NYTTA: న్యూయార్క్ లో ఘనంగా నైటా సంక్రాంతి సంబరాలు
భోగి పండ్ల వేడుకకు మంచి స్పందన
అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ లో స్థిరపడిన తెలుగువారు ఘనంగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు అసోసియేషన్ (నైటా) ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా నైటా నిర్వహించిన చిన్న పిల్లలకు భోగి పండ్ల కార్యక్రమం వైభవంగా జరిగింది. స్థానిక సౌతెర్న్ పార్క్ వేలో ఉన్న సాయి మందిర్ కు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కుటుంబాలు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. అమెరికాలోనే పుట్టిపెరిగిన చిన్నారులకు మన పండుగలు, సంప్రదాయాలు తెలిసేలా పండుగలను ప్రతీ యేటా నైటా నిర్వహిస్తోంది. రేగు పండ్లు, నాణేలు, పూలు, చెరకు ముక్కలతో భోగి పండ్లు పోసి, పిల్లలందరూ శ్రీమన్నారాయణుడి ఆశీర్వాదంతో ఆయురారోగ్యాలతో ఉండాలని పెద్దలందరూ దీవించారు.
పద్మశ్రీ నోరి దత్తాత్రేయుడు, పైళ్ల సాధన మల్లారెడ్డి పిల్లలందరికీ ఆశీర్వచనాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు అందరికీ నైటా తరపున బహుమతులు అందించారు. నైటా ప్రెసిడెంట్ రవీందర్ కోడెల, ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.






