Kerala : కేరళలో దారుణం.. వ్యూస్ కోసం వ్యక్తిని బలితీసుకున్న యవతి.!?
జనవరి 16వ తేదీ. కేరళలోని వడకర ప్రాంతానికి చెందిన షిమ్జిత ముస్తఫా అనే యువతి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పక్కనే ఉన్న ఒక వ్యక్తి తనను అసభ్యంగా తాకాడని, లైంగికంగా వేధించాడని ఆమె ఆ వీడియోలో ఆరోపించింది. నిమిషాల వ్యవధిలోనే ఆ వీడియో వేల సంఖ్యలో షేర్ అయ్యింది. లక్షలాది మంది నెటిజన్లు ఆ వ్యక్తిని ‘మృగం’ అని, ‘కామాంధుడు’ అని సోషల్ మీడియా వేదికగా తిట్టిపోశారు. కానీ, సరిగ్గా రెండు రోజుల తర్వాత, ఆ వీడియోలో నిందితుడిగా చూపబడిన 42 ఏళ్ల యు.దీపక్ తన ఇంట్లో శవమై కనిపించడంతో ఈ కథ మరో మలుపు తిరిగింది.
ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి ఆత్మహత్యకు పరిమితం కాలేదు. ఇది నేటి డిజిటల్ ట్రయల్ సంస్కృతికి ఒక పరాకాష్ట. దీపక్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత వెలుగులోకి వచ్చిన వాస్తవాలు సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఆ వీడియోను నిశితంగా గమనించిన వారు, బస్సులోని ఇతర ప్రయాణికులు చెబుతున్న దాని ప్రకారం.. దీపక్ అసభ్యంగా ప్రవర్తించినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. రద్దీగా ఉండే కేరళ బస్సుల్లో సామాన్యంగా జరిగే తోపులాటను కూడా వేధింపుగా చిత్రీకరించి, అతడి ముఖాన్ని స్పష్టంగా చూపిస్తూ వీడియో తీయడం అతడి పరువును నిట్టనిలువునా తీసేసింది. ఆత్మాభిమానం కలిగిన దీపక్, తనపై పడిన ఆ నిందను భరించలేక, సమాజంలో తలెత్తుకోలేక మరణమే శరణ్యమని భావించాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం, రీల్స్ లేదా వీడియోల ద్వారా వ్యూస్ సంపాదించడం కోసం కొందరు యువతీ యువకులు ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. షిమ్జిత చేసిన ఈ పోస్ట్ కూడా కేవలం ప్రచారం కోసమేనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒక వ్యక్తి తప్పు చేశాడని అనిపిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలి లేదా చట్టపరమైన చర్యలు కోరాలి. కానీ, నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ప్రజలనే న్యాయమూర్తులుగా మార్చడం వల్ల ఒక నిరపరాధి ప్రాణం పోయిందన్న వాదన బలంగా వినిపిస్తోంది. దీనిని కేరళ సమాజం ‘డిజిటల్ లించింగ్’గా అభివర్ణిస్తోంది.
ఈ ఘటన కేరళలో పురుషుల భద్రతపై కొత్త చర్చకు దారితీసింది. ఆరోపణ రాగానే విచారణ లేకుండానే నిందితుడిగా ముద్ర వేయడం వల్ల పురుషులు బస్సుల్లో ప్రయాణించాలంటేనే భయపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి, అందులో బస్సుల్లో ప్రయాణించే మగవారు తమ చుట్టూ కార్డ్బోర్డ్ షీట్లను కట్టుకుని ప్రయాణిస్తున్నారు. ఇది వింతగా అనిపించినా, దాని వెనుక ఉన్న ఆవేదన చాలా పెద్దది. “ఎప్పుడు ఏ మహిళ మొబైల్ కెమెరా మనపైకి తిరుగుతుందో, ఎప్పుడు మనల్ని వేధింపుల కేసులో నెట్టేస్తారో తెలియడం లేదు” అని అక్కడి సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి బస్సు కండక్టర్లు కూడా మహిళా ప్రయాణికులకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.
దీపక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు షిమ్జిత ముస్తఫాపై BNS సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమె పరారీలో ఉండటం ఆమె వాదనలో నిజాయితీ లేదని సూచిస్తోంది. అటు మానవ హక్కుల కమిషన్ కూడా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని నార్త్ జోన్ డీఐజీని ఆదేశించింది. ఒక వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేసి అతడి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని కేరళ అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
టెక్నాలజీ మన చేతిలో ఉంది కదా అని ఎదుటివారి ప్రాణాలతో చెలగాటమాడటం నేరం. ఈ ఘటనతోనైనా సోషల్ మీడియా వినియోగదారులు మేల్కోవాలి. ఒక పోస్ట్‌ను లైక్ చేసే ముందు లేదా షేర్ చేసే ముందు అది ఒకరి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తుందేమోనని ఆలోచించాలి. లేకపోతే, రేపు ఏ నిరపరాధి అయినా ఇలాంటి ‘డిజిటల్ తీర్పుల’కు బలైపోయే ప్రమాదం ఉంది.






