India-UAE: 2 గంటల కోసం 6 గంటల ప్రయాణం.. మోదీ-యూఏఈ అధ్యక్షుడి భేటీ!
భారత్-యూఏఈ (India-UAE) స్నేహానికి అద్దం పట్టే అరుదైన ఘట్టం ఢిల్లీలో ఆవిష్కృతమైంది. కేవలం రెండు గంటల పర్యటన కోసం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సోమవారం భారత్ వచ్చారు. పాలం ఎయిర్పోర్టులో ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలికి, స్వయంగా తన కారులోనే అధికారిక నివాసానికి తీసుకెళ్లడం వారి మధ్య ఉన్న గాఢమైన సాన్నిహిత్యాన్ని సూచిస్తుందని విదేశాంగ శాఖ సెక్రెటరీ విక్రమ్ మిస్రీ చెప్పారు.
భారత్లో (India-UAE) కేవలం గంటా 45 నిమిషాలు మాత్రమే ఉన్న యూఏఈ అధ్యక్షుడు.. ఈ స్వల్ప వ్యవధిలోనే పలు కీలక ఒప్పందాలు చేసుకోవడం గమనార్హం. ఇరువురు నేతలు ఎన్నో అంశాలపై విస్తృత చర్చలు జరిపినట్లు మిస్రీ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇంధన భద్రత, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో చారిత్రాత్మక ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకున్నాయి.
అలాగే 2028 నుంచి పదేళ్ల పాటు భారత్కు ఏటా 5 లక్షల మెట్రిక్ టన్నుల ఎల్ఎన్జీ (LNG) సరఫరా చేసేందుకు యూఏఈ అంగీకరించింది. అణుశక్తి, ఏఐ సహా పలు సాంకేతిక రంగాలకు సంబంధించి కూడా ఇరుదేశాల (India-UAE) మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. భారీ న్యూక్లియర్ రియాక్టర్లతోపాటు చిన్న మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల అభివృద్ధి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)లో పెట్టుబడులు పెట్టడంతోపాటు భారత్లో సూపర్ కంప్యూటింగ్ క్లస్టర్ల ఏర్పాటుకు కూడా సహకరిస్తామని యూఏఈ తెలిపింది.
ప్రస్తుతం 100 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, 2032 నాటికి 200 బిలియన్ డాలర్లకు పెంచాలని ఇరుదేశాలు (India-UAE) లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇదే క్రమంలో ఉగ్రవాదంపై ఉమ్మడి ప్రకటన చేసిన ఈ దేశాలు.. సీమాంతర ఉగ్రవాదాన్ని (Cross-border terrorism) తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం లేదా ఆర్థిక సాయం అందించే వారిని కూడా కఠినంగా శిక్షించాల్సిందేనని ఇరువురు నేతలు తీర్మానించారు. అలాగే గుజరాత్లోని ధోలెరాలో పెట్టుబడులు పెట్టడంపై యూఏఈ ఆసక్తి కనబరిచింది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
డిజిటల్ రంగంలో సార్వభౌమత్వాన్ని కూడా గౌరవిస్తూ.. డిజిటల్ ఎంబసీల ఏర్పాటుపై కూడా ఇరుదేశాలు (India-UAE) చర్చలు జరిపాయి. కాగా, కేవలం గంటా 45 నిమిషాల సమావేశం కోసం అల్ నహ్యాన్.. రానుపోను ఏకంగా 6 గంటలు ప్రయాణించడం విశేషం. వేరే దేశానికి వెళ్తూ కాకుండా, ప్రత్యేకంగా ఈ భేటీ కోసమే ఆయన భారత్కు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.






