Harish Rao: సుప్రీంకోర్టే కొట్టివేసిన.. మళ్లీ విచారణ : హరీశ్ రావు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడబోమని మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. సిట్ (SIT) విచారణకు హాజరయ్యే ముందు కోకాపేటలో కేటీఆర్ (KTR), పార్టీ నేతలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు సిట్ నోటీసులు ఇచ్చారని, సీఎం (CM) ఆడుతున్న సిల్లీ డ్రామా ఇది అని వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇచ్చింది. చట్టాలపై గౌరముంది. పిలిచిన సమయానికి విచారణకు హాజరవుతా. నేను ఏ తప్పూ చేయలేదు. భయపడను. రేవంత్ బామ్మర్ది బాగోతం , మున్సిపల్ ఎన్నికల ముందు అవినీతిని బయటపెట్టినందుకే నోటీసులు ఇచ్చారు. ఇలాంటివి నాకు కొత్త కాదు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ నాయకత్వంలో పోరాడాం. ఆరు గ్యారంటీలు, ఇతర హామీల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం అని అన్నారు.
బొగ్గు కుంభకోణం, వాటాల పంచాయతీ ప్రజలకు అర్థమైంది. వాటి నుంచి ప్రజలు, మీడియా దష్టి మళ్లించేందుకే ఇలాంటి చర్యలు చేపట్టారు. పంచాయతీ ఎన్నికల్లో రేవంత్ అంచనాలు తప్పాయి. వారు ఊహించని స్థాయిలో బీఆరఎస్‌కు స్థానాలు వచ్చాయి. కష్ణా నీటిని ఆంధ్రాకు అప్పగిస్తున్నారు. రెండేళ్ల నుంచి ఫోన్ ట్యాపింగ్‌పై డ్రామాలు ఆడుతున్నారు. గతంలో నాపై పెట్టిన కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు కొట్టేశాయి. న్యాయం మావైపు ఉంది. సుప్రీంకోర్టే కొట్టివేసిన తర్వాత మళ్లీ నోటీసులు ఇచ్చిన విచారణకు పిలవడమేంటి? ఎన్నిసార్లు పలిచినా వస్తాం. అవినీతి బాగోతాలను బయటపెడుతూనే ఉంటాం అని అన్నారు.






