EUROPE: అమెరికాపై ట్రేడ్ బజూకను ప్రయోగిస్తామంటున్న యూరప్..?
అమెరికా అధ్యక్షుడు గ్రీన్ లాండ్ కోసం తపించిపోతున్నారు. తమ దేశ భద్రతకు గ్రీన్ లాండ్ అత్యవసరమని పదేపదే చెబుతున్నారు. అవసరమైతే కఠిన పద్ధతుల్లో అయినా గ్రీన్ లాండ్‌ను స్వాధీనం చేసుకుంటామంటున్నారు. అంతేకాదు.. తమను ధిక్కరిస్తే, గ్రీన్ లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని దేశాలపై పదిశాతం అదనపు సుంకాలు విధిస్తామని యూరప్ దేశాలకు ట్రంప్ హెచ్చరికలు పంపారు. ఈ పరిణామం యూరప్ దేశాల్ని నిర్ఘాంత పరిచింది .ట్రంప్ బరితెగిస్తుండడంతో.. కౌంటర్ అస్త్రాన్ని సిద్ధం చేస్తోంది ఈయూ.
ట్రంప్ టారిఫ్‌లకు బదులిచ్చేందుకు తమ వద్ద ఉన్న శక్తిమంతమైన సాధనాన్ని ఉపయోగించాలని ఈయూ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశ భద్రత విషయంలో గ్రీన్లాండ్ ఎంతో ముఖ్యమని, దాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ పదేపదే చెప్తున్న నేపథ్యంలో తన వాణిజ్య ఆయుధం ‘ట్రేడ్ బజూక’ (Trade bazooka)ను తొలిసారి వాడాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది.
ట్రేడ్ బజూక..?
ట్రంప్ (Donald Trump) బెదిరింపు వేళ.. బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఆదివారం యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు అత్యవసరంగా సమావేశమయ్యారు. సుంకాలను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, యూఎస్‌తో సంబంధాలపైనా చర్చ జరిగింది. ఈ క్రమంలో ఎటువంటి బెదిరింపులకు లొంగబోమని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ స్పష్టం చేశారు. అలాగే తమ యూనియన్‌కు చెందిన ట్రేడ్ బజూకను తొలిసారి ఉపయోగించేందుకు సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఈయూయేతర దేశాల నుంచి వచ్చే ఆర్థికఒత్తిడికి వ్యతిరేకంగా తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు రూపొందించిన వ్యవస్థ ఇది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
దీనిద్వారా కౌంటర్ టారిఫ్‌లు విధించడానికి వీలు కలుగుతుంది. యూరప్ మార్కెట్లో అమెరికా (USA) తన వస్తుసేవలను విక్రయించుకోవడంపై పరిమితులు విధించే వీలు కలుగుతుంది. అమెరికన్ కంపెనీలకు లాభదాయకంగా ఉండే ఈయూ కాంట్రాక్ట్‌ల విషయంలో బిడ్డింగ్‌ను నిరోధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ టూల్‌ను ఉపయోగించడం అంటే.. తమ ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేలా చర్యలు ఉంటాయని స్పష్టమైన సందేశం పంపడమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






