Nara Lokesh: ఎంపీలకు లోకేష్ హెచ్చరిక, పార్లమెంట్ కువెళ్ళాల్సిందే..!
పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు విషయంలో ఏపీలో కూటమి పార్టీల అధినేతలు, ఎన్నిసార్లు చెప్పినా సరే ఎంపీలు, ఎమ్మెల్యేల వైఖరిలో మార్పు రావడం లేదు అనే మాట మనకు వినపడుతూనే ఉంది. ఇటీవల రిజిస్టర్లో సంతకం పెట్టి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారు అనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని, ఇప్పటికే ఎమ్మెల్యేలకు హెచ్చరికలు పంపారు అనేది ప్రధానంగా వినపడిన మాట.
అయితే తాజాగా ఎంపీలకు కూడా పార్టీ అధిష్టానం నుంచి వార్నింగ్ వెళ్లినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు(Budget Session) త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఎంపీలు అందరూ పార్లమెంటు సమావేశాలకు హాజరు కావాలని, నియోజకవర్గాల సమస్యలను పార్లమెంటులో ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, రాష్ట్రానికి పూర్తిస్థాయిలో ఎంపీల నుంచి సహకారం ఉండాలని.. టిడిపి అధిష్టానం హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎంపీలతో ఇప్పటికే మంత్రి నారా లోకేష్ మాట్లాడారని వార్తలు వస్తున్నాయి.
కొత్తగా ఎంపికైన ఎంపీలు, సీనియర్ల నుంచి సలహాలు తీసుకుని పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడాలని, పార్లమెంట్ సమావేశాల్లో ఏఏ అంశాలను ప్రస్తావించాలి అనే అంశానికి సంబంధించి కూడా తెలుసుకోవాలని.. లోకేష్ స్పష్టం చేసినట్లు సమాచారం. చాలామంది ఎంపీలు పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా, ఢిల్లీలోనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారని.. ఇప్పటికే కొంతమంది ఎంపీల గురించి తమ వద్ద సమాచారం ఉందని కూడా, లోకేష్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థిక కష్టాల్లో ఉంది.. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహకారం పూర్తిస్థాయిలో కావాలని, అదేవిధంగా రైల్వే అభివృద్ధి పనులు కూడా రాష్ట్రంలో భారీగా జరగాల్సి ఉందని, ఇక రోడ్డు నిర్మాణాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాల్సిన అవసరం ఉందని, కాబట్టి ఎంపీలు అందరూ తమ తమ నియోజకవర్గాల గురించి, రాష్ట్రం గురించి కేంద్రం ముందు ప్రస్తావించాలంటే బడ్జెట్ సమావేశాలు కీలక వేదికని.. రైతాంగ సమస్యలను కూడా పార్లమెంట్ వేదిక ప్రస్తావిస్తే పరిష్కారం దొరుకుతుందని నారా లోకేష్ అభిప్రాయ పడినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకపోతే కఠిన చర్యలు ఉంటాయని లోకేష్ హెచ్చరించారట.






