BJP : కార్యకర్త నుంచి పార్టీ అధ్యక్షపదవి వరకూ… నితిన్ నబీన్ ప్రస్థానం
నితిన్ నబీన్ 1980లో బిహార్‌లోని పట్నాలో జన్మించారు. ఆయన తండ్రి నబీన్ కిషోర్ సిన్హా బీజేపీలో సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే. 2006లో తండ్రి ఆకస్మిక మరణంతో నితిన్ రాజకీయాల్లోకి రావడం అనివార్యమైంది. అప్పటికి ఆయన వయసు 26 ఏళ్లు మాత్రమే. తండ్రి మరణంతో ఖాళీ అయిన పట్నా వెస్ట్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘనవిజయం సాధించారు. అనంతర కాలంలో ఆ నియోజకవర్గం బాంకీపుర్గా మారింది. అప్పటి నుంచి వరుసగా నాలుగుసార్లు (2010, 2015, 2020) ఎమ్మెల్యేగా గెలుపొంది ఓటమి ఎరుగని నేతగా నిలిచారు.
కేవలం ఎమ్మెల్యేగానే కాకుండా పార్టీ అనుబంధ విభాగాల్లోనూ నితిన్ నబీన్ చురుగ్గా పనిచేశారు. భారతీయ జనతా యువమోర్చా (BJYM) జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా పర్యటించి యువతను పార్టీ వైపు ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించారు. సిక్కిం రాష్ట్రానికి యువమోర్చా ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. పార్టీ పెద్దల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ ఆయనకు అదనపు బలంగా మారింది.
సంక్షోభ విమోచకుడిగా.. వ్యూహకర్తగా
బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వ హయాంలో రోడ్ల నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేసిన నితిన్ నబీన్, ‘పథ్ నిర్మాణ్’లో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ తర్వాత అధిష్ఠానం ఆయన సేవలను జాతీయ స్థాయికి విస్తరించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర బీజేపీ సహ-ఇన్‌ఛార్జ్‌గా, ఆ తర్వాత పూర్తి స్థాయి ఇన్‌ఛార్జ్‌గా నియమించింది. అక్కడ పార్టీ సంస్థాగత నిర్మాణంలో, అసెంబ్లీ ఎన్నికల వ్యూహరచనలో ఆయన పోషించిన పాత్రను మోదీ-షాల ద్వయం గుర్తించింది. తాజాగా గుజరాత్ ఎన్నికల సమయంలోనూ పశ్చిమ జోన్ బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
గత డిసెంబరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఆ వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైనప్పుడే ఆయనకు పెద్ద బాధ్యతలు అప్పగిస్తారని సంకేతాలు వెలువడ్డాయి. నడ్డా వారసుడిగా హిందీ బెల్ట్ నుంచి, అందునా యువతరానికి చెందిన వ్యక్తి అయితే బాగుంటుందన్న పార్టీ ఆలోచన నితిన్ నబీన్‌కు మార్గం సుగమం చేసింది. 46 ఏళ్ల వయసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుల్లో ఒకరిగా నిలిచారు నితిన్ నబీన్..






