Jagan: రూమర్స్ మధ్య స్పష్టత… పాదయాత్ర పై జగన్ కీలక ప్రకటన..
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) త్వరలో బస్సు యాత్ర, జిల్లా టూర్లు చేస్తారని జరుగుతున్న ప్రచారాల మధ్య తాజాగా తన తదుపరి పాదయాత్రపై కీలక ప్రకటన చేశారు. మరో ఏడాదిన్నర తర్వాత తాను మళ్లీ పాదయాత్రకు సిద్ధమవుతున్నానని, అది ఏలూరు (Eluru) నుంచే ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం (Tadepalli Camp Office)లో ఏలూరు నియోజకవర్గానికి చెందిన పార్టీ కేడర్‌తో జరిగిన సమావేశంలో జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ భేటీలో కారుమూరి సునీల్ (Karumuri Sunil), జయప్రకాశ్ (Jaya Prakash) సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సమావేశంలో నియోజకవర్గ సమస్యలపై వివరాలు తెలుసుకున్న జగన్, తాజా రాజకీయ పరిణామాలపై కూడా విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు తన కార్యాచరణ ఎలా ఉండబోతోందో స్పష్టత ఇచ్చారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు వైసీపీ వైపే ఆశతో చూస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ఏ వర్గానికీ స్పష్టమైన మేలు చేయలేదని విమర్శించారు. విద్యార్థులు, రైతులు, యువత, మహిళలు ఇలా ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే వైసీపీ జెండా పట్టుకుని వారి తరపున పోరాడుతుందని చెప్పారు. ఇదే స్ఫూర్తిని కేడర్ అంతా కొనసాగించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రతి ఇంట్లో ఇదే చర్చ జరుగుతోందని జగన్ అభిప్రాయపడ్డారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి ఇంకా మూడేళ్ల కాలమే మిగిలి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈలోగా పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తాను మరో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని తెలిపారు. ఆ పాదయాత్ర దాదాపు ఏడాదిన్నర పాటు సాగుతుందని, ఈ కాలంలో ఎక్కువ సమయం ప్రజల మధ్యే ఉంటానని చెప్పారు. అంతకుముందుగా ప్రతీవారం ఒక్కో నియోజకవర్గ నాయకులతో సమావేశాలు నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తానని వెల్లడించారు.
ఈ పాదయాత్ర ప్రధాన ఉద్దేశ్యం పార్టీ నిర్మాణాన్ని బలపరచడం, ప్రతి కార్యకర్తకు అండగా నిలవడం, కేడర్‌తో నేరుగా మమేకం కావడమేనని జగన్ స్పష్టం చేశారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం కూడా ఈ యాత్ర ద్వారా సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా ఇంత పెద్ద కార్యాచరణను ప్రకటించడంతో ఈ ప్రకటనకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
గతంలో 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ “ప్రజా సంకల్ప యాత్ర” (Praja Sankalpa Yatra) పేరుతో సుమారు 3,648 కిలోమీటర్ల మేర 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ యాత్రకు వచ్చిన స్పందన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు అదే తరహాలో 2029 ఎన్నికలకు ముందే మరో పాదయాత్ర చేస్తానని ప్రకటించడం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.






