China: భారత్‌పై చైనా కయ్యం.. డబ్ల్యూటీఓలో ఫిర్యాదు!
సరిహద్దుల్లోనే కాకుండా వాణిజ్య పరంగానూ భారత్‌తో చైనా (China) తలపడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు అమలు చేస్తున్న పథకాలపై డ్రాగన్ దేశం అక్కసు వెళ్లగక్కుతోంది. మన దేశీయ ఈవీ విధానాలను సవాలు చేస్తూ ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO) మెట్లెక్కింది.
భారత్ అమలు చేస్తున్న ఆటోమొబైల్, బ్యాటరీ ప్రోత్సాహక పథకాలపై గతేడాది నవంబర్, ఈ ఏడాది జనవరిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో ఎలాంటి పరిష్కారం లభించకపోవడంతో, సమస్య పరిష్కారానికి తక్షణమే ఒక ‘ప్యానెల్’ను ఏర్పాటు చేయాలని డబ్ల్యూటీఓను చైనా (China) కోరింది. జనవరి 27న జెనీవాలో జరగబోయే సమావేశంలో దీనిపై చర్చ జరిగే అవకాశముంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
భారత్ ప్రవేశపెట్టిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (PLI) పథకంపైనే చైనా (China) ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ పథకం ద్వారా భారత్ కేవలం దేశీయంగా తయారైన వస్తువులకే రాయితీలు ఇస్తోందని, తద్వారా చైనా ఉత్పత్తులపై వివక్ష చూపుతోందని ఆరోపిస్తోంది. ఇది డబ్ల్యూటీఓ వాణిజ్య, పెట్టుబడి ఒప్పందాలకు విరుద్ధమని చైనా (China) వాదిస్తోంది. భారత్ తన ఈవీ తయారీని పెంచుకోవడం వల్ల తమ వ్యాపారం దెబ్బతింటుందనేది చైనా అసలు బాధ అని విశ్లేషకులు అంటున్నారు.






