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లోపాలను సరిదిద్దుకుంటామనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం ముఖ్యం.
మొత్తానికి, జగన్ నిర్ణయం వైసీపీలో ఒక కొత్త ఆశను చిగురింపజేసింది. రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు పాదయాత్ర వారి రాజకీయ విజయాలకు వెన్నెముకగా నిలిచింది. మరి 2027లో ప్రారంభం కాబోయే ఈ రెండో విడత మహా పాదయాత్ర జగన్కు పూర్వ వైభవాన్ని తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి.






