Vijayasai Reddy: బీజేపీలోకి విజయసాయి రెడ్డి? తెర వెనుక ‘బిగ్ స్కెచ్’..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. తాజాగా మాజీ ఎంపీ, వైసీపీ మాజీ కీలక నేత విజయసాయి రెడ్డి రాజకీయ పునరాగమనం ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. గత ఏడాది రాజకీయాలకు స్వస్తి పలికి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన సాయిరెడ్డి, ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్‌లోకి వస్తానని చెప్పడమే కాకుండా, తన గమ్యం ఎటో కూడా పరోక్షంగా హింట్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే ఆయన కమలం తీర్థం పుచ్చుకోవడం దాదాపు ఖాయమనిపిస్తోంది.
విజయసాయి రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై విశ్లేషిస్తే ఆయన ముందున్న ఆప్షన్లు చాలా పరిమితంగా కనిపిస్తున్నాయి. గతంలో వైసీపీలో నంబర్ 2గా ఉన్న సమయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై చేసిన వ్యక్తిగత విమర్శలు సామాన్యమైనవి కావు. ఆ గాయాలు టీడీపీ కేడర్‌లో ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అందుకే, ఆయన్ను పార్టీలోకి చేర్చుకోవడాన్ని టీడీపీ శ్రేణులు ససేమిరా అంటున్నాయి. మరోవైపు, సిద్ధాంతపరంగా జనసేనలో ఇమడటం తనకు సాధ్యం కాదని విజయసాయి భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయనకు సురక్షితమైన, రాజకీయంగా బలమైన వేదిక కేవలం బీజేపీ మాత్రమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
విజయసాయి రెడ్డికి ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్రనేతలతో ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. ఎంపీగా ఉన్న కాలంలో ప్రధాని మోదీ, అమిత్ షాలతో ఆయనకు మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆయన ఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యాలయాన్ని కూడా సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన తర్వాత, ఆ ఖాళీని బీజేపీ భర్తీ చేసుకోవడం కూడా ఈ వ్యూహంలో భాగమేనని ప్రచారం జరుగుతోంది.
నిన్న మీడియా సమావేశంలో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. “కూటమిగా ఉన్నంత కాలం టీడీపీని ఓడించలేరు.. కూటమి విడిపోతేనే వైసీపీకి ఛాన్స్ ఉంటుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. దీని వెనుక పెద్ద ‘మాస్టర్ ప్లాన్’ ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు జగన్ పట్ల అచంచల విశ్వాసం ప్రకటించడం, మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడం చూస్తుంటే.. బీజేపీని కూటమి నుంచి వేరు చేయడం కోసమే ఇవన్నీ చేస్తున్నారా? అనే చర్చ సాగుతోంది. బీజేపీలో చేరి, ఆ పార్టీని టీడీపీ-జనసేన కూటమి నుంచి దూరం చేస్తే, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి మార్గం సుగమం అవుతుందని ఆయన భావిస్తున్నారా? అనే కోణంలో కూటమి నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికీ జగన్ మోహన్ రెడ్డి పట్ల సాయిరెడ్డి చూపిస్తున్న సానుకూలత చూస్తుంటే, ఆయన వైసీపీని వీడింది కేవలం ‘కోటరీ’ విసుగు వల్లనే తప్ప, జగన్ మీద కోపంతో కాదని అర్థమవుతోంది. ఢిల్లీ స్థాయిలో పరిస్థితులను చక్కబెట్టి, జగన్‌కు రాజకీయంగా, చట్టపరంగా రక్షణ కవచంలా నిలిచేందుకే ఆయన బీజేపీ గూటికి చేరుతున్నారనే వాదనకు బలం చేకూరుతోంది. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు చేయడంలో సిద్ధహస్తుడని పేరున్న విజయసాయి రెడ్డి, ఇప్పుడు వేస్తున్న ఈ ‘బిగ్ స్కెచ్’ ఏపీ రాజకీయాలను ఏ తీరానికి చేరుస్తుందో చూడాలి. ఈ నెల 25 తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన పూర్తి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.






