Vladimir Putin: గ్రీన్ లాండ్ ను కొనే సత్తా అమెరికాకే ఉంది… పుతిన్ కీలక వ్యాఖ్యలు..!
గ్రీన్ లాండ్ భద్రతను తామైతేనే సరిగ్గా చూసుకోగలమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. దావోస్ వేదికగా తేల్చి చెప్పారు. తమకు యాజమాన్య హక్కులు కావాలన్నారు. అంతే కాదు.. ఆర్కిటిక్ సముద్రంలో చైనా, రష్యా నుంచి గ్రీన్ లాండ్ కు ప్రమాదముందన్నారు. తామైతే, గ్రీన్ లాండ్(Green land) ను చక్కగా రక్షించగలమన్నారు. ఈ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పందించారు. గ్రీన్ లాండ్ పై తమకు ఆసక్తి లేదన్నారు. తమకు సంబంధించిన విషయం కూడా కాదన్నారు పుతిన్.
రష్యాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన పుతిన్.. గ్రీన్‌లాండ్‌పై ప్రస్తుతం జరుగుతున్న వ్యవహారంతో తమకు పని లేదన్నారు. ఈ సమస్యను అమెరికా, డెన్మార్క్(Denmark)లు కలిసి పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా డెన్మార్క్ గ్రీన్‌లాండ్‌ను ఒక భాగంగా మాత్రమే చూస్తోందని, దానిపై వివక్ష చూపించడం లేదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యవహారంపై ఎవరూ ఆసక్తి చూపిస్తున్నారని తాను అనుకోవడం లేదన్నారు.
ఇతరుల భూభాగాలను స్వాధీనం చేసుకోవడంలో అమెరికా(america)కు సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. గ్రీన్లాండ్ కొనుగోలుకు దాదాపు 1 బిలియన్ డాలర్ల వరకు ఖర్చవుతుందని.. ఆ మొత్తాన్ని భరించగల సామర్థ్యం అగ్రరాజ్యానికి ఉందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 1867లో అలస్కాను రష్యా 7.2 మిలియన్ డాలర్లకు యూఎస్‌కు విక్రయించిన విషయాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు.
గాజా(Gaza) పునర్నిర్మాణానికి సంబంధించి శాంతి మండలి (Board of Peace) ఏర్పాటు చేసిన ట్రంప్ …ఇందులో చేరేందుకు పుతిన్ అంగీకరించారని ప్రకటించారు. అయితే, ఈ ప్రతిపాదనను ఇంకా పరిశీలిస్తున్నామని తాజాగా పుతిన్ స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వాములతో సంప్రదించిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈక్రమంలో మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం అమెరికా స్తంభింపజేసిన తమ ఆస్తుల నుంచి 1 బిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తామని తెలిపారు.






