Jaishankar: ఉగ్రవాదానికి సహకరించొద్దు.. పోలాండ్‌కు జైశంకర్ స్ట్రాంగ్ మెసేజ్!
ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ విషయంలో ‘జీరో టాలరెన్స్’ (Zero Tolerance) విధానాన్నే పాటించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రడోస్లా సికోర్స్కీతో సోమవారం ఢిల్లీలో ఆయన భేటీ అయ్యారు. గత అక్టోబర్‌లో పోలాండ్-పాకిస్తాన్ సంయుక్త ప్రకటనలో కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై పరోక్షంగా స్పందించిన జైశంకర్ (Jaishankar).. సరిహద్దు ఉగ్రవాదం (Cross-border Terrorism) వల్ల కలిగే అనర్థాలను వివరించారు. పొరుగు దేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో సహకరించకూడదని పోలాండ్‌కు హితవు పలికారు. అలాగే ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఇరు దేశాల మధ్య వాణిజ్యం గత దశాబ్దంలో 200 శాతం వృద్ధి చెంది 7 బిలియన్ డాలర్లకు చేరిందని జైశంకర్ (Jaishankar) తెలిపారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్ శరణార్థులకు ఆశ్రయం ఇచ్చిన ‘గుడ్ మహారాజా’ (దిగ్విజయసింహజీ) సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జైశంకర్ (Jaishankar) వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని సికోర్స్కీ తెలిపారు. తమ దేశం కూడా ఉగ్రవాద సమస్యను ఎదుర్కొంటోందని, ఉగ్రవాద నిర్మూలనలో భారత్‌తో కలిసి పనిచేస్తామని హామీ ఇచ్చారు. రక్షణ, డిజిటల్ టెక్నాలజీ, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు ఇరువురు నేతలు అంగీకరించారు.






