TAGB: షణ్ముఖ ప్రియ పాటల హోరులో టిఎజిబి సంక్రాంతి సూపర్ హిట్
గ్రేటర్ బోస్టన్ తెలుగు అసోసియేషన్ (టిఎజిబి) ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరిగింది. స్థానిక బెల్లింగ్ హామ్ హైస్కూల్ లో జరిగిన ఈ వేడుకకు 650 మందికి పైగా ప్రవాస తెలుగు వారు హాజరై, మన సంస్కృతీ సంప్రదాయాలను ఘనంగా చాటిచెప్పారు.
ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన ప్రముఖ భారతీయ సినీ గాయని షణ్ముఖ ప్రియ అండ్ టీం లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అద్భుతమైన పాటలతో ఆమె స్టేజ్ పై సృష్టించిన సందడికి ప్రేక్షకులు ఫిదా అయ్యి, ‘స్టాండింగ్ ఓవేషన’తో నీరాజనాలు పలికారు. అంతకుముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సుమారు 100 మందికిపైగా స్థానిక కళాకారులు 25 రకాల ప్రదర్శనలతో అలరించారు.
ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గొంది మాట్లాడుతూ ఈ ఏడాది సంక్రాంతి వేడుకలను అన్ని తరాల వారిని అలరించేలా నిర్వహించాలన్న మా సంకల్పం నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. 650 మంది సభ్యులు ఒకే చోట చేరి మన పండుగను జరుపుకోవడం మాకు గర్వకారణం. స్థానిక కళాకారుల ప్రతిభకు, షణ్ముఖ ప్రియ వంటి అంతర్జాతీయ స్థాయి గాయని ప్రతిభ తోడవ్వడం ఈ కార్యక్రమానికి వన్నె తెచ్చిందని, 2026-27 నూతన కార్యవర్గం నేతృత్వంలో సంఘం మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఈ విజయం ఒక చక్కని మార్గాన్ని సుగమం చేసిందని పేర్కొన్నారు.
బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్మన్ అంకినీడు రావి మాట్లాడుతూ ఈ వేడుకల విజయానికి బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు మా గ్రాండ్ స్పాన్సర్ల మధ్య ఉన్న సమన్వయమే కారణమని చెప్పారు. మా కార్యవర్గం పక్కా ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. ఎప్పుడూ తన సామాజిక బాధ్యతను, సాంస్కృతిక విలువలను కాపాడటంలో ముందుంటుంది. రాబోయే రోజుల్లోనూ ఇదే ఉత్సాహంతో మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం అని తెలిపారు.
ఈ వేడుకలో సుమారు 27 మంది వెండర్స్ తమ ఉత్పత్తులను మరియు సేవలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హాజరైన ప్రతి ఒక్కరికీ తిరుపతి లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేసి ఆధ్యాత్మిక అనుభూతిని అందించారు.
వారసత్వానికి గౌరవం: ఈ టర్మ్ విజయవంతం కావడానికి సహకరించిన వాలంటీర్లు, పూర్వ అధ్యక్షులు, చైర్మన్లు మరియు స్పాన్సర్లకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
నూతన కార్యవర్గ పరిచయం:
2026-27 సంవత్సరానికి ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని ఈ వేదికపై అధికారికంగా పరిచయం చేశారు.
1984లో ప్రారంభమై 43 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలోని తెలుగు వారిని ఏకం చేస్తూ, భాషా సంస్కృతుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తోంది.






