Telangana: తెలంగాణలో ‘బొంద’ల రాజకీయం…!!
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం “బొంద పెట్టాలి” అనే పదం చుట్టూ పెద్ద దుమారమే రేగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, దానికి బీఆర్ఎస్ ఇస్తున్న కౌంటర్లు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఖమ్మం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెరలేపాయి. ఒకప్పుడు తాను పెరిగిన తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నామరూపాలు లేకుండా చేసిన కేసీఆర్‌పై రేవంత్ తన కసిని వెళ్లగక్కారు. అయితే, దీనికి బీఆర్ఎస్ ఇస్తున్న రిటార్ట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, ఆయన రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచే మొదలైంది. తెలంగాణలో నేడు టీడీపీకి బలమైన నాయకత్వం లేకపోయినా, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ సానుభూతిపరులు, కేడర్ ఇంకా ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండటంతో, ఆ ఓటు బ్యాంకులో మెజారిటీ కాంగ్రెస్‌కు మళ్లినట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కేసీఆర్, జగన్ చేతులు కలిపారనే భావన టీడీపీ అభిమానుల్లో బలంగా ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకే రేవంత్ రెడ్డి “టీడీపీని దెబ్బతీసిన కేసీఆర్‌ను, ఆయన బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి” అంటూ సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించారు.
రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అగ్రనేతలు తీవ్రంగా స్పందిస్తూ ఒక చారిత్రక కోణాన్ని ముందుకు తెచ్చారు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేక భావజాలంపైన..! ఎన్టీఆర్ తన జీవితాంతం కాంగ్రెస్ అరాచక పాలనపైనే పోరాడారు. “ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే ఆయన బద్ధశత్రువైన కాంగ్రెస్‌నే బొంద పెట్టాలి కానీ, ఆయన శిష్యుడైన కేసీఆర్‌ను కాదు” అనేది బీఆర్ఎస్ వాదన. రేవంత్ రెడ్డి ఇప్పటికీ టీడీపీ ఏజెంట్‌గా కాంగ్రెస్‌లో పనిచేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వ్యవహారంపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు రేవంత్ ఏమో బీఆర్ఎస్ ను బొంద పెట్టాలంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ ను బొంద పెట్టాలంటోంది. మరికొందరు నెటిజన్లు “అసలు ఒకప్పుడు టీడీపీలో కలిసి పనిచేసిన రేవంత్, కేసీఆర్.. ఇప్పుడు ఒకరినొకరు బొంద పెట్టుకుంటామనడం విడ్డూరంగా ఉంది” అని కామెంట్ చేస్తున్నారు.
తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోవడానికి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రధాన కారణం అనడంలో సందేహం లేదు. ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబు ఏపీకి పరిమితం కావడం, ఇక్కడి నేతలంతా బీఆర్ఎస్ లో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి పిలుపుతో పాత టీడీపీ శ్రేణులు ఆలోచనలో పడ్డాయి. అయితే, రేవంత్ కాంగ్రెస్ లో ఉండి టీడీపీ గురించి మాట్లాడటాన్ని కొంతమంది కాంగ్రెస్ విధేయులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
తెలంగాణలో ఇప్పుడు పాత కక్షలు, పార్టీల మనుగడ చుట్టూ తిరుగుతోంది. రేవంత్ రెడ్డి తన ‘టీడీపీ మూలాలను’ వాడుకొని బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని చూస్తుంటే, బీఆర్ఎస్ అదే ‘ఎన్టీఆర్ సెంటిమెంట్’తో రేవంత్ ను ఇరకాటంలో పెట్టాలని చూస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ‘బొంద’ రాజకీయం ఎవరికి లాభిస్తుందో చూడాలి.






