Karnataka DGP: ఖాకీ డ్రెస్సులో ‘కామ’ లీలలు: కర్ణాటక డీజీపీ బాగోతం బట్టబయలు
కర్ణాటక పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావు, తన అధికారిక కార్యాలయంలోనే ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో దావాగ్నిలా వ్యాపించాయి. ఈ వీడియోలు కేవలం వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించినవి మాత్రమే కాకుండా, ప్రభుత్వ కార్యాలయంలో, జాతీయ జెండా సాక్షిగా జరగడం ఇప్పుడు తీవ్ర నైతిక విమర్శలకు దారితీస్తోంది.
వైరల్ అవుతున్న క్లిప్పింగ్‌లలో రామచంద్రరావు తన ఛాంబర్లో ఉండగా ఒక మహిళతో అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒక వీడియోలో ఆయన పోలీసు యూనిఫాంలో ఉండగానే ఆ మహిళను ముద్దు పెట్టుకోవడం గమనార్హం. మరో క్లిప్‌లో ఆయన సూట్ ధరించి ఉండగా, వెనుక భారత జాతీయ పతాకం, పోలీసు శాఖ చిహ్నం కనిపిస్తున్నాయి. ఈ వీడియోలలో మహిళ ముఖాన్ని బ్లర్ చేసి, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ జోడించి ఉండటాన్ని బట్టి చూస్తే, వీటిని ఎవరైనా ఉద్దేశపూర్వకంగా బయటపెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ ఆరోపణలను డీజీపీ తీవ్రంగా ఖండించారు. ఇవి కేవలం మార్ఫింగ్ వీడియోలని, తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్ర అని ఆయన వాదిస్తున్నారు. తన న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నానని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన మీడియాకు తెలిపారు. అయితే, వీడియోలలో ఉన్న పరిసరాలు, ఆయన ఆహార్యం సహజంగా ఉండటంతో ప్రజల్లో అనుమానాలు పెకెత్తుతున్నాయి.
రామచంద్రరావు వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆయన అనేక వివాదాస్పద అంశాల్లో వార్తల్లో నిలిచారు. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన నటి రన్యా రావుకు ఈయన సవతి తండ్రి. ఆ కేసు సమయంలో ఆయనపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ స్మగ్లింగ్ వివాదం కారణంగానే 2025 మార్చిలో ప్రభుత్వం ఆయన్ను బలవంతంగా సెలవుపై పంపించింది. ఇటీవలే ఆయన తిరిగి విధుల్లో చేరారు, చేరిన కొద్ది రోజుల్లోనే ఈ కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. హోం శాఖ ఉన్నతాధికారులతో చర్చించి, తక్షణమే పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. వివరణ ఇచ్చేందుకు డీజీపీ రామచంద్రరావు హోంమంత్రి జి. పరమేశ్వరను కలిసేందుకు ప్రయత్నించగా, మంత్రి ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇది ప్రభుత్వం ఆయన పట్ల ఎంత కఠినంగా ఉందో సూచిస్తోంది. మాజీ హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. “పోలీసు శాఖ గౌరవాన్ని రామచంద్రరావు గంగలో కలిపారు. ఇంతటి అనైతిక ప్రవర్తన కలిగిన అధికారిపై వెంటనే వేటు వేయాలి” అని డిమాండ్ చేశారు.
ఒక సాధారణ కానిస్టేబుల్ తప్పు చేసినా శాఖకు చెడ్డపేరు వస్తుంది, అలాంటిది రాష్ట్ర పోలీసు కేడర్‌లో అగ్రస్థానంలో ఉన్న అధికారి ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవడం కర్ణాటక పోలీస్ ఇమేజ్ను దెబ్బతీసింది. ఈ వీడియోలు ఏడాది క్రితం నాటివని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఇప్పుడు అవి బయటకు రావడం వెనుక శాఖా పరమైన శత్రుత్వం ఉందా లేక మరేదైనా బ్లాక్ మెయిలింగ్ కోణం ఉందా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఒకవేళ ఆరోపణలు నిజమని తేలితే, రామచంద్రరావు తన కెరీర్లోనే అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కోక తప్పదు.






