Jagan: వైసీపీలో కొత్త పవర్ సెంటర్? వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఊహాగానాలు..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) పార్టీని పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు వైసీపీ అంటే జగన్ ఒక్కరే అన్న భావన ఉండగా, ఇకపై ఆ చిత్రాన్ని మార్చాలని ఆయన భావిస్తున్నారట. పార్టీలో కొత్త నాయకత్వాన్ని ముందుకు తెచ్చి, బాధ్యతలను పంచేలా వ్యవస్థను రూపొందించాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీలో ఇప్పటివరకు లేని ఒక కొత్త కీలక పదవిని సృష్టించాలనే చర్చ సాగుతోంది. ఆ పదవే వర్కింగ్ ప్రెసిడెంట్ (Working President). పార్టీకి సర్వాధికారిగా జగన్ కొనసాగుతారు కానీ, రోజువారీ పార్టీ కార్యక్రమాలు, రాజకీయ వ్యూహాలు, మీడియా సమన్వయం వంటి బాధ్యతలు ఈ కొత్త పదవిలో ఉన్న నాయకుడే చూసేలా ప్రణాళిక రూపొందుతున్నట్లు సమాచారం. దీంతో పార్టీ మరింత యాక్టివ్గా కనిపించాలన్నది జగన్ ఆలోచనగా చెబుతున్నారు.
వైసీపీకి ప్రస్తుతం సుమారు 40 శాతం ఓటు బ్యాంక్ ఉందని అంచనా. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల మద్దతు పార్టీకి బలంగా ఉంది. అయితే రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఈ ఓటు శాతం సరిపోదని, కనీసం మరో ఐదు నుంచి ఆరు శాతం మద్దతు పెంచుకోవాల్సిన అవసరం ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో బీసీలను ఆకట్టుకునేందుకు వేసిన వ్యూహాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రస్తుతం బీసీలలో పెద్ద భాగం టీడీపీ వైపు ఉన్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి.
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) ఉండగా, రాష్ట్ర స్థాయిలో పల్లా శ్రీనివాస్ (Palla Srinivasa Rao) లాంటి నాయకులకు బాధ్యతలు ఇచ్చి బీసీలకు పెద్ద పీట వేస్తోంది. ఇదే తరహా ఫార్ములాను ఇప్పుడు వైసీపీ కూడా అనుసరించాలనే ఆలోచనలో ఉందని సమాచారం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన సీనియర్ బీసీ నేతకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన చర్చలో ఉంది.
ఈ క్రమంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada Rao) పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు విషయాలపై స్పష్టమైన అవగాహన ఉండటం, అనవసర వ్యాఖ్యలు చేయకుండా గణాంకాలు, రికార్డులతో మాట్లాడటం ఆయనకు ఉన్న ప్రత్యేకతగా చెబుతారు. ప్రభుత్వ తప్పులను సూటిగా ఎత్తిచూపడంలో ఆయనకు మంచి పేరు ఉంది. ఈ లక్షణాలే ఆయనను కీలక బాధ్యతకు అనువైన వ్యక్తిగా మారుస్తున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఉత్తరాంధ్రలో బీసీ జనాభా అధికంగా ఉండటం, అక్కడ 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండటం వల్ల ఏపీలో అధికార మార్పుకు ఆ ప్రాంతం కీలకంగా మారుతోంది. ఇప్పటికే బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) కు శాసనమండలిలో ప్రతిపక్ష నేత పదవి ఇచ్చిన జగన్, మరో సీనియర్ బీసీ నాయకుడికి పార్టీ స్థాయిలో కీలక బాధ్యత అప్పగించడం ద్వారా సామాజిక సమీకరణను బలోపేతం చేయాలని చూస్తున్నారట. ఈ ప్రచారం ఎప్పుడు అధికారికంగా మారుతుందో చూడాల్సి ఉంది.






