AR Rahman Controversy: “భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు”.. తండ్రికి అండగా రెహమాన్ పిల్లలు
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. బాలీవుడ్లో మతతత్వం పెరిగిపోయిందని, పవర్ షిఫ్ట్ కారణంగా గత ఎనిమిదేళ్లలో తనకు అవకాశాలు తగ్గాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ‘ఛావా’ వంటి సినిమాలు ప్రజల మధ్య విభజన తెచ్చేలా ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో, రెహమాన్ క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, ఆయనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను చూసి రెహమాన్ పిల్లలు తీవ్రంగా స్పందించారు.
రహీమా రెహమాన్ ఆవేదన
రెహమాన్ కుమార్తె రహీమా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సమాజంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. “వీరికి భగవద్గీత, ఖురాన్, బైబిల్ చదవడానికి కూడా సమయం లేదు. ఈ పవిత్ర గ్రంథాలు ప్రేమ, శాంతి, సత్యాన్ని బోధిస్తాయి.
కానీ వీళ్లకు ఒకరితో ఒకరు వాదించుకోవడానికి, ఎగతాళి చేయడానికి, దూషించడానికి సమయం ఉంది” అని ఆమె పేర్కొన్నారు. ఇది మతం కాదని, విషపూరిత రాజకీయాలు, పేలవమైన పెంపకం వల్ల ఏర్పడిన అంధ సమాజం అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం కంటే ద్వేషానికి విధేయత చూపే తరాన్ని చూస్తున్నామన్నారు.
అమీన్, ఖతీజా మద్దతు
రెహమాన్ కుమారుడు అమీన్, మరో కుమార్తె ఖతీజా కూడా రెహమాన్ చేసిన సేవలను గుర్తు చేస్తూ పలు వీడియోలు, ఫోటోలను షేర్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెహమాన్ జాతీయ అవార్డు అందుకుంటున్న ఫొటోను వారు షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒకప్పుడు రెహమాన్ గురించి మాట్లాడుతూ.. “రెహమాన్ సంగీతం భారతీయ సంస్కృతి స్వరంగా మారింది” అని ప్రశంసించిన వీడియోను అమీన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కోల్డ్‌ప్లే సింగర్ క్రిస్ మార్టిన్‌తో కలిసి రెహమాన్ ఇచ్చిన ప్రదర్శన వీడియోలను షేర్ చేస్తూ, తమ తండ్రి దేశాన్ని ఎన్నిసార్లు గర్వపడేలా చేశారన్నారు. రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారినప్పటికీ, ఆయన పిల్లలు మాత్రం ఆయన సాధించిన విజయాలను, వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.






