Pawan Kalyan: పేషీపై పవన్ ఆరా, అందుకే ఆ నిర్ణయమా..?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. పరిపాలనపై గతంలో ఎన్నడూ లేనివిధంగా దూకుడు పెంచారు. పార్టీ కార్యక్రమాల విషయంలో ఈ మధ్యకాలంలో దూకుడు పెంచిన పవన్, ఇప్పుడు పరిపాలన విషయంలో కూడా అదే తరహా వైఖరి ప్రదర్శిస్తున్నారు. అధికారులు పనిచేయడం లేదని విమర్శలు, అదే విధంగా తన పేషీలో జరుగుతున్న కొన్ని కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఆగ్రహం గా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వచ్చిన వార్తల ప్రకారం, వారంలో కనీసం మూడు రోజులు సచివాలయానికి(AP Secretariat) రావాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు.
అదే విధంగా సమీక్ష సమావేశాలు విషయంతో పాటుగా ఫైల్స్ క్లియరెన్స్ విషయంలో కూడా, దూకుడు ప్రదర్శించాలని డిప్యూటీ సీఎం(Deputy CM) నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. అయితే పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక మరో బలమైన కారణం ఉందని వార్తలు వస్తున్నాయి. సచివాలయంలోని తన పేషీలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు వైసీపీ నేతలకు సహకరిస్తున్నారనే ఆరోపణ.. పవన్ దృష్టిలో పడినట్లు వార్తలు వచ్చాయి. అదే విధంగా ఫైల్స్ క్లియరెన్స్ కు సంబంధించి అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారనే విమర్శ కూడా ఉంది.
కనీసం తన వద్దకు ఫైల్స్ రావడం లేదనే కోపం కూడా పవన్ కళ్యాణ్ లో ఉండి ఉండవచ్చు అంటున్నాయి ఏపీ సచివాలయ వర్గాలు. ఇక డిప్యూటీ సీఎం వారంలో మూడు రోజులు పాటు సచివాలయంలో ఉండాలని నిర్ణయం తీసుకోవడంతో.. అధికారులు పరుగులు పెడుతున్నారు. ఎవరెవరు తన కార్యాలయానికి వస్తున్నారు అనేదానికి సంబంధించి, పూర్తి వివరాలు తనకు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కోరినట్లు సమాచారం. అటు పంచాయతీరాజ్ శాఖతో పాటుగా తాను నిర్వహిస్తున్న ఇతర శాఖలలో కూడా.. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నట్లు కోపంగా ఉన్నారు పవన్. దీనితో అటవీ శాఖ కార్యాలయాలను, పంచాయతీరాజ్ శాఖ కార్యాలయాలను క్షుణ్ణంగా తనిఖీ చేసే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ పర్యటనలు మొదలయ్యే అవకాశాలు ఉండవచ్చు. కీలకమైన సమస్యలను కూడా తమ దృష్టికి తీసుకురావడం లేదనే కోపం పవన్ కళ్యాణ్ లో ఉన్నట్లుగా చెప్తున్నాయి ఏపీ ప్రభుత్వ వర్గాలు.






