NNNM Movie Review: నారి నారి నడుమ మురారి
తెలుగు టైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు: ఏ కే ఎంటర్టైన్మేంట్స్
తారాగణం: శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, సీనియర్ నరేష్, సునీల్, వెన్నెల కిషోర్, సత్య, అతిధి పాత్రలో శ్రీ విష్ణు, తదితరులు తదితరులు నటించారు
సంగీతం: విశాల్ చంద్రశేఖర్, సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్ విఎస్, యువరాజ్
ఎడిటర్ : రామ్ అబ్బరాజు, నిర్మాతలు: అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర
దర్శకత్వం: రామ్ అబ్బరాజు
విడుదల తేది : 14.01.2026
నిడివి : 2 ఘంటల 25 నిముషాలు
ప్రతి సంక్రాంతికి రకరకాల పిండి వంటల మాదిరిగానే.. రకరకాల జానర్లలో సినిమాలు ఉండేవి. కాని ఈ సంక్రాంతికి మాత్రం ఒక్క ‘ది రాజా సాబ్’ మినహా మిగతా నాలుగు సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌ని గురిపెడుతూ వరుసగా రిలీజ్ అయ్యాయి. మన శంకరవర ప్రసాద్, భర్త మహాశయులకు విజ్ణప్తి, అనగనగా ఒక రాజు, చివరిగా ‘నారి నారి నడుమ మురారి’. ఏ సినిమా అయినా ముఖ్యంగా సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలన్నీ ప్రీమియర్స్ షోలు, బెనిఫిట్ షోలు పడుతుంటాయి. కానీ….ఒకప్పటి మీడియా వారికీ వేసే షోస్ లాగా ‘నారి నారి నడుమ మురారి’ ఫస్ట్ షో వేసారు. మరి ఈ సంక్రాంతి కి 5వ చిత్రం సినిమా థియేటర్స్‌లో నవ్వులు పూయించేందుకు వచ్చేసింది. సరైన హిట్ లేని శర్వా(Sarwa) ఈ సంక్రాంతి బరిలో ధైర్యం గా బరిలోకి దిగాడు. తనకి కలిసొచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్‌ని చేరువ అవుతూ..వింట్ఏజ్ టైటిల్ తో ‘నారీ నారీ నడుమ మురారి’(Nari Nari Naduma Murari)తో ఢీ కొట్టడానికి రెడీ అయ్యాడు. మరి ఈసారి హిట్ కొట్టాడో లేదో సమీక్షలో చూద్దాం.
కథ :
నారీ నారీ నడుమ మురారీ అంటే.. 1990 నాటి బాలకృష్ణ, శోభన, నిరోషాల క్లాసిక్ హిట్ గుర్తొస్తుంది. యువ చిత్ర బ్యానర్ లో ఏ కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే టైటిల్‌తో స్వయంగా బాలకృష్ణ ఈ టైటిల్‌ని లాంఛ్ చేసి శర్వానంద్‌కి విషెష్ అందించడం విశేషం. ఇద్దరు నారీ మణులతో నాడు బాలయ్య డీసెంట్ హిట్ కొట్టగా.. అదే టైటిల్‌తో వచ్చిన శర్వానంద్ నారీ నారీ మధ్య మురారిగా సంక్రాంతి కోసం లోడ్ చేసిన ఫన్ గన్ని ‘విజయ’వంతంగా ఫైర్ చేశారు. ఇక కథా పరంగా చెప్పాలంటే? ఇంజనీరింగ్ చదివి ఓ కంపెనీలో ఆర్కిటెక్‌గా చేసే గౌతమ్ (శర్వానంద్) ప్రముఖ లాయర్ రామ లింగయ్య (సంపత్) కుతురైన తన తోటి ఉద్యోగి నిత్య (సాక్షి వైద్య)(Sakshi Vaidhya) ప్రేమలో పడతాడు. సాంప్రదాయబద్ధంగా హంగు ఆర్భాటం తో పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ వారు పెళ్లికి మాత్రం హంగామా లేకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని కండిషన్ పెడతారు లాయర్ రామ లింగయ్య . కానీ ఆ కండిషన్ దెబ్బతో గౌతమ్ కి అసలు సమస్య ఎదురవుతుంది. ఆదలవుండగా వీరి ప్రేమాయణం సాఫీగా సాగుతున్న తరుణంలో అదే కంపెనీలో టీమ్ లీడర్‌గా గౌతమ్ మాజీ ప్రేయసి దియ (సంయుక్త మీనన్)(Samyuktha Menon) ఎంట్రీ ఇస్తుంది. ఆమె వచ్చిన తరువాత గౌతమ్ పరిస్థితి ‘నారీ నారీ నడుమ మురారి’గా మారుతుంది. అసలు గౌతమ్ ఎవరు? దియకి ఎందుకు దూరమయ్యాడు? వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? గౌతమ్, దియ, నిత్య ఈ ముగ్గురి మధ్య ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి? అన్నది మిగతా సినిమా కథ.
నటీ నటుల హవబావాలు :
ఈ సినిమాలో చాల చోట్ల డీసెంట్ ఫన్ మూమెంట్స్ కనిపిస్తాయి. శర్వానంద్ కామెడీ టైమింగ్ యాజిటీజ్ గా ఫ్లో లో వెళ్ళిపోతుంది. అంతే కాకుండా లీడ్ హీరోయిన్స్ తో కలిపి ముగ్గురికి ఉండే సన్నివేశాలు సెకండాఫ్ లో అక్కడక్కడా రిలీఫ్ గా అనిపిస్తాయి. వీరి ముగ్గురు నడుమ జెనరేట్ అయ్యే ఫన్ ఆ కన్ఫ్యూజన్ అందులో నలిగిపోయే హీరోగా శర్వానంద్ మంచి నటన కనబరిచాడు. తన లుక్స్ స్టైలింగ్ ఈ సినిమాలో ఉంది. ఇద్దరు హీరోయిన్స్ కూడా తమ పాత్రల్లో వాటికి కావాల్సిన రీతిలో నటించారు. ఏ సినిమా కథ అయినా ఎంట్రీ హీరో హీరోయిన్లతో మొదలు పెట్టడం ఆనవాయితీ. కానీ ఈ సినిమా గురించి చెప్పాలంటే.. ముందు నరేష్‌తోనే మొదలుపెట్టడమే అతనికి తగిన గుర్తింపు. హీరోకి తండ్రిగా నటించిన సీనియర్ నరేష్. వయసుకు తగ్గ పాత్రలో ఇరగదీసాడు. సత్యా ఫన్ ట్రాక్ లు కూడా డీసెంట్ ఫన్ ని అక్కడక్కడా జెనరేట్ చేస్తాయి. తమ రోల్స్ లో వారు కూడా బాగా చేశారు. వీరితో పాటుగా సుదర్శన్, నటుడు సంపత్, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు తమ పాత్రల్లో వాటి పరిధి మేరకు బాగా చేశారు. అలాగే ఒక్క చోట ఎమోషనల్ పర్లేదు అనిపిస్తుంది. శ్రీవిష్ణు కామియో రోల్ బాగుంది. తన రోల్ వచ్చాక కొంచెం కథనం తన టేకోవర్ లోకి తీసుకున్నాడు. తను కనిపించిన ఆ కొన్ని సీన్స్ కొంచెం రిలీఫ్ అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం పనితీరు:
విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ వర్క్ యావరేజ్ గా ఉంది. క్లైమాక్స్ లో స్కోర్ బాలేదు. యువరాజ్, జ్ఞానశేఖర్ వి ఎస్ ల కెమెరా వర్క్ బాగుంది. ముఖ్యంగా కేరళ ఎపిసోడ్ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. ఎడిటింగ్ బెటర్ గా చేయాల్సింది. ఈ చిత్రానికి మాస్ జాతర దర్శకుడు భాను భోగవరపు కథ అందించడం జరిగింది. దర్శకుడు రామ్ అబ్బరాజు ‘సామజవరగమన’ చిత్రంతో తాను ఈజీగా నవ్వించగలనని నిరూపించుకున్నారు. ఆయన టేకింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ని రివీల్ చేయకుండా, తన రైటింగ్ స్కిల్‌లో ఒక కొత్తదనాన్ని తీసుకుని రావడం ఆయన స్పెషాలిటీ. ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్‌ని రిపీట్ చేశారు. ఇద్దరు హీరోయిన్ల మధ్య నలిగిపోయే హీరో కథలతో ఇప్పటికే బోలెడన్ని సినిమాలు వచ్చాయి. కానీ.. అలాంటి బోరింగ్ సబ్జెక్ట్‌కి ఫన్ని జోడించి చాలా ఎంగేజింగ్‌గా చూపించారు దర్శకుడు. బలమైన కథే కాదు.. కథని నడిపించే బలమైన పాత్రలతోనూ కథని నడిపించవచ్చని ‘నారీ నారీ నడుమ మురారీ ’ కథతో నిరూపించారు. ఇద్దరు గ్లామర్ బ్యూటీస్ ఉన్నా కూడా.. ఎక్స్‌పోజింగ్‌కి తావు ఇవ్వకుండా ఎంటైర్టైన్మెంట్పైనే ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యారు దర్శకుడు. సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి. ఏకే ఎంటర్టైన్మెంట్స్(A K Entertainments) వారు ఖర్చు కనిపిస్తుంది.
విశ్లేషణ :
శర్వానంద్‌కి ఫ్యామిలీ హీరోగా మంచి పేరు ఉంది. మినిమమ్ గ్యారంటీ హీరోగా మంచి గుర్తింపు కూడా ఉంది కానీ.. తనలోకి ఫ్యామిలీ స్టార్‌ని పక్కనపెట్టి.. ప్రయోగాల వైపు వెళ్లి బోల్తా కొట్టారు శర్వా. ఈ సంక్రాంతి పండుగ నాడు ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రంతో మంచి ఆత్రేయపురం పూతరేకులు లాంటి సినిమాని రుచి చూపించి శర్వా ఈజ్ బ్యాక్ అనిపించారు. పండుగ పూట ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకునే సినిమా అందించారు. నేలవిడిచి సాము చేయకుండా.. తన నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ఏం కోరుకుంటారో అదే చాన్నాళ్ల తరువాత తిరిగి ఇచ్చేశారు. తనలోకి కామెడీ టైమింగ్‌కి మరింత పదును పెడుతూ.. నారీ నారీ నడుమ మురారిగా ఇద్దరి భామల మధ్య నలిగిపోయే పాత్రతో నవ్వుల విందు అందించారు శర్వా. ఓవరాల్‌గా.. ‘నారీ నారీ నడుమ మురారి’ కుటుంభ సమేతంగా చూడాల్సిన సినిమా! చివరిగా విడుదలైన శర్వా సినిమా కూడా సంక్రాంతి పండక్కి చక్కని నవ్వుల విందు.






