EU:గ్రీన్ లాండ్ విషయంలో ఏకతాటిపైకి ఈయూ..! డెన్మార్క్‌కు మద్దతుగా ప్రకటన..!
గ్రీన్ లాండ్ విషయంలో అమెరికా దూకుడు.. మిత్రదేశాలైన ఈయూకి ఆందోళన కలిగిస్తోంది. చచ్చినట్లు గ్రీన్ లాండ్ ఇవ్వాల్సిందే .. లేదంటే నయానో, భయానో స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరించడం.. ఆయా దేశాలకు రుచించడం లేదు. తమకు మద్దతివ్వకుంటే పదిశాతం అదనపు సుంకాలు విధిస్తామని.. దారికి రాకుంటే దాన్ని 25 శాతానికి పెంచుతామని ట్రంప్ బెదిరించడం.. యూరోపియన్ దేశాలకు ఆగ్రహం కలిగిస్తోంది. ప్రజాస్వామ్య సూత్రాలను మూలవిధానాలుగా కలిగి ఉన్న తాము.. అమెరికా బెదిరింపులకు తలొగ్గే ప్రసక్తే లేదంటున్నాయి ఈయూ దేశాలు.
గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై 10శాతం అదనపు సుంకాలను విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై బ్రిటన్‌తోపాటు ఈయూ దేశాలు మండిపడ్డాయి. అదనపు సుంకాల హెచ్చరిక ఘోర తప్పిదమని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ వ్యాఖ్యానించారు.
తమ దేశ భద్రత విషయంలో గ్రీన్లాండ్ ఎంతో ముఖ్యమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదేపదే చెబుతున్నారు. ఈ ప్రాంతం డెన్మార్క్ నియంత్రణలో ఉంది. ఈ నేపథ్యంలో యూరప్ దేశాలు డెన్మార్క్‌కు మద్దతుగా నిలిచాయి. గ్రీన్లాండ్ భద్రత నాటో ఉమ్మడి బాధ్యతని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, బ్రిటన్లు అక్కడికి బలగాలను తరలించాయి. ఈ పరిణామాల నడుమే డెన్మార్క్‌తోపాటు ఈ 7 దేశాలపై ట్రంప్ 10 శాతం అదనపు సుంకాలను ప్రకటించారు. ఇవి ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. అప్పటికీ దిగిరాకపోతే జూన్ నుంచి ఆ సుంకాలను 25శాతానికి పెంచుతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బ్రిటన్‌సహా ఈయూ దేశాలు స్పందించాయి.
‘నాటో సభ్య దేశాలుగా గ్రీన్లాండ్ భద్రత కోసం చర్యలు తీసుకుంటే సుంకాలు విధిస్తామని హెచ్చరించడం పూర్తిగా తప్పు. ఈ విషయాన్ని నేరుగా అమెరికా యంత్రాంగంతో తేల్చుకుంటాం’ అని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. గ్రీన్లాండ్ ఎప్పటికీ డెన్మార్క్‌లో భాగమేనని స్పష్టం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
‘సుంకాల బెదిరింపులు ఆమోదయోగ్యం కాదు. ఏ బెదిరింపులకు లొంగేది లేదు’ అని మెక్రాన్ వ్యాఖ్యానించారు. ఐరోపా దేశాలన్నీ తగిన సమాధానం ఇస్తాయని స్పష్టం చేశారు. మిత్ర దేశాల మధ్య విభేదాలతో రష్యా, చైనాలకే ప్రయోజనం కలుగుతుందని ఈయూ విదేశాంగ విధాన చీఫ్ కాజా కల్లాస్ పేర్కొన్నారు.
తమను బ్లాక్ మెయిల్ చేయలేరంటూ స్వీడన్ ప్రధాని ఉల్ఫ్ క్రిస్టెర్సన్ స్పష్టం చేశారు.అంతర్జాతీయ చట్టాన్ని కాపాడుకునే విషయంలో ఈయూ ఎల్లప్పుడూ దృఢంగా ఉంటుందని యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా స్పష్టం చేశారు. ట్రంప్ ప్రకటన ఆశ్చర్యకరమని డెన్మార్క్ విదేశాంగ మంత్రి రాస్‌మ్యూసెన్ తెలిపారు.మిత్రుల మధ్య హెచ్చరికలు సరికావని నార్వే ప్రధాని జోనాస్ గర్ స్టోర్ వ్యాఖ్యానించారు.చర్చల ద్వారా మిత్రుల మధ్య సమస్యలను పరిష్కరించుకోవాలని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అభిప్రాయపడ్డారు.






