Drone Ambulance:వరద వేళ ప్రాణరక్షణకు కొత్త దారి.. ఏపీలో డ్రోన్ అంబులెన్స్‌లపై ప్రభుత్వం దృష్టి..
వరదలు, తుఫానులు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమవుతాయన్నది కొత్త విషయం కాదు. గోదావరి (Godavari River) లేదా కృష్ణా (Krishna River)లో వరదలు ఉధృతంగా వచ్చినప్పుడు లంక గ్రామాలు నీట మునిగి, రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. అలాంటి పరిస్థితుల్లో అక్కడ చిక్కుకున్న ప్రజలకు ఆహారం, తాగునీరు, మందులు పంపేందుకు ఇప్పటికే డ్రోన్లను వినియోగిస్తున్న ఉదాహరణలు ఉన్నాయి. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరింత ముందడుగు వేసే ఆలోచనతో మనుషులను మోసుకెళ్లే డ్రోన్ అంబులెన్సులపై దృష్టి పెట్టడం విశేషంగా మారింది.
ఇప్పటికీ అనేక గ్రామాల్లో అనారోగ్యానికి గురైనవారిని లేదా గర్భిణీ మహిళలను నలుగురు మనుషులు దుప్పట్లో మోసుకుని ఆస్పత్రులకు తీసుకెళ్తున్న దృశ్యాలు అప్పుడప్పుడు మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లు గడిచినా ఇలాంటి పరిస్థితులు కొనసాగడం బాధాకరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, అత్యవసర వైద్య సేవల్లో కూడా ఆధునిక పరిష్కారాలు అవసరమన్న ఆలోచన బలపడుతోంది. ఈ క్రమంలోనే మానవులను మోసుకెళ్లగల డ్రోన్ అంబులెన్సులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం (Anna University)లో ఉన్న డాక్టర్ కలాం అడ్వాన్స్డ్ యుఏవీ రీసెర్చ్ సెంటర్ (Dr Kalam Advanced UAV Research Centre)తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా దీర్ఘ శ్రేణి సామర్థ్యం కలిగిన మానవ రవాణా డ్రోన్ అంబులెన్స్‌ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ సహకారం సాగుతోంది. ఈ డ్రోన్ సుమారు 150 కిలోల బరువును మోసే సామర్థ్యం కలిగి ఉండటంతో పాటు, ఒకసారి ఎగిరితే దాదాపు 90 నిమిషాల పాటు ప్రయాణించగలదని చెబుతున్నారు. దీంతో వరదలు, ప్రకృతి విపత్తుల సమయంలో ఆస్పత్రులకు చేరలేని ప్రాంతాల్లో ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న అంచనాలు ఉన్నాయి.
ఈ ప్రాజెక్ట్‌పై స్పందించిన సెంటర్ డైరెక్టర్ డాక్టర్ కె. సెంథిల్ కుమార్ (Dr K. Senthil Kumar) మాట్లాడుతూ, టెక్నాలజీ అమలు భాగస్వామిగా అన్నా యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. డ్రోన్ల కోసం బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ (BVLOS) ఆపరేషన్ విధానాలను రూపొందించడంలో కూడా తాము నాయకత్వం వహిస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో రియల్ టైమ్ ట్రాకింగ్, విమాన మార్గాల ప్రణాళిక, అనుమతుల కోసం యూనిఫైడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వ్యవస్థ (UTM) కీలకంగా పనిచేస్తుందని వివరించారు.
అన్ని అనుకూలంగా సాగితే ఈ ఏడాది మే నెలలో తొలి డ్రోన్ అంబులెన్స్ ప్రయోగాత్మకంగా గాల్లోకి ఎగిరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇది విజయవంతమైతే, ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవల రంగంలో ఒక చారిత్రాత్మక మార్పుగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణాలు కాపాడే దిశగా ఈ ప్రయత్నం కొత్త దారులు తెరుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.






