Varanasi: రాజమౌళి-మహేశ్‌బాబు ‘వారణాసి’ రిలీజ్ తేదీపై క్లారిటీ వచ్చిందోచ్.. ఎప్పుడంటే?
మహేశ్‌బాబు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ (SSMB29) ప్రాజెక్టుకు ‘వారణాసి’ అనే పేరుతో చిత్ర బృందం పనులు వేగవంతం చేసింది. రాజమౌళి సినిమాలు అంటే సాధారణంగా మేకింగ్ కోసం చాలా సమయం పడుతుందనే పేరుంది. అయితే ఈసారి మాత్రం షూటింగ్ పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి, సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని రాజమౌళి కృత నిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది.
పక్కా ప్లానింగ్‌తో షూటింగ్
సాధారణంగా రాజమౌళి చిత్రాలు అత్యున్నత స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX) కలిగి ఉంటాయి. కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతుంటుంది. కానీ ‘వారణాసి’ విషయంలో ముందస్తు ప్రణాళికతో పనులు సాగుతున్నట్లు సమాచారం. బుధవారం సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించిన చిత్ర బృందం, 2027లోనే సినిమా విడుదల ఉంటుందని స్పష్టం చేయడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
అంతర్జాతీయ స్థాయి స్టార్ కాస్ట్
ఈ సినిమాలో మహేశ్‌బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియయాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి హంగులతో, సరికొత్త అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోంది.






